మలుపులు తిరుగుతున్న తమిళ రాజకీయాలు

గవర్నర్‌ ఏం చేస్తారో? - Sakshi


‘రాజ్‌’భవన్‌కు చేరిన రాజకీయం

నేడు కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో గవర్నర్‌ చర్చలు

పుదుచ్చేరిలో పన్నీర్, దిష్టిబొమ్మల దహనం

ఎవరి జాగ్రత్తల్లో వారు




అన్నాడీఎంకే ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. రాష్ట్రప్రభుత్వ రాజకీయాలు రాజ్‌భవన్‌కు చేరుకున్నాయి. సీఎం ఎడపాడి బంతి గవర్నర్‌ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఎలాంటి నిర్ణయం తీసుకునేనో, బంతిని ఎవరివైపు విసిరేనో అనే ఉత్కంఠ బయలుదేరింది.



సాక్షి ప్రతినిధి, చెన్నై: ఎడపాడి, పన్నీర్‌వర్గాల విలీనమైన ముచ్చట తీరకముందే దినకరన్‌ రూపంలో ముప్పు ముంచుకొచ్చింది. ఎడపాడి ప్రభుత్వాన్ని ఏకంగా మైనార్టీలోకి నెట్టివేసింది. పలు రాజకీయ పక్షాల నుంచి ప్రభుత్వంపై ఒత్తిళ్లు పెరిగాయి. అవిశ్వాస తీర్మానం పెడతానని ఒకవైపు, బలపరీక్షకు ఆదేశించాలని గవర్నర్‌పై ఒత్తిడి తెస్తూ మరోవైపు స్టాలిన్‌ పట్టుదలతో ఉన్నారు. ఇక రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ (బీజేపీ మినహా) స్టాలిన్‌తో గొంతు కలిపాయి.


19 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించినట్లు దినకరన్‌ చెబుతుండగా, ముగ్గురు మిత్రపక్ష ఎమ్మెల్యేలు సైతం అదే బాటలో కొనసాగుతున్నారని స్టాలిన్‌ చెబుతున్నారు. బలపరీక్షకు ఆదేశించాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సైతం బుధవారం గవర్నర్‌కు లేఖ రాశారు. ఐదుగురు ఎమ్మెల్యేలను కూడగట్టుకోకుంటే ఎడపాడి ప్రభుత్వం ఐదు నిమిషాల్లో కూలిపోయే పరిస్థితులు నెలకొన్నాయి.



కేంద్ర హోంమంత్రితో గవర్నర్‌ భేటీ

ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో తమిళనాడు ఇన్‌చార్జ్‌ గవర్నర్‌ చెన్నమనేని విద్యాసాగర్‌రావు గురువారం ఢిల్లీలో కేంద్రహోంమంత్రి రాజ్‌నా«థ్‌ సింగ్‌ను కలుస్తున్నారు. దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారిన తమిళనాడు రాజకీయాలపై ఇరువురూ చర్చించే అవకాశం ఉంది. ఎడపాడి ప్రభుత్వానికి బలపరీక్ష అవకాశం ఇవ్వడమా.. మైనార్టీలో పడిపోయినట్లు స్పష్టంగా తెలుస్తున్నందున  ప్రభుత్వాన్ని రద్దుచేసి మరలా ముఖ్యమంత్రిని ఎన్నుకునే ప్రక్రియకు ఆదేశాలు జారీచేయడమా.. అనే విషయంలో గవర్నర్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.


కేంద్ర మంత్రితో జరుపుతున్న చర్చల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అని ఉత్కంఠ నెలకొంది. పది రోజుల్లోగా అసెంబ్లీని సమావేశపరచడం తప్పనిసరి అని అసెంబ్లీ మాజీ కార్యదర్శి సెల్వరాజ్‌ బుధవారం మీడియాకు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలపై గవర్నర్‌ వెంటనే ఆదేశించాలని, లేనిపక్షంలో ఎమ్మెల్యేలే కోర్టుకెళ్లి ఆదేశాలు తెచ్చుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు.



దిష్టిబొమ్మల దహనం

ఇదిలా ఉండగా పన్నీర్‌సెల్వం, దినకరన్‌ వర్గాలు పుదుచ్చేరిలో పోటాపోటీగా ఆందోళన చేపట్టాయి. పన్నీర్‌సెల్వం మద్దతుదారులు ఉదయం నగరంలో ర్యాలీ నిర్వహించి రిసార్టును ముట్టడించారు. ఆ తరువాత దినకరన్‌ దిíష్టిబొమ్మను దహనం చేశారు. అలాగే దినకరన్‌ వర్గం కార్యకర్తలు బు«ధవారం సాయంత్రం రిసార్టు వద్దకు చేరుకుని పన్నీర్‌సెల్వం, ఎంపీ వైద్యలింగం పొటోలను, దిష్టిబొమ్మలను తగులబెట్టారు.



పదవీ ప్రమాణం చెల్లదు : దివాకరన్‌

అసెంబ్లీలో తగిన మెజార్టీలేని ఎడపాడి ప్రభుత్వంలోకి డిప్యూటీ సీఎం, మంత్రిగా గవర్నర్‌ చేయించిన పదవీ ప్రమాణ స్వీకారం చెల్లదని శశికళ సోదరుడు దివాకరన్‌ అన్నారు. కుంభకోణంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, ఎడపాడి సంఖ్యా బలాన్ని గుర్తించడంలో గవర్నర్‌ విఫలమయ్యారని వ్యాఖ్యానించారు. స్పీకర్‌ ధనపాల్‌ను సీఎం చేస్తే మద్దతు ఇచ్చేందుకు తమ వర్గం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. ఎడపాడి ప్రభుత్వం కూలిపోకుండా ఎవరూ ఆపలేరని అన్నాడీఎంకే (అమ్మ) కర్ణాటక శాఖ ప్రధాన కార్యదర్శి పుహలేంది అన్నారు. 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top