
విశాఖపట్నం: వైఎస్ షర్మిలపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం బాధాకరమని విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అక్కరమాని విజయనిర్మల అన్నారు. ఒక మహిళ, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె అని కూడా చూడకుండా లేనిపోనివి కల్పిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం సిగ్గులేని చర్యగా అభివర్ణించారు. టీడీపీ నాయకుల చర్యలతో మానవత్వం ఉన్న తల్లిదండ్రులు మనస్తాపం చెందుతున్నారని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా ప్రచారం స్వయంగా హైదరాబాద్‌లోని బాలకృష్ణ నివాసం నుంచే జరగడం విచారకరమన్నారు.
చంద్రబాబు నాయుడికి ఆడపిల్లలు లేరు..కనీసం బాలకృష్ణకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారన్న ఆలోచన చేయకుండా షర్మిలపై చెడు ప్రచారం సాగించడం బాధాకరమన్నారు. బాలకృష్ణ, చంద్రబాబు ఇలాంటి నీచరాజకీయాలు మానుకోకపోతే మహిళలు గట్టిగా బుద్ధి చెబుతారని శాపనార్ధాలు పెట్టారు. చంద్రబాబుకు దమ్ము ధైర్యం ఉంటే ప్రత్యక్షంగా నిజాయతీగా ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. అంతేతప్ప మహిళలపై లేనిపోని నిందలు వేస్తే సహించేది లేదన్నారు.