సర్కారీ స్కూళ్ల హవా | Release CBSE 12th class results | Sakshi
Sakshi News home page

సర్కారీ స్కూళ్ల హవా

May 29 2014 10:47 PM | Updated on Aug 20 2018 5:33 PM

సర్కారీ స్కూళ్ల హవా - Sakshi

సర్కారీ స్కూళ్ల హవా

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) పన్నెండో తరగతి ఫలితాల్లో ఢిల్లీ సర్కారీ పాఠశాలలు అద్భుత ప్రదర్శన కనబరిచాయి.

 - సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
 - 99.6 శాతం మార్కులతో టాప్ ర్యాంక్ సాధించిన ఢిల్లీ విద్యార్థి సార్థక్ అగర్వాల్

 సాక్షి, న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) పన్నెండో తరగతి ఫలితాల్లో ఢిల్లీ సర్కారీ పాఠశాలలు అద్భుత ప్రదర్శన కనబరిచాయి. దేశంలోని మిగతా సీబీఎస్‌ఈ అనుబంధ సంస్థల కంటే నగరంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మంచి మార్కులతో ప్రభంజనం సృష్టించారు. గురువారం విడుదల చేసిన పన్నెండో తరగతి ఫలితాల్లో 88.78 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

గతేడాది 88.62 శాతం మంది పాస్ అయ్యారని సీబీఎస్‌ఈ తెలిపింది. గతేడాది 85.17 శాతం ఉత్తీర్ణత సాధించిన ఢిల్లీ ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు ఈసారి 86.66 శాతంతో ప్రభంజనం సృష్టించాయి. ఇదే తరహాలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కేంద్రీయ విద్యాలయ సంస్థల్లో ఉత్తీర్ణత శాతం 97.56 నుంచి 98.02 శాతానికి పెరిగింది. ఇదిలావుండగా జవహర్ నవోదయ విద్యాలయాల్లో గతేడాది 97.06 శాతం ఉన్న ఉత్తీర్ణత ఈసారి 93.94కి పడిపోయింది. కాగా, ఢిల్లీ ప్రాంతంలో సైన్స్ విద్యార్థులలో  డీపీఎస్ వసంత్ కుంజ్‌కు చెందిన సార్థక్ అగర్వాల్ అగ్రస్థానంలో  నిలిచాడు. అతనికి 99.6 శాతం మార్కులు వచ్చాయి. కామర్స్ విభాగంలో డీపీఎస్ ఆర్‌కే పురం విద్యార్థిని వ్రుందా 98.4 శాతం మార్కులతో మొదటి స్థానం సాధించింది.

బాలికలదే పైచేయి
సీబీఎస్‌ఈ పన్నెండో తరగతి పరీక్ష ఫలితాల్లో బాలికల హవా కొనసాగింది. బాలుర కన్నా పది శాతం ఎక్కువ మంది ఉత్తీర్ణత సాధించారు. 91.72 శాతం మంది బాలికలు, 82.09 శాతం మంది బాలురు ఉత్తీర్ణులయ్యారు. గతేడాది కూడా 91.42 శాతంతో బాలికలు, 82.44 శాతంతో బాలురు ఉత్తీర్ణత సాధించిన సంగతి తెలిసిందే. ఈసారి దేశంలోనే టాప్ ర్యాంకర్‌గా నిలిచినట్టు భావిస్తున్న సర్థాక్ అగర్వాల్ మాట్లాడుతూ తాను ఎలాంటి ట్యూషన్‌కు వెళ్లలేదని, పరీక్షలకు ముందు చదువుపైనే ఎక్కువ ఏకాగ్రత సాధించానని తెలిపాడు.

సెంట్రల్ ఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ బాల్ భారతి పాఠశాల విద్యార్థి జి.హరికృష్ణ కామర్స్ విభాగంలో 99.2 శాతంతో మొదటి స్థానంలో నిలిచాడు. డీపీఎస్ ఇంద్రాపుర విద్యార్థి ముగ్ధ్ సేథియా, వసంత్ వాలీ పాఠశాలకు చెందిన వసుధా దీక్షిత్   హ్యుమనీటిస్ విభాగంలో 98.8 శాతంతో టాపర్‌లుగా నిలిచారు.  

చీటింగ్ కేసులు నమోదు
సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలకు సంబంధించి దేశవ్యాప్తంగా చూస్తే ఢిల్లీలోనే అత్యధికంగా చీటింగ్ కేసులు నమోదయ్యాయి. గతేడాదితో పొల్చుకుంటే మాస్ కాపీరాయుళ్ల సంఖ్య తగ్గింది. గతేడాది 25 కేసులు నమోదు కాగా, ఈసారి వాటి సంఖ్య 13కి తగ్గిందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఏడు కేసులతో పాట్నా రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో భువనేశ్వర్, డెహ్రాడూన్, పంచ్‌కుల, గౌహతి, చెన్నై, అలహాబాద్‌లు ఉన్నాయి.
 
కేజ్రీవాల్ కుమార్తెకు 96 శాతం మార్కులు
న్యూఢిల్లీ: సీబీఎస్‌ఈ పన్నెండో తరగతి పరీక్షలో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కుమార్తె హర్షిత 96 శాతం మార్కులు సాధించింది. ‘ నా తల్లిదండ్రులే నాకు ఆదర్శప్రాయులు. ఐఐటీలో ఏదో ఒక కోర్సును చేయాలనుకుంటున్నా. ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం ఐఐటీలో అడ్మిషన్ సంపాదించడమే’నని సైన్స్ విభాగ విద్యార్థిని అయిన హర్షిత తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement