కుష్బుకు ఊరట

కుష్బుకు ఊరట


రుద్రాక్ష వ్యవహారంలో విముక్తి     పిటిషన్ తిరస్కరణ

 

 రుద్రాక్షతో మంగళ సూత్రం ధరించిన వ్యవహారం నుంచి కాంగ్రెస్ నాయకురాలు, నటి కుష్బుకు విముక్తి కల్గింది. పిటిషన్‌ను తోసి పుచ్చుతూ కుంబకోణం న్యాయస్థానం ఆదేశాలు ఇవ్వడంతో ఆమెకు ఊరట లభించింది.

 

 సాక్షి, చెన్నై: కుష్బు వాక్ చాతుర్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే, సంస్కృతి సంప్రదాయాలకు వ్యతిరేకంగా, పాశ్చాత్య ఒరవడికి అనుగుణంగా  వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, పాదరక్షలతో ఆలయంలోకి వెళ్లడం తదితర వ్యవహారాలు ఆమెకు కొన్ని సందర్భాల్లో కష్టాలు తెచ్చిపెట్టాయి. ఈ వ్యవహారాల్లో ఆమె మీద కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేసిన సందర్భాలు అనేకం. ఇటీవల ఓ వార పత్రికలో రుద్రాక్షను మంగళ సూత్రంలో కలిపి ఆమె ధరించడం వివాదానికి దారి తీసింది. ఏకంగా ఓ వ్యక్తి కుంబకోణం కోర్టును ఆశ్రయించాడు.  వార పత్రికకు కుష్బు ఇచ్చిన ఫోజును చూసిన కుంభకోణం సమీపంలోని ఉమామహేశ్వర పురం శంకర సారంగపాణి పేటకు చెందిన బాల కోర్టును ఆశ్రయించాడు.

 

 రుద్రాక్ష అన్నది పవిత్రమైనదని, నిత్యం శివనామస్మరణతో దేవుడ్ని పూజించే వాళ్లు, భక్తులు వాటిని ధరించాలని వివరించారు. రుద్రాక్షలో 24 ముఖాలు ఉన్నాయని వివరిస్తూ, కుష్బు ధరించిన రుద్రాక్ష మూడు ముఖాలుగా ఉందని పేర్కొన్నారు. ఈ రుద్రాక్షను శివుడి మీద భక్తితో నిత్యం పూజాధి కార్యక్రమాలు నిర్వహించే వాళ్లే ధరించాలని, అయితే, హిందూ సంప్రదాయాలకు వ్యతిరేకంగా కుష్బు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుద్రాక్షను మాంగళ సూత్రంతో కలిపి ధరించడానికి వీలు లేదని పేర్కొన్నారు. సంప్రదాయాల్ని మంట కలిపే విధంగా పలు సందర్భాల్లో ఆమె వ్యవహరించారని ఉదాహరణకు గతంలో జరిగిన కొన్ని సంఘటనలను వివరించారు. తాజాగా రుద్రాక్ష ధరించి శివ భక్తులకు వ్యతిరేకంగా వ్యవహరించిన కుష్బుపై చర్యలు తీసుకోవాలని విన్నవించారు.

 

  కుంభకోణం రెండవ అదనపు కోర్టులో న్యాయమూర్తి శరవణభవన్ ముందు ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. మంగళవారం విచారణ సమయంలో పిటిషనర్‌ను న్యాయమూర్తి పలు రకాల ప్రశ్నల్ని సంధించారు. సంప్రదాయాల్ని మంట గలుపుతున్నారని పేర్కొన్నారుగా, ప్రత్యక్షంగా చూశారా? ఆమె రుద్రాక్ష మాలను ధరించి ఉండటాన్ని తమరేమైనా ప్రత్యక్షంగా చూశారా? , ఓ వార పత్రికలో వచ్చిన ఫొటో ఆధారంగా పిటిషన్ వేయడాన్ని ఏకీభవించబోమని స్పష్టం చేశారు. ఆధార రహితంగా ఈ పిటిషన్ దాఖలు చేసిన దృష్ట్యా, విచారణయోగ్యం కాదని పరిగణించి తోసి పుచ్చారు. దీంతో ఈ వ్యవహారం నుంచి కుష్బుకు ఊరట లభించినట్టు అయింది.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top