434 జూనియర్‌ కాలేజీల మూత!

434 junior college was closed - Sakshi

     ఈనెల 20 వరకే గడువు.. ఆలోగా గుర్తింపు పొందకుంటే ప్రవేశాలు లేనట్లే 

     ఈనెల 21న జూనియర్‌ కాలేజీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 434 ప్రైవేటు జూనియర్‌ కాలేజీల్లో వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేశాలు జరిగే అవకాశం కనిపించడం లేదు. కనీస సదుపాయాలు లేని కారణంగా ఇంటర్మీడియట్‌ బోర్డు ఇప్పటికే 61 జూనియర్‌ కాలేజీలకు అనుబంధ గుర్తింపును నిరాకరించగా.. అవసరమైన డాక్యుమెంట్లు అందజేయని మరో 373 కాలేజీలకూ గుర్తింపు నిరాకరించేందుకు రంగం సిద్ధమైంది. అనుబంధ గుర్తింపు కోసం అవసరమైన డాక్యుమెంట్లను అందజేయాలని గత డిసెంబర్‌ నుంచి ఇంటర్‌ బోర్డు సూచిస్తున్నా.. ఈ 373 కాలేజీలు డాక్యుమెంట్లను దాఖలు చేయకపోవడం గమనార్హం. ఈనెల 21న జూనియర్‌ కాలేజీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ జారీ కానున్న నేపథ్యంలో.. ఆలోగా సంబంధిత డాక్యుమెంట్లు సమర్పించిన కాలేజీలకు అనుబంధ గుర్తింపు వస్తుందని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ పేర్కొన్నారు. ఆ తర్వాత అనుమతి ఇచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. 

వెబ్‌సైట్‌లో ఆయా కాలేజీల జాబితా 
రాష్ట్రంలోని 1,692 ప్రైవేటు జూనియర్‌ కాలేజీలు అనుమతుల కోసం ఇంటర్‌ బోర్డుకు దరఖాస్తు చేసుకున్నాయి. అందులో ఇప్పటివరకు 1,057 కాలేజీలకు బోర్డు అనుమతి ఇచ్చింది. మరో 61 కాలేజీల్లో తగిన సదుపాయాలు లేవంటూ అనుమతి నిరాకరించింది. ఇక 373 కాలేజీలు దరఖాస్తు చేసుకున్నా.. అవసరమైన పత్రాలు దాఖలు చేయకపోవడంతో దరఖాస్తులను తిరిగి వెనక్కి పంపించింది. ఇక 103 కాలేజీల దరఖాస్తులు ఇంటర్‌ బోర్డులో, మరో 98 కాలేజీల దరఖాస్తులు జిల్లాల్లోని కార్యాలయాల్లో ప్రాసెస్‌లో ఉన్నాయి. వీటి ప్రాసెస్‌ను ఈ నెల 20 నాటికి పూర్తి చేస్తామని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ వెల్లడించారు. 21న ప్రవేశాల నోటిఫికేషన్‌ జారీ చేయనుండటంతో... అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల జాబితా, గుర్తింపు లేని కాలేజీల జాబితాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు.

హాస్టళ్లకు అనుమతులు తీసుకోకున్నా
రాష్ట్రంలో దాదాపు 500కుపైగా జూనియర్‌ కాలేజీలు హాస్టళ్లతో కలిపి కొనసాగుతున్నాయని ఇంటర్‌ బోర్డు తేల్చింది. అందులో హాస్టళ్ల నిర్వహణకు అనుమతుల కోసం కేవలం 13 కాలేజీలే దరఖాస్తు చేసుకున్నాయి. మిగతా కాలేజీలేవీ దరఖాస్తు చేసుకోలేదు. హాస్టళ్ల అంశంపై ఇంటర్‌ బోర్డుకు అధికారం లేదంటూ పలు కాలేజీలు కోర్టును ఆశ్రయించాయి. దీనిపై ఇంకా కోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదు. అయితే కాలేజీ హాస్టళ్లను నియంత్రించే అధికారం ఇంటర్‌ బోర్డుకు ఉందని బోర్డు కార్యదర్శి అశోక్‌ స్పష్టం చేశారు. ఆయా కాలేజీలు తమ హాస్టళ్లకు అనుమతులు తీసుకోకుంటే.. కాలేజీల అనుబంధ గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top