ఆమెకు తప్పని ‘వేధింపులు’

Doctor Harassment of Nurse in Hyderabad - Sakshi

సైబరాబాద్‌ షీ బృందాలకు మార్చి నెలలో వచ్చిన ఫిర్యాదులు 112  

62 కేసులు నమోదు

ఇంటర్వ్యూలో పరిచయమై ఎస్‌ఎంఎస్‌లతో వేధిస్తున్న వ్యక్తి అరెస్టు

ఆకతాయిలకు కౌన్సెలింగ్‌

సాక్షి, సిటీబ్యూరో: పనిచేసే కార్యాలయం...ఇంటరయ్వలు జరిగే ప్రాంతం...చదువుకునే ప్రాంతం...ఇలా ఎక్కడైనా పరిచయమైన యువతులతో సన్నిహితంగా మెలుగుతూనే వేధింపులకు గురిచేస్తూ సైబరాబాద్‌ షీ బృందాలకు చిక్కుతున్న ఆకతాయిల సంఖ్య పెరుగుతోంది. మార్చి 1 నుంచి 16వ తేదీవరకు సైబరాబాద్‌ షీ బృందాలు సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చిన 112 ఫిర్యాదుల్లో 62 కేసులు నమోదు చేశారు. ఇందులో 54 మంది నిందితులను అరెస్ట్‌ చేశారు. వీటిలో 16 క్రిమినల్‌ కేసులుండగా, 36 పెట్టీ కేసులు ఉన్నాయి. ఈవ్‌టీజర్లందరికి గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలోని ఉమెన్‌ అండ్‌ చిల్డ్రన్‌ సేఫ్టీ వింగ్‌ వద్ద కౌన్సెలింగ్‌ నిర్వహించినట్లు షీ టీమ్స్‌ ఇన్‌చార్జ్‌ అనసూయ మంగళవారం తెలిపారు. బస్‌స్టాప్‌లు, షాపింగ్‌ మాల్స్, రైల్వే స్టేషన్లు, ట్యుటోరియల్స్, కాలేజీల్లో 129 డెకాయ్‌ అపరేషన్లు నిర్వహించినట్లు తెలిపారు. 61 జాగృతి కార్యక్రమాలు నిర్వహించి 14,940 మందికి మహిళా చట్టాలపై అవగాహన కల్పించామన్నారు.  

నర్సు పట్ల వైద్యుడి అసభ్యప్రవర్తన...
శేర్‌లింగంపల్లి, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఐదేళ్లుగా పనిచేస్తున్న ఓ నర్సుతో ఈ నెల 9న అదే సెంటర్‌లో పని చేస్తున్న వైద్యుడు డాక్టర్‌ రాంరెడ్డి అసభ్యంగా ప్రవర్తించాడు. తన క్యాబిన్‌లో నుంచి ఇతర సిబ్బందిని బయటకు పంపించి బాధితురాలిని పిలిచి అసభ్యంగా వ్యవహరించాడు. దీంతో బాధితురాలు షీ బృందానికి ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన షీ టీమ్‌ సభ్యులు నిందితుడిని అరెస్టు చేసి చందానగర్‌ పోలీసులకు అప్పగించారు. అలాగే మాదాపూర్‌లోని హైటెక్‌సిటీలో ఓ కంపెనీ ఇంటర్వ్యూకు హాజరైన సమయంలో పరిచయమైన కొడారి కృష్ణ అనే యువకుడు ఆమె వివరాలు తీసుకున్నాడు. అనంతరం ఒక నెల తర్వాత గుర్తు తెలియని నంబర్‌ నుంచి ఎస్‌ఎంఎస్‌లు వస్తుండటంతో బాధితురాలికి భర్తతో గొడవ జరిగింది. దీనిపై ఆమె షీ బృందాన్ని ఆశ్రయించడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడికి కౌన్సెలింగ్‌ ఇచ్చి బాధితురాలు, ఆమె భర్తకు క్షమాణలు చెప్పించారు. మరో ఘటనలో లైక్‌ యాప్‌ ద్వారా బాధితురాలికి పరిచయమైన అనిల్‌ స్నేహితులుగా మారారు. అయితే తాను ఉంటున్న హాస్టల్‌కు వచ్చి బలవంతంగా తన కారులో ఎక్కించుకొని మత్తు మందు కలిపిన నీళ్లను తాగించడంతో స్పృహ కోల్పోయింది. అయితే మెళకువ వచ్చేసరికి అతడి గదిలో ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఎవరికీ చెప్పవద్దంటూ ఆమెను కొట్టి సైబర్‌ టవర్‌ క్రాస్‌రోడ్డు సమీపంలో వదిలేసి పరారయ్యారు. బాధితురాలు షీ టీమ్‌ను ఆశ్రయించడంతో నిందితుడు అనిల్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top