
సెమీస్‌లో ఆసీస్
అండర్ -19 ప్రపంచకప్‌లో వెస్టిండీస్, ఆస్ట్రేలియా మధ్య క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్... ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 26.3 ఓవర్లలో 70 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది.
దుబాయ్: అండర్ -19 ప్రపంచకప్‌లో వెస్టిండీస్, ఆస్ట్రేలియా మధ్య క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్... ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 26.3 ఓవర్లలో 70 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. ఈ దశలోనే ఎవరైనా.. ఆ జట్టు వంద పరుగులు చేస్తే చాలా గొప్ప అనే అనుకుంటారు. కానీ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ నికోలస్ పూరన్ (160 బంతుల్లో 143; 14 ఫోర్లు; 6 సిక్స్‌లు) చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు.
చివరి వరుస ఆటగాళ్లను అండగా చేసుకుని సెంచరీ చేయడమే కాకుండా జట్టు స్కోరును ఏకంగా 49.5 ఓవర్లలో 208 పరుగులకు చేర్చాడు. మిగతా వారిలో ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోరు చేయగా మొత్తం జట్టు పరుగుల్లో 69 శాతం తనే సాధించడం విశేషం. అయితే ఆ తర్వాత ఆసీస్ 46.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసి గెలిచింది. ఫలితంగా ఐదు వికెట్ల తేడాతో నెగ్గి సెమీఫైనల్‌కు చేరుకుంది. ఓపెనర్లు షార్ట్ (62 బంతుల్లో 52; 4 ఫోర్లు), జెరోన్ మోర్గాన్ (66 బంతుల్లో 55; 8 ఫోర్లు; 1 సిక్స్) రాణించారు.
చిరస్మరణీయ ఇన్నింగ్స్
వెస్టిండీస్ 32 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో పూరన్ క్రీజులోకి వచ్చాడు. సహచరుల నుంచి ఎలాంటి తోడ్పాటు అందలేదు. ఫలితంగా మరో 38 పరుగులకు మరో నాలుగు వికెట్లు పడ్డాయి. కావాల్సినని ఓవర్లున్నా చేతిలో ఉన్నవి రెండే వికెట్లు. ఈ క్లిష్ట పరిస్థితిలో జోన్స్ (36 బంతుల్లో 20; 2 ఫోర్లు) పూరన్‌కు చక్కగా సహకరించాడు. పూరన్ చాలా తెలివిగా ఆడుతూ ప్రతీ ఓవర్‌లో స్ట్రయికింగ్ తనకే వచ్చేటట్లు చూసుకుంటూ పరుగులు సాధించుకుంటూ వెళ్లాడు. 49వ ఓవర్‌లో మూడు సిక్స్‌లు బాదాడు. చివరి ఓవర్‌లో జోన్స్ రనౌట్ కాగా మరో బంతి మిగిలుండగా పూరన్ బౌల్డ్ అయ్యాడు. అప్పటికే తొమ్మిదో వికెట్‌కు 136 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. ఇది అండర్-19 ప్రపంచకప్‌లోనే రికార్డు భాగస్వామ్యం.
దక్షిణాఫ్రికా కూడా సెమీస్‌కు
మరో క్వార్టర్ ఫైనల్లో అఫ్ఘానిస్థాన్‌పై దక్షిణాఫ్రికా జట్టు 9 వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్ఘాన్ 49.5 ఓవర్లలో 197 పరుగులు చేసింది. ఆ తర్వాత సఫారీలు 39.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 198 పరుగులు చేసి నెగ్గారు. మర్‌క్రమ్ (105) సెంచరీ చేశాడు.