కేసీఆర్‌ మాట తప్పారు: నాయిని నర్సింహారెడ్డి

Naini Narsimha Reddy Rejects RTC Chairman Post - Sakshi

కౌన్సిల్‌లో ఉండు మంత్రి పదవి ఇస్తా అన్నారు..

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌  నాయకుల్లో ఉన్న అసంతృప్తి మెల్లిగా బయటపడుతోంది. ఇప్పటికే మంత్రి ఈటల, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌లు తమ మనసులోని అసంతృప్తిని బహిరంగ వేదికల మీద వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి మాజీ హోం మంత్రి, టీఆర్‌ఎస్ సీనియర్ నేత నాయిని నరసింహారెడ్డి చేరారు. కేసీఆర్‌ తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి మాట తప్పారని నాయిని ఆరోపించారు. బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం రోజునే నాయిని ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సోమవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో నాయిని మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అన్నాను. కానీ కేసీఆర్‌, వద్దు కౌన్సిల్‌లో ఉండు మంత్రి పదవి ఇస్తా అన్నాడని తెలిపారు. తన అల్లుడికి కూడా ఎమ్మెల్సీ ఇస్తానని కేసీఆర్‌ మాట ఇచ్చారని పేర్కొన్నారు.

మంత్రి పదవి ఇస్తానన్న కేసీఆర్‌.. ఇప్పుడేమో ఆర్టీసీ చైర్మన్‌ పదవి ఇస్తానంటున్నారని నాయిని అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు చైర్మన్‌ పదవి వద్దని.. అందులో రసం లేదంటూ నాయిని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాక తాజా పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్‌ మా ఇంటికి పెద్ద.. మేమంతా ఓనర్లమే అని స్పష్టం చేశారు. కిరాయిదార్లు ఎంత కాలం ఉంటారో వాళ్లిష్టమన్నారు నాయిని.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top