నన్ను ఉరి తీయండి: క్రికెటర్ షమీ

If I Am Found Guilty Then Hang Me, Says  Mohammed Shami - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భార్య హసీన్ జహాన్ తనపై చేసిన ఆరోపణలు నిజమని తేలితే తనను ఉరి తీయాలంటూ టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనపై వస్తున్న ఫిక్సింగ్, గృహహింస ఇతరత్రా ఆరోపణలపై షమీ మరోసారి మీడియా ముందుకొచ్చాడు. నిన్నటివరకూ కేవలం గృహహింస కేసుతో సతమతమైన షమీకి నిన్నటి (బుధవారం) నుంచి కొత్త తలనొప్పి వచ్చి పడ్డ విషయం తెలిసిందే. హసీన్‌ చేసిన ఆరోపణల్లో ఒకటైన ‘టెలిఫోన్‌ సంభాషణ’పై విచారణ జరపాలని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం చీఫ్‌ నీరజ్‌ కుమార్‌ను సీఓఏ చైర్మన్‌ వినోద్‌ రాయ్‌ ఆదేశించారు.

అయితే తనను వ్యక్తిగతంగా, వృత్తిగతంగా దిగజార్చే యత్నం చేస్తున్న భార్య హసీన్ జహాన్ గురించి తాజాగా షమీ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భార్య ఎప్పుడూ అబద్ధాలు చెప్పేదని, అభద్రతా భావంతో అనుమానించడం మొదలుపెట్టినట్లు తెలిపాడు. 'భర్తగా ఆమెకు చేయాల్సినవన్నీ చేశాను. కానీ అబద్ధాలు చెబుతూ నన్ను వివాదంలోకి లాగింది. ఆమె కోసం రూ.1.5 కోట్లు ఖర్చుపెట్టాను. షాపింగ్‌ల పేరుతో భార్య నా డెబిట్ కార్డులు మొత్తం ఇష్టమున్నట్లుగా వాడేసింది. దుబాయ్ నుంచి తనకు వజ్రాలు, బంగారు తీసుకురావాలని ఎప్పుడూ అడిగేది. ఆమె చేసే ఆరోపణలు చూస్తుంటే మేం మళ్లీ కలిసి జీవించే సూచనలు కనిపించడం లేదు. ఒకవేళ నేను తప్పు చేసినట్లు రుజువైతే నన్ను ఉరి తీయండి. నాపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదు. నేను దేశానికి ఎప్పుడూ ద్రోహం చేసే వ్యక్తిని కాదని' షమీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

నా భార్యకు పెళ్లయిన విషయం తెలియదు
మహ్మద్‌ షమీ వివాహేతర సంబంధాల కేసు రోజుకో మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే. షమీ భార్య హసీన్‌ జహాన్‌కు ఇదివరకే పెళ్లైనట్లు, ఆమెకు ఇద్దరు పిల్లలుకూడా ఉన్నారని, ఆ విషయాన్ని దాచిపెట్టి ఆమె షమీని రెండోపెళ్లి చేసుకుందని తాజాగా కథనాలు వచ్చాయి. ఈ కథనాలపై షమి స్పందించాడు. తన భార్య హసీన్‌కు ముందే మరో వ్యక్తితో పెళ్లి అయిన విషయం నిజమేనని, ఆ విషయాన్ని దాచిపెట్టి తనను రెండో పెళ్లి చేసుకుందని అతను చెప్పుకొచ్చాడు.

తాను హసీన్‌ను పెళ్లి చేసుకునేనాటికే ఆమెకు మరొకరితో పెళ్లి అయ్యిందని, అప్పటికే ఇద్దరు ఆడ పిల్లలు కూడా ఉన్నారని షమీ చెప్పాడు. ఈ విషయం తన వద్ద దాచి పెట్టిందని, ఈ పిల్లలు ఎవరు అని అడిగితే.. చనిపోయిన తన సోదరి పిల్లలు అని హసీన్‌ చెప్పిందని వివరించాడు. గుడ్డిగా నమ్మి తాను హసీన్‌ను పెళ్లి చేసుకున్నట్టు చెప్పారు. ఆ తర్వాత కొంత కాలానికి హసీన్‌ అసలు విషయం చెప్పిందని, అప్పటికే తనకు షఫీయుద్దీన్‌ అనే వ్యక్తితో పెళ్లి అయ్యిందని, ఆ పిల్లలు తన పిల్లలేనని చెప్పడంతో షాక్‌కు గురయ్యానని చెప్పాడు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top