ఆరేళ్లు ఆగాల్సిందే!

Gymnastics Aruna Reddy Chit Chat With Sakshi

పెళ్లిపై జిమ్నాస్ట్‌ అరుణారెడ్డి 

ఒలింపిక్స్‌ లక్ష్యమన్న క్రీడాకారిణి  

‘నా లక్ష్యం 2020 ఒలింపిక్స్‌. ఇక నుంచి నా దృష్టంతా దానిపైనే ఉంటుంది. మరో ఆరేళ్లు పెళ్లి గురించి ఆలోచించను. ఖాళీ సమయాల్లో ఇంట్లో వంటలు, షాపింగ్‌ చేస్తుంటాను. కారులో తిరుగుతూ సిటీలో రౌండ్స్‌ వేయడమంటే మరీఇష్టమ’ని చెప్పింది జిమ్నాస్ట్‌ బుద్దా అరుణారెడ్డి. ఆమె చెప్పిన మరిన్ని విశేషాలు..

హిమాయత్‌నగర్‌  :‘పెళ్లి ప్రపోజల్స్‌ వస్తున్నాయి. కానీ ఇప్పుడు నా ఆలోచనంతా ఒలింపిక్స్‌ మీదనే. నా వయసు కూడా చాలా చిన్నదే కాబట్టి ఇప్పుడే పెళ్లేంటని ఆలోచిస్తున్నాను. సో... సిక్స్‌ ఇయర్స్‌ వరకు నో మ్యారేజ్‌. ఆరేళ్ల తర్వాతే పెళ్లి. అది ప్రేమ పెళ్లా? పెద్దలు కుదిర్చిన పెళ్లా? అనేది అప్పుడే చెబుతాను. అప్పటి వరకు సీక్రెట్‌’ అంటూ చెప్పుకొచ్చింది జిమ్నాస్ట్‌ బుద్దా అరుణారెడ్డి. కాలికి గాయంతో మూడు నెలలు చికిత్స తీసుకున్న ఆమె పూర్తిగా కోలుకుంది. శుక్రవారం ఓ హోటల్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో అరుణారెడ్డి ‘సాక్షి’తో పంచుకున్నవిశేషాలివీ... 

నాకు టైమ్‌ దొరికితే ఫ్యామిలీతోనే ఉంటాను. మా అక్క, బావ, వారి పిల్లలతో ఎంజాయ్‌ చేస్తాను. పిల్లలు పూర్వీ, నిషాంత్‌లతో ఆడుకుంటాను. వాళ్లే నా ప్రపంచం. ప్రతిరోజు అమ్మ సుభద్ర, అక్క పావని నాకోసం వెరైటీ వంటలు చేస్తుంటారు. వారికి రెస్ట్‌ ఇచ్చేందుకు అప్పుడప్పుడు వంటలు ట్రై చేస్తుండేదాన్ని. అలా అలా వంటలు నేర్చుకున్నాను. ఎక్కువగా ‘బ్రౌనీస్‌’ చేస్తుంటాను. వీకెండ్స్‌లో చికెన్, మటన్, ఫిష్‌ కర్రీ వండి ఇంట్లో వాళ్లపైనే ట్రై చేస్తుంటాను (నవ్వుతూ). అవి ఎలా ఉంటాయో వాళ్లు చెప్పరు. కానీ సూపర్‌ ఉందని మాత్రం అంటారు.


డ్రైవింగ్‌.. షాపింగ్‌  
ఈ మధ్య డ్రైవింగ్‌పై ఇష్టం పెరిగింది. సిటీలోని ఇరుకు రోడ్లపై డ్రైవింగ్‌ చేయడం థ్రిల్‌గా అనిపిస్తుంది. మొదట్లో డ్రైవింగ్‌ చేయాలంటే భయం వేసేది. కానీ ఆటల నిమిత్తం ఇతర దేశాలకు వెళ్లినప్పుడు అక్కడ అమ్మాయిలు డ్రైవింగ్‌ చేయడం చూశాను. నేనెందుకు నేర్చుకోకూడదని, ఇంటికి వచ్చాక నేర్చుకున్నాను. ఈ ప్రోగ్రామ్‌కి కూడా నేనే స్వయంగా డ్రైవ్‌ చేసుకుంటూ వచ్చాను (నవ్వూతూ). టైమ్‌ దొరికితే చాలు.. షాపింగ్‌కి ఎక్కువ ప్రాధాన్యమిస్తా. స్పోర్ట్స్‌ డ్రెస్సెస్‌ ధరించడంతో అవే అలవాటు అయ్యాయి. దీంతో ప్రతిసారి ప్రముఖ బ్రాండ్ల టీషర్టులను కొనుక్కుంటాను. నా దగ్గర దాదాపు 100కు పైగా టీషర్టులు ఉన్నాయి. చీరలు కట్టుకోవాలనే కోరిక చిన్నప్పటి నుంచి ఉండేది. కానీ ఇప్పటి వరకు ఒక్క చీర కూడా కొనుక్కోలేదు. అక్క చీరలన్నీ కట్టి పడేస్తూ విసుగు తెప్పిస్తుంటాను (నవ్వుతూ). పండగల సమయంలో చీరలు కట్టుకుంటాను.   

సిటీలో రౌండ్స్‌    
స్కూల్‌ టైమ్‌ నుంచి నాకు సినిమాలంటే చాలా ఇష్టం. మొదట్లో ఏదైనా సినిమా చూడాలనిపిస్తే నాన్నకి చెప్పేదాన్ని. నాన్న ప్రాక్టీస్‌ అయిపోయాక తీసుకెళ్లేవారు. నాన్న మరణించాక అక్క, బావ వాళ్లతో వెళ్తున్నాను. హీరో ప్రభాస్‌ అంటే పిచ్చి. అనుష్క అంటే కూడా అభిమానం. బాలీవుడ్‌లో సారా అలీఖాన్‌కి నేను పెద్ద ఫ్యాన్‌ని. నైట్‌లో మన సిటీ చాలా అందంగా ఉంటుంది. విదేశాలకు వెళ్లినప్పుడు మన సిటీని బాగా మిస్సవుతున్న ఫీలింగ్‌ వస్తుంటుంది. ఆ టైమ్‌లో అక్కకి, బావకి చెప్పి కారులో సిటీ మొత్తం రౌండ్స్‌ వేస్తాం. ట్యాంక్‌బండ్, బిర్లామందిర్, చార్మినార్, హైటెక్‌ సిటీ, శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ తదితర ప్రాంతాల్లో తిరుగుతుంటాం.


ఫిట్‌నెస్‌...   
ఫిట్‌నెస్‌ కోసం చాలా కష్టపడతాను. ప్రారంభంలో చాలా ఇబ్బందిగా ఉండేది. తర్వాత అలవాటై పోయింది. ఉదయం 6 గంటలకు నిద్రలేస్తాను. 10 నిమిషాలు వ్యాయామం చేశాక... లెమన్‌ వాటర్‌ తీసుకొని ప్రాక్టీస్‌కి వెళ్తాను. మళ్లీ 9గంటలకు ఇంటికి వస్తాను. బ్రేక్‌ఫాస్ట్‌లో వెజ్‌ కర్రీ విత్‌ చపాతీ తింటాను. ఆ తర్వాత రెండు గంటలు నిద్రపోతాను. లంచ్‌లో లైట్‌గా రైస్, నాన్‌వెజ్‌తో రోటీ తీసుకుంటాను. మళ్లీ మూడు గంటలకు జిమ్‌కి వెళ్తాను. ఆ తర్వాత ప్రాక్టీస్‌. రాత్రి ఇంటికి వచ్చాక రోటీ తిని పడుకుంటాను. ప్రతిరోజు 6–7గంటలు ప్రాక్టీస్‌ చేస్తుంటాను.  

టార్గెట్‌ ఒలింపిక్స్‌..  
ఇప్పుడే గాయం నుంచి కోలుకున్నాను. ఒలింపిక్స్‌కు ఎంపికయ్యే అవకాశం అక్టోబర్‌లో ఉంది. అక్టోబర్‌లో జరిగే వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ చివరి క్వాలిఫయర్‌లో హాజరవుతాను. అందులో కచ్చితంగా ఎంపికై 2020లో జరిగే ఒలింపిక్స్‌లో పాల్గొంటాను. పతకం సాధిస్తాననే నమ్మకం ఉంది. గాయం నాలో మరింత కసి, పట్టుదలను పెంచింది. ఇప్పుడు నా దృష్టంతా ఒలింపిక్స్‌ పైనే. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top