
మళ్లీ మెస్సీ మాయ...
తనపై పెట్టుకున్న అంచనాలను నిజంచేస్తూ అర్జెంటీనా సూపర్‌స్టార్ మెస్సీ మరోసారి మెరిశాడు.
- అర్జెంటీనాను గెలిపించిన సూపర్‌స్టార్
- ఇంజ్యూరీ టైమ్‌లో గోల్
- ఇరాన్‌పై 1-0తో విజయం
- నాకౌట్ దశకు అర్హత
బెలో హరిజాంట్: తనపై పెట్టుకున్న అంచనాలను నిజంచేస్తూ అర్జెంటీనా సూపర్‌స్టార్ మెస్సీ మరోసారి మెరిశాడు. ‘డ్రా’ ఖాయమనుకుంటున్న దశలో మాయ చేశాడు. అద్భుత గోల్‌తో అర్జెంటీనాను విజయతీరాలకు చేర్చాడు. మ్యాచ్ చివరి వరకు అర్జెంటీనా ఆధిపత్యాన్ని అద్భుతంగా అడ్డుకున్న ఇరాన్ ఆటగాళ్లకు ఏకైక గోల్‌తో నిరాశ మిగిల్చాడు. దీంతో ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో శనివారం జరిగిన గ్రూప్ ‘ఎఫ్’ లీగ్ మ్యాచ్‌లో అర్జెంటీనా 1-0తో ఇరాన్‌పై విజయం సాధించింది. వరుసగా రెండో విజయం నమోదు చేసిన అర్జెంటీనా ప్రిక్వార్టర్స్ దశకు అర్హత సాధించింది.
తొలి మ్యాచ్‌లో బోస్నియాపై కీలకగోల్ చేసి అర్జెంటీనాను 2-1తో గెలిపించిన మెస్సీ ఈ మ్యాచ్‌లోనూ ఫలితాన్ని శాసించాడు. ఇరాన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురుకావడంతో మ్యాచ్ నిర్ణీత సమయానికి ఒక్క గోల్ కూడా నమోదు చేయలేకపోయింది. కానీ 90+1వ నిమిషంలో ఇరాన్ డిఫెండర్లను, గోల్ కీపర్‌ను ఏమారుస్తూ మెస్సీ ఎడమకాలితో కొట్టిన షాట్ గోల్‌పోస్ట్‌లోనికి దూసుకెళ్లింది. అంతే డ్రాపై ఆశలు పెట్టుకున్న ఇరాన్ ఆటగాళ్లు ఒక్కసారిగా చతికిలపడ్డారు. మెస్సీకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
- ఆరంభంలో ఇరాన్ కాసేపు దూకుడును ప్రదర్శించినా మ్యాచ్ సాగేకొద్దీ అర్జెంటీనా వేగంగా ఆడింది. ఎక్కువ భాగం బంతిని ఆధీనంలో పెట్టుకుని పదేపదే దాడులు చేసింది.
- 4వ నిమిషంలోనే జెబెల్టా (అర్జెంటీనా) కొట్టిన డేంజర్ ఫ్రీ కిక్ బార్‌ను తాకుతూ పక్కకు దూసుకుపోయింది.
- 5వ నిమిషంలో తొలి గోల్ చేసే అవకాశాన్ని అగురో (అర్జెంటీనా) జారవిడిచాడు. అతను కొట్టిన బంతిని ఇరాన్ ఆటగాళ్లు సమర్థంగా నిలువరించారు.
- ఇరాన్ ఫార్వర్డ్స్‌తో వీరోచితంగా పోరాడిన మెస్సీ 11వ నిమిషంలో బంతిని అందుకున్నాడు. కానీ డి సర్కిల్ నుంచి అతను కొట్టిన షాట్‌ను డిజాగ్ అడ్డుకున్నాడు.
- ఫెర్నాండో గగో, గోంజాలో సమయోచితంగా కదులుతూ 13వ నిమిషంలో బంతిని గోల్ పోస్ట్ వరకు తీసుకెళ్లినా లక్ష్యాన్ని చేరలేకపోయారు. ఆ తర్వాత ఇరుజట్లు పరస్పరం దాడులు చేసినా గోల్స్ మాత్రం నమోదు కాలేదు.
- ఇరాన్ రక్షణ శ్రేణిని ఛేదించుకుంటూ 22వ నిమిషంలో అగురో ఇచ్చిన పాస్‌ను హిగుయాన్ కచ్చితమైన వేగంతో గోల్ పోస్ట్ వైపు పంపాడు. కానీ గోల్ కీపర్ హగిగి (ఇరాన్) అద్భుతంగా డైవ్ చేస్తూ రెండు చేతులతో బంతిని పక్కకు నెట్టేశాడు. దీంతో అర్జెంటీనా రెండో అవకాశం వృథా అయ్యింది.
42వ నిమిషంలో డిజాగ్ ఇచ్చిన కార్నర్ కిక్‌ను హోసిని (ఇరాన్) హెడర్‌గా మల్చే ప్రయత్నం చేశాడు. కానీ బంతి ఎక్కువ ఎత్తులో బయటకు వెళ్లింది.
ఓవరాల్‌గా తొలి అర్ధభాగంలో 75 శాతం బంతిని ఆధీనంలో ఉంచుకున్న అర్జెంటీనా ఐదుసార్లు గోల్స్ కోసం ప్రయత్నం చేసి విఫలమైంది.
- చిన్న చిన్న టచ్‌లతో ఇరాన్ డిఫెండర్లను తప్పుకుంటూ రోజో (అర్జెంటీనా) బంతిని గోల్‌పోస్ట్ వరకు తీసుకొచ్చాడు. కానీ సహచరులెవ్వరూ బంతిని అందుకోలేకపోయారు.
- 50వ నిమిషంలో మెస్సీ చాలా దూరం నుంచి బంతిని అదుపు చేసుకుంటూ వచ్చినా సెంటర్ బ్యాక్ జబెల్టా (అర్జెంటీనా) టాప్ కార్నర్ నుంచి కొట్టిన షాట్ ఎక్కువ ఎత్తులో వైడ్‌గా వెళ్లింది.
- తర్వాతి నిమిషంలో రోజో సంధించిన బంతిని మిడిల్‌లో అగురో తీసుకుని హెడర్‌గా మార్చే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. ఆ తర్వాత అర్జెంటీనా వరుసగా దాడులు చేస్తూ ఒత్తిడి పెంచినా ఇరాన్ ఏమాత్రం తడబడలేదు.
- 59వ నిమిషంలో సెంటర్ ఫీల్డ్ నుంచి మెస్సీ (అర్జెంటీనా) కొట్టిన షాట్ తక్కువ ఎత్తులో వైడ్‌గా దూసుకుపోతే... 64వ నిమిషంలో హజీ సాఫీ (ఇరాన్)షాట్ వృథా అయ్యింది.
- 75వ నిమిషంలో డి మారియా (అర్జెంటీనా) కొట్టిన షాట్ రీ బౌండ్ అయినా హగిగ్ సమర్థంగా నిలువరించాడు.
- 84వ నిమిషంలో రోడ్రిగో (అర్జెంటీనా) హెడర్‌ను గోల్ కీపర్ హగిగ్ అడ్డుకున్నాడు.
- ఇక డ్రా అనుకుంటున్న సమయంలో మెస్సీ ఓ అద్భుతమైన షాట్‌తో మ్యాచ్‌ను అర్జెంటీనా వైపు తిప్పాడు.