సన్‌రైజర్స్‌ ముందు ‘నాలుగు’ సవాళ్లు | Sunrisers Hyderabad Want to Keep Winnings For Playoffs | Sakshi
Sakshi News home page

సన్‌రైజర్స్‌ ముందు ‘నాలుగు’ సవాళ్లు

Apr 26 2019 7:13 AM | Updated on Apr 26 2019 7:13 AM

Sunrisers Hyderabad Want to Keep Winnings For Playoffs - Sakshi

గతేడాది అద్భుత ప్రస్థానంతో దర్జాగా ఐపీఎల్‌ ఫైనల్‌కు చేరిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌... ఈసారి అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి ఎదుర్కొంటోంది. అటు బ్యాటింగ్‌ బలం, ఇటు బౌలింగ్‌ దన్నుతో ఈపాటికే ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ ఖరారు కావాల్సిన జట్టు... అనూహ్య పరాజయాలతో కిందామీద పడుతోంది. వీటికితోడు వార్నర్, బెయిర్‌స్టో వంటి మేటి బ్యాట్స్‌మెన్‌ కీలక సమయంలో దూరం కావడం మరింత ఇబ్బందికరంగా మారింది. బౌలింగ్‌లోనూ తప్పిదాలతో తలబొప్పి కడుతోంది. ఇన్ని సవాళ్ల మధ్య హైదరాబాద్‌ నాకౌట్‌ ఆశలు ఏమేరకు నెరవేరుతాయో...?

సాక్షి, హైదరాబాద్‌ : పది మ్యాచ్‌లు... ఐదు విజయాలు, ఐదు పరాజయాలు, పది పాయింట్లు...! ఐపీఎల్‌–12లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్రస్తుత పరిస్థితిది. వాస్తవానికి ఈసారి లీగ్‌ను ఓటమితో ప్రారంభించినా, తర్వాత హ్యాట్రిక్‌ విజయాలతో మన జట్టు మంచి స్థితిలోనే నిలిచింది. అయితే, ఆ వెంటనే హ్యాట్రిక్‌ పరాజయాలు ఎదురవడంతో దెబ్బపడింది. దీంతో పాయింట్ల పట్టికలో ఒక్కసారిగా వెనుకబడింది. కీలక దశలో సొంతగడ్డపై చెన్నై సూపర్‌ కింగ్స్, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌లను ఓడించి గాడిన పడినట్లే కనిపించినా, మంగళవారం చెన్నైతో మ్యాచ్‌ను చేజార్చుకుని మళ్లీ ప్లే ఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇప్పుడిక మిగిలింది నాలుగు మ్యాచ్‌లు. ఎలాంటి ఇబ్బంది లేకుండా నాకౌట్‌కు చేరాలంటే వీటిలో కనీసం మూడైనా నెగ్గాలి. రెండింటిలో గెలిచినా అవకాశాలుంటాయి కానీ, అప్పుడు ప్రత్యర్థి జట్ల గెలుపోటముల సమీకరణాలపై ఆధారపడాల్సి వస్తుంది. తాజాగా జట్టు ఫామ్‌తో పాటు, పరిస్థితులు కూడా ప్రతికూలంగా ఉండటంతో సన్‌ రైజర్స్‌ ఏ మేరకు ముందుకెళ్తుందో చూడాలి.

ఆ త్రయం లేకుంటే ఇబ్బందే!
వ్యక్తిగత కారణాలతో న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్, ప్రపంచ కప్‌ సన్నాహాలతో ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌ జానీ బెయిర్‌స్టో ఇప్పటికే సన్‌ రైజర్స్‌ను వీడారు. ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ కొనసాగడమూ సందేహంగానే ఉంది. ఇదే జరిగితే హైదరాబాద్‌ బ్యాటింగ్‌ తేలిపోయినట్లే. ఓ విధంగా చూస్తే ఈ సీజన్‌లో జట్టు ప్రయాణం పడుతూ లేస్తూ సాగడానికి ప్రధాన కారణం విలియమ్సన్‌ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడమే. అప్పటికీ వార్నర్, బెయిర్‌స్టో అతడి లోటును సాధ్యమైనంత భర్తీ చేశారు. కానీ, వీరికితోడుగా విలియమ్సన్‌ ఉండి ఉంటే కథ వేరేలా ఉండేది. ఇప్పుడీ త్రయం సేవలు పూర్తిగా దూరమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జట్టుకు క్లిష్ట పరిస్థితులు తప్పేలా లేవు.

బౌలింగూ బెంగ పుట్టిస్తోంది
సన్‌ రైజర్స్‌ ప్రధాన బలం బౌలింగే. గతేడాది 140 లోపు స్వల్ప స్కోర్లనూ జట్టు ఇదే బలంతో కాపాడుకోగలిగింది. భువనేశ్వర్, సందీప్‌ శర్మ, సిద్ధార్థ్‌ కౌల్‌ వంటి పేసర్లు, రషీద్‌ ఖాన్, షకీబ్‌ వంటి స్పిన్నర్లను ఎదుర్కొంటూ పరుగులు చేయడానికి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ చెమటోడ్చేవారు. ఇప్పుడు ఈ మ్యాజిక్‌ కూడా పనిచేయట్లేదు. భువీ మెరుగ్గానే బంతులేస్తున్నా, సందీప్‌ పూర్తిగా తేలిపోతున్నాడు. వైవిధ్యం కోసమో మరెందుకో కానీ కౌల్‌ స్థానంలో తీసుకుంటున్న ఎడమ చేతి వాటం పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌ అంచనాలు నిలుపుకొంటున్నాడు. అయితే, సందీప్‌ను కాకుండా కౌల్‌ను పక్కనపెట్టడం, షాబాజ్‌ నదీమ్‌లాంటి స్పిన్నర్‌ను తుది జట్టులోకి తీసుకోకపోవడం వ్యూహ తప్పిదంగా కనిపిస్తోంది. ఇక పొదుపైన బౌలింగ్‌కు మారు పేరైన మిస్టరీ స్పిన్పర్‌ రషీద్‌ ఖాన్‌... కీలకమైన చెన్నైపై భారీగా పరుగులివ్వడం మ్యాచ్‌నే చేజార్చింది. ఈ తప్పులను సరిచూసుకుని, లోపాలను తక్షణమే సరిచేసుకోవాల్సి ఉంది.

కిం కర్తవ్యం?
బ్యాటింగ్‌లో విదేశీ మొనగాళ్లు దూరమవుతున్న నేపథ్యంలో భారాన్ని మనీశ్‌ పాండే, విజయ్‌ శంకర్, యూసుఫ్‌ పఠాన్‌ పూర్తిగా మోయాలి. మంచి బ్యాట్స్‌మన్‌ అయిన మనీశ్‌... గత మ్యాచ్‌ ఫామ్‌ను కొనసాగించాలి. విజయ్‌ భారీ ఇన్నింగ్స్‌లతో జట్టు స్కోరుకు ఉపయోగపడాలి. ప్లే ఆఫ్స్‌ ఏకైక లక్ష్యంగా పెట్టుకుని... ఈ నెల 27న రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో గెలవాలి. బలహీన జట్టయిన రాయల్స్‌ను ఓడిస్తే కొంత భరోసా వస్తుంది. అనంతరం 29న పంజాబ్‌తో మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసంతో బరిలో దిగొచ్చు. సొంతగడ్డపై జరిగే మ్యాచ్‌ కాబట్టి గెలుపుపై ధీమా ఉంటుంది. ముంబై (మే 2), బెంగళూరు (మే 4)తో మ్యాచ్‌లను తాడోపేడో అనే రీతిలో ఆడొచ్చు. అయితే, అచ్చం హైదరాబాద్‌లాగే ఈ నాలుగు జట్లూ ప్లే ఆఫ్స్‌కు అర్హత రేసులో ఉన్నాయి. దీంతో పోటీ రసవత్తరంగా సాగడం ఖాయం.

ఆ భాగ్యం దక్కేనా?
ఈ ఏడాది ఐపీఎల్‌ ఫైనల్‌కు హైదరాబాద్‌ ఆతిథ్యం ఇవ్వనుందన్న వార్త తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ముఖ్యంగా భాగ్యనగర వాసులకు ఎంతో సంతోషాన్నిచ్చింది. ఇప్పటికే టికెట్ల కోసం వారంతా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇలాంటి సమయంలో మన జట్టు ఫైనల్‌కు చేరితే అభిమానుల సందడికి అంతుండదు. మరి ఈ ఆశను సన్‌రైజర్స్‌ ఎంతవరకు నెరవేరుస్తుందో?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement