పంచాయితీల్లో డిజిటల్‌ లావాదేవీలు

Digital Transactions Creating Confusion In Panchayats - Sakshi

ప్రభుత్వం చెక్‌పవర్‌ ఇచ్చి 20రోజులు గడిచినా అమలు కాని వైనం

చెక్‌పవర్‌ పై డీటీఓ, ఎంపీడీఓలకు ఉత్తర్వులు

సాక్షి, నల్లగొండ : గ్రామ పంచాయతీల్లో కొత్తగా ఎన్నికైన సర్పంచులకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో ప్రజాప్రతినిధులు అయోమయానికి గురవుతున్నారు. చెక్‌ పవర్‌ వ్యవహారాన్ని తేల్చిన ప్రభుత్వం మరిన్ని సమస్యలను సృష్టించి పెట్టిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పంచాయతీల్లో చేసిన పనులకు బిల్లులు తీసుకోవాలన్నా, నిధులు డ్రా చేసుకోవాలన్నా సర్పంచుల తల ప్రాణం తోకకు వచ్చేలా ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గ్రామ పంచాయతీలో చేసిన పనులకు సంబంధించిన వివరాలన్నీ యాప్‌లోనే అప్‌లోడ్‌ చేయాలన్న నిబంధన పెట్టారు.

అలా అప్‌లోడ్‌ చేశాకే ఆన్‌లైన్‌లోనే డిజిటల్‌ చెక్కులు పొందే విధంగా కొత్త పంచాయతీ చట్టాన్ని తీసుకొచ్చింది. దీంతో గ్రామ పంచాయతీలో ఎలాంటి పనిచేసినా ఆ పనికి సంబంధించి డబ్బులు డ్రా చేయాలంటే పెద్ద తతంగమే జరగాల్సి ఉంది. డిజిటల్‌ చెక్కు పొందేందుకు సర్పంచ్, ఉప సర్పంచులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది.  ఇప్పటికే ప్రభుత్వం చెక్‌పవర్‌ ఇచ్చినా,  డిజిటల్‌ యాప్‌ అందుబాటులోకి రాని కారణంగా డబ్బులు డ్రా చేయలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలో మొత్తం 844 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో 837 గ్రామ పంచాయతీలకు ఇటీవల ఎన్నికలు జరిగాయి. సర్పంచులు ఆయా పంచాయతీల్లో కొలువుదీరారు.

నకిరేకల్‌ మున్సిపాలిటీ పరిధిలో 7 గ్రామ పంచాయతీలకు అప్పట్లో ఎన్నికలు ఆలస్యంగా జరగడంతో పాత సర్పంచులే కొనసాగుతున్నారు. వీరికి వచ్చే ఏడాది జనవరి వరకు పదవీ కాలం ఉంది. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పంచాయతీ నూతన చట్టం కారణంగా పంచాయతీల్లో ఎన్నో మార్పులు సంతరించుకున్నాయి. సర్పంచులకు చెక్‌ పవర్‌ విషయంలోనే ఆచితూచి అడుగులు వేసింది. ఈ ఏడాది జనవరిలో మూడు విడతల్లో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పూర్తయిన విషయం తెలిసిందే. కాగా, ఆ తర్వాత నూతన పంచాయతీ పాలనపై సర్పంచులకు నాలుగు విడతల్లో జిల్లా వ్యాప్తంగా నెల రోజులపాటు శిక్షణ కూడా ఇచ్చారు. 

చెక్‌పవర్‌పై తర్జన భర్జనలు
పంచాయతీ పాలనకు గాను తీసుకొచ్చిన నూతన పంచాయతీ చట్టం ప్రకారం జాయింట్‌ చెక్‌ పవర్‌ ఎవరెవరికి ఇవ్వాలనే అంశంపై పెద్ద తతంగమే నడిచింది. జనవరిలో ఎన్నికలు పూర్తికాగా, ఫిబ్రవరిలో శిక్షణ కూడా నిర్వహించారు.  గతంలో మాదిరిగా సర్పంచ్‌కి , కార్యదర్శికి చెక్‌పవర్‌ ఇవ్వాలా..? లేక సర్పంచ్, ఉప సర్పంచ్‌కి కలిపి ఇవ్వాలా అనే అంశంపై ప్రభుత్వం పలు విధాలుగా తర్జనభర్జనలు చేసింది. ఇక, 14వ ఆర్థిక సంఘం నిధులు గత పాలకవర్గాల హయాంలోనే మంజూరయ్యాయి. కాని ప్రభుత్వం ఫ్రీజింగ్‌పెట్టి నిలిపివేసింది. ఆ పాలకవర్గాలు ఆ నిధులను డ్రా చేయలేక పోయాయి.  

కొత్తగా ఎన్నికైన సర్పంచులు సైతం తాము ఎన్నికై నాలుగు నెలలు గడిచినా, అందుబాటులో నిధులు ఉన్నా, చివరకు వేసవిలో అత్యవసర పనులకు కూడా నిధులు డ్రా చేయలేని పరిస్థితిని ఎదుర్కొన్నారు. గ్రామంలో అత్యవసరమైన తాగునీరు, పారిశుద్ధ్యం, వీధిలైట్లు వంటి వాటికి కొందరు సర్పంచ్‌లు అప్పులు చేసి, మరికొందరు సొంత డబ్బులు ఖర్చు చేశారు. నిధులు ఉన్నా, ప్రభుత్వం చెక్‌పవర్‌ విషయం తేల్చని కారణంగా అప్పులు చేసి పనులు చేయాల్సి వచ్చింది. 

గత నెల 22వ తేదీన తేలిన చెక్‌ పవర్‌
గత నెల 22వ  తేదీన ప్రభుత్వం చెక్‌ పవర్‌ అంశాన్ని తేల్చేసింది. సర్పంచ్, ఉప సర్పంచులకు జాయింట్‌ చెక్‌పవర్‌ ఇస్తూ గెజిట్‌ జారీ చేసింది. జిల్లా పంచాయతీ అధికారి జిల్లా వ్యాప్తంగా అన్ని పంచాయతీలకు చెక్‌ పవర్‌పై ప్రొసీడింగ్స్‌ను ఈ నెల 3వ తేదీన ఇచ్చారు. వాటన్నింటినీ జిల్లా ట్రెజరీ కార్యాలయానికి పంపడంతో పాటు జిల్లాలోని 31 మండలాల ఎంపీడీఓలకు చెక్‌ పవర్‌ ప్రొసీడింగ్స్‌ను పంపించారు. 

చెక్‌ పవర్‌ వచ్చినా .. డిజిటల్‌ కిరికిరి
ప్రభుత్వం ఎట్టకేలకు సర్పంచ్, ఉప సర్పంచులకు జాయింట్‌ చెక్‌ పవర్‌ ఇచ్చింది. కానీ ప్రభుత్వం యాప్‌ను నేటికీ విడుదల చేయలేదు. దీంతో చెక్‌ పవర్‌ వచ్చినా అది ఉపయోగపడని పరిస్థితి నెలకొంది. ఆయా గ్రామాల్లో చేపట్టిన పనులకు సంబంధించి ఆన్‌లైన్‌లో మీ–సేవా కేంద్రం నుంచి అప్‌లోడ్‌ చేయాలి. ప్రభుత్వం విడుదల చేసే ఆ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయాలి. అందులోకి వెళ్లి ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన కోడ్‌ను నమోదు చేయాలి. సంబంధిత పని వివరాలకు సంబంధించిన సమాచారాన్ని నమోదు చేయాలి. ఆ తర్వాత ఆ పనికి సంబంధించి ఎంబీ రికార్డు నంబర్‌ను నమోదు చేయాలి. ఆ పని ఎంత విలువైందో ఆ మొత్తాన్ని కూడా అందులో నమోదు చేయాలి. అప్పుడు ఆ అప్లికేషన్‌ పూర్తయినట్లవుతుంది. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో సర్పంచ్, ఉపసర్పంచ్‌ సంతకాలతో కూడిన డిజిటల్‌ చెక్కు బయటికి వస్తుంది.

ఆ చెక్‌ రాగానే సర్పంచ్, ఉప సర్పంచ్‌ సెల్‌ఫోన్‌ నంబర్లకు ఓటీపీ నంబర్‌ వెళ్తుంది. దాన్ని తీసుకొని డీటీఓ, ఎంపీడీఓల వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. ఎంపీడీఓ వద్దకు వెళ్లి సర్పంచ్, ఉపసర్పంచ్‌లు మూడు మూడు సంతకాలు చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆ కాగితంపై ఎంపీడీఓ సర్పంచ్, ఉపసర్పంచ్‌ కలిసి వచ్చి తన ముందే సంతకాలు చేశారని ధ్రువీకరిస్తూ ఎస్‌టీఓకు లెటర్‌ పంపిస్తాడు. ఆ లెటర్‌ తీసుకొని ఎస్‌టీఓ వద్దకు వెళ్లాలి. ఎస్‌టీఓ సర్పంచ్, ఉపసర్పంచ్‌ సెల్‌లకు వచ్చిన ఓటీపీ నంబర్లను అడుగుతారు. ఎంపీడీఓ ఇచ్చిన లెటర్‌ను తీసుకొని దానిపై ఎస్‌టీఓ ముందు మళ్లీ సర్పంచ్, ఉపసర్పంచ్‌ ఇరువురూ రెండు చొప్పున సంతకాలు పెట్టాల్సి ఉంటుంది.

అప్పుడు పూర్తి స్థాయిలో బిల్లుకోసం ప్రక్రియ పూర్తయినట్లు అవుతుంది. ఎస్‌టీఓ ఆ బిల్లును పాస్‌ చేస్తాడు. ప్రస్తుతం చెక్‌ పవర్‌ విషయంలో ఇప్పటికే డీపీఓ ఎస్‌టీఓ, ఎంపీడీఓలకు పంపిన ప్రొసీడింగ్‌ల ఆధారంగా  అన్ని గ్రామాల్లోని సర్పంచ్, ఉప సర్పంచుల డిజిటల్‌ సంతకాలను తీసుకుంటున్నారు. ఆ సంతకాలే డిజిటల్‌ చెక్‌ మీద రానున్నాయి. మొత్తానికి ప్రభుత్వం ఓ పక్క చెక్‌పవర్‌ ఇచ్చినా, ఈ డిజిటల్‌ యాప్‌ రాని కారణంగా చెక్‌పవర్‌ ఉపయోగపడని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ డిజిటల్‌ విధానంతో సర్పంచులకు  డబ్బుల డ్రా విషయంలో కిరికిరి తప్పేలా లేదు.

చెక్‌ పవర్‌పై పునరాలోచన చేయాలి
గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు చెక్‌ పవర్‌ విషయంలో ప్రభుత్వం పునారాలోచన చేయాలి. ఉప సర్పంచ్‌కు బదులు కార్యదర్శిని భాగస్వాములను చేస్తే భయం ఉంటుంది. ఖర్చులు చేయడంలో సర్పంచ్‌కు ధైర్యం ఉంటుంది. ఇద్దరు ప్రజాప్రతినిధులకు చెక్‌పవర్‌ ఇవ్వడం వల్ల గ్రామాల్లో ఘర్షణలు, పంచాయితీలు ఎక్కువవుతాయి. ఈ విషయంలో సర్కార్‌ పునరాలోచన చేయాలి.
– పన్నాల రంగమ్మ రాఘవరెడ్డి, సర్పంచ్, నకిరేకల్‌

చెక్‌ పవర్‌లేక అప్పుల పాలయ్యాను
మునుగోడు: ఆరు నెలల క్రితం సర్పంచ్‌గా ఎన్నికైన నేను ప్రజలకు అవసరమైన సౌకర్యాలు ఏర్పాటుకు అప్పులు తెచ్చా ను. దాదాపు రూ. 20 లక్షలకు పైగా అప్పు చేశా. సాధ్యమైనంత త్వరగా చెక్‌ పవర్‌ అంది స్తే బాగుండు. పేరుకు సర్పంచ్‌లమైనా ఎలాంటి నిధులు ఇవ్వకపోవడంతో ప్రజలతో ఇబ్బందులు పడుతున్నాం. – మిర్యాల వెంకన్న, సర్పంచ్, మునుగోడు    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top