మాట నిలుస్తుందా..? | Claimed that the word ..? | Sakshi
Sakshi News home page

మాట నిలుస్తుందా..?

Oct 13 2014 3:16 AM | Updated on Apr 3 2019 8:42 PM

జమ్మికుంట : జమ్మికుంటలో సీసీఐ పత్తి కొనుగోళ్లు సోమవారం నుంచి ప్రారంభిస్తామని ఆర్భాటంగా ప్రకటించిన సంబంధిత అధికారులు ఆ మేరకు చర్యలు...

నేడు జమ్మికుంటలో సీసీఐ కొనుగోళ్లు అనుమానమే?

 జమ్మికుంట :
 జమ్మికుంటలో సీసీఐ పత్తి కొనుగోళ్లు సోమవారం నుంచి ప్రారంభిస్తామని ఆర్భాటంగా ప్రకటించిన సంబంధిత అధికారులు ఆ మేరకు చర్యలు చేపట్టకపోవడంతో కొనుగోళ్లపై అనుమానాలు తలెత్తుతున్నాయి. సీసీఐ ఇప్పటికీ జిన్నింగ్ వ్యాపారులతో మిల్లుల లీజు అగ్రిమెంట్‌పై చర్చించక పోవడంతో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తమను మభ్యపెట్టేందుకు కొందరు అసత్య ప్రకటనలు చేస్తున్నారని పలువురు రైతులు మండిపడుతున్నారు.

మార్కెటింగ్ శాఖ అధికారులు కొనుగోళ్లపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వక పోవడంతో ఈ సీజన్‌లో పత్తి కొనుగోళ్లు ఎప్పుడు ప్రారంభమవుతోయో తెలియని పరిస్థితి ఉందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే వ్యాపారులు మాత్రం సీసీఐ ముందుకు వస్తేనే తాము కొనుగోళ్లు చేపడుతామని బాహటంగా ప్రకటించారు. ఈ క్రమంలో సీసీఐ కొనుగోళ్లు జరుగుతాయో.. లేదా అనే సంశయం నెలకొంది. దీంతో రైతులు చేసేది లేక తమ పంట దిగుబడిని విక్రయించేందుకు వరంగల్ బాట పట్టుతున్నారు.  

 15న వ్యాపారులతో సీసీఐ సమావేశం
 ఈనెల 15న సీసీఐ వరంగల్ బ్రాంచి పరిధి జిల్లాలోని జిన్నింగ్, ప్రెస్సింగ్ వ్యాపారులతో సీసీఐ అధికారులు వరంగల్‌లో సమావేశం కానున్నారు.  ఇందులో సీసీఐ కొనుగోళ్లు చేసే పత్తిని జిన్నింగ్, ప్రెస్సింగ్ చేసేందుకు రేట్లపై ఒప్పందం కుదుర్చూకోనున్నారు. వ్యాపారులకు..సీసీఐ మధ్య రేట్ల ఒప్పందం కుదిరి తర్వాత మిల్లులను ఆగ్రిమెంట్ చేసుకొనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే సీసీఐ వరంగల్ బ్రాంచి పరిధిలోని వ్యవసాయ మార్కెట్లలో గల 60 కేంద్రాలో కొనుగోళ్లు ప్రారంభమవుతాయి.

 పొంచి ఉన్న హూదూద్
 ఇప్పటికే వర్షాభావం, కరెంటు కోతలతో ఈ సీజన్‌లో పత్తి దిగుబడి తగ్గిపోయింది. ఈ క్రమంలో చేతికి వచ్చిన పంటను రైతులు వారం రోజులుగా ఏరుతున్నారు. అయితే వాతావరణ మార్పుల్లో భాగంగా ‘హూదూద్’ తుఫాన్ హెచ్చరికలు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మార్కెట్‌లో కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో చాలా మంది రైతులు అయిన పత్తిని చెట్ల మీదనే ఉంచారు.

అయితే హూదూద్ సమాచారంతో అప్రమత్తమైన పలువురు రైతులు ఆదివారం ఇతర ప్రాంతాలకు చెందిన కూలీలకు అధిక కూలి చెల్లించి మరీ ఏరించేందుకు సిద్ధపడ్డారు. ఒకవేళ వర్షం కురిస్తే చేతికి వచ్చిన పంట నీళ్లపాలవుతుందని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి సీసీఐ కొనుగోళ్లు వెంటనే చేపట్టేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement