చుక్కేసి రోడ్డెక్కితే జైలుకే..!

drunk and drivers are sent to jail - Sakshi

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడుతున్న మందుబాబులు

బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్షలతో గుర్తింపు

గత ఏడాదిలో 126, ఈ ఏడాది 27 మంది జైలుకు 

 ఇందులో 80 శాతం మంది యువతనే..!

రూ.1.89  లక్షల వరకు జరిమానా

మద్యంమత్తులో ప్రమాదాలు

ఆదిలాబాద్‌ : మందు చుక్కేసి వాహనాలు నడిపిస్తూ మందుబాబులో చిక్కుల్లో పడుతున్నారు. గత రెండేళ్లుగా జైలుకు క్యూ కడుతున్నారు. పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌(మద్యం సేవించి వాహనాలు నడపడం) కింద కేసులు నమోదు చేసి కోర్టుకు పంపిస్తుండగా.. న్యాయమూర్తి నిర్ణయం మేరకు అందులో సగం మందికి మూడు నుంచి ఏడు రోజుల వరకు జైలు శిక్షలు పడుతున్నాయి. దొంగతనాలు, దోపిడీలు వంటి ఇతర రకాల కేసుల కంటే నిత్యం డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు అధికం అవుతుండడం గమనార్హం. మద్యం సేవించి వాహనాలు నడపడంతోనే ఈ పరిస్థితి ఏర్పడుతోంది. 70 శాతం ప్రమాదాలు మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల జరుగుతున్నాయనేది నమ్మలేని వాస్తవం. మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలు జరగడం వల్ల ఏటా వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో యువత ఎక్కువ పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్తుండడం గమనార్హం. దీంతో జైలులో సాధారణ ఖైదీల కంటే మందుబాబులతోనే నిండిపోతున్నాయి.   

యువతనే అధికం.. 

సరదా.. వ్యసనం.. వ్యక్తిగత సమస్యలు.. మానసిక ఒత్తిడి.. కారణమేదైనా ఉపశమనం పొందేందుకు మద్యం తాగడం పరిపాటిగా మారింది. రిలాక్స్‌ అయ్యేందుకు బార్‌లకు వెళ్లే మద్యంప్రియులకు మత్తు ఎక్కువైనా వాహనాలు నడుపుతున్నారు. యువత మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రిపుల్‌ రైడింగ్‌ చేయడం, అతివేగంతో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలకు కారణం అవుతున్నారు. దీంతో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసుల్లో ఎక్కువ మంది యువతే పట్టుబడుతున్నారు. 80 శాతం మంది యువకులు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇటీవల మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారి సంఖ్య అధికమవుతోంది. పోలీసు కేసులు కూడా ఎక్కువగానే నమోదు అవుతున్నాయి. మద్యం సేవించి వాహనాలు నడుపడం వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని మిగుల్చుతున్నాయి. ఇందులో ముఖ్యంగా యువత రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నట్లు తెలుస్తోంది. మద్యం సేవించడం, అతివేగంగా వాహనాలు నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రాత్రి సమయంలో మద్యం సేవించి అతివేగంగా వాహనాలు నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. తన ప్రాణాలతోపాటు అమాయకులు సైతం ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. 18 ఏళ్లలోపు పిల్లలు కూడా లైసెన్సు లేకుండా వాహనాలు నడపడం వల్ల ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మద్యం సేవించి ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు నడిపేవారిని బ్రీత్‌ ఎనలైజర్‌ యంత్రంతో గుర్తిస్తున్నారు. ఇలా గుర్తించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుంది.  

పోలీసుల తనిఖీలు

జిల్లాలో మందుబాబుల ఆగడాలను అరికట్టి, రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంల్లోనే రోడ్డు ప్రమాదాలు జరగడానికి కారణం మద్యం సేవించడమేనని పోలీసులు చెబుతున్నారు. జిల్లా కేంద్రం ఆదిలాబాద్‌లో రాత్రి 12 గంటల వరకు ట్రాఫిక్‌ పోలీసులతోపాటు వన్‌టౌన్, టూటౌన్, మావల పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహిస్తున్నారు. 

బ్రీత్‌ ఎనలైజర్‌ను వాహన చోదకుడి నోటి ముందు పెట్టి శ్వాస వదలమంటారు. శ్వాస ఊదిన వ్యక్తి మద్యం సేవించి ఉన్నట్లయితే ఆ యంత్రంలో ఆల్కహాల్‌ శాతం నమోదవుతుంది. శ్వాస ఊదినప్పుడు యంత్రంలో కనీసం 30 శాతం ఆల్కాహాలు సేవించినట్లు నమోదైతే అతనిపై కేసులు నమోదు చేస్తారు. ఎక్కువ మోతాదులో మద్యం సేవించినట్లయితే 60 నుంచి 120 శాతం వరకు యంత్రంలో చూపిస్తుంది. ఇలాంటి వారికి పెద్ద మొత్తంలో జరిమానాతోపాటు కోర్టులో జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. శ్వాస పరీక్షల సమయం, ఎంత శాతం ఆల్కాహాలు సేవించారనే వివరాలన్నీ శ్వాస యంత్రం నుంచి రశీదు బయటకు వస్తుంది. ఈ మేరకు కేసు నమోదు చేసిన తర్వాత వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుంటారు. వాహనదారుడిని మరుసటి రోజు న్యాయస్థానంలో హాజరుపరుస్తారు. న్యాయమూర్తి ఇచ్చే తీర్పును బట్టి జరిమానా, జైలు శిక్ష ఉంటుంది. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ మరింతగా బలోపేతం చేసి మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.  
మద్యం సేవించి వాహనాలు నడిపేతే చర్యలు

మద్యం సేవించి వాహనాలు నడిపై వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ ద్వారా కేసులు నమోదు చేస్తున్నాం. రాత్రి సమయంలో ప్రతి కూడళ్లలో పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ వాడాలి. మద్యం సేవించడమే కాకుండా హెల్మెట్‌ లేకపోవడం వల్ల కూడా ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలు కోల్పోతున్నారు.                 – నర్సింహారెడ్డి, ఆదిలాబాద్‌ డీఎస్పీ
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top