
జకార్తా: ఆగ్నేయాసియా దేశం ఇండోనేసియా 2032 ఒలింపిక్స్ నిర్వహణకు ఆసక్తి చూపుతూ బిడ్ దాఖలు చేసింది. అధ్యక్షుడు జొకొ విడొడొ తరఫున... స్విట్జర్లాండ్‌లోని ఇండోనేసియా రాయబారి ములిమన్ హదాద్ తమ రాజధాని జకార్తాలో ఒలింపిక్స్ నిర్వహణకు సిద్ధమని బిడ్‌పై అధికారిక లేఖను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)కి గత వారం లుసానేలో అందజేశారు. ఈ వివరాలను ఆ దేశ విదేశాంగ శాఖ మంగళవారం ఖరారు చేసింది.
‘ఓ పెద్ద దేశంగా ఇండోనేసియా శక్తి సామర్థ్యాలను చాటాల్సిన సమయం ఇది’ అని హదాద్ పేర్కొన్నారు. కాగా, గతేడాది ఆసియా క్రీడల ఆతిథ్యం సందర్భగా జొకొ విడొడొ 2032 ఒలింపిక్స్ నిర్వహణకు సిద్ధమని ప్రకటించారు. ఇప్పటికే భారత్ ఆసక్తి కనబరుస్తుండగా, దక్షిణ కొరియా–ఉత్తర కొరియా సంయుక్త బిడ్ వేశాయి. 2032లో మెగా ఈవెంట్ జరగబోయేది ఎక్కడో ఐఓసీ 2025లో ఖరారు చేస్తుంది. 2020కి టోక్యో, 2024కి పారిస్, 2028కి లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌కు వేదిక కానున్నాయి.