ఎమ్మెల్సీ తేజస్విని వీరంగం

MLC Tejaswini Conflicts on School Construction Karnataka - Sakshi

నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల నిర్మాణం?

రణరంగంగా మారిన దొడ్డరాయప్పనహళ్లి

దొడ్డబళ్లాపురం: యాంకర్‌గా ప్రజలకు పరిచయమై, కాంగ్రెస్‌లో చేరి ఎంపీగా గెలిచి తరువాత బీజేపీలో చేరి ప్రస్తుతం ఎమ్మెల్సీ అయిన తేజస్విని రమేశ్‌ తమ స్వగ్రామం అయిన దొడ్డ తాలూకా దొడ్డరాయప్పనహళ్లిలో వీరంగం సృష్టించారు. గ్రామంలో పాఠశాల నిర్మించడానికి నిధులు వచ్చాయని తేజస్విని పనులు ప్రారంభించారు. అయితే స్థానిక గ్రామపంచాయతీ నిబంధనలు తుంగలో తొక్కి, రాజకీయ దురుద్దేశంతో తన ఇంటి ముందు రాకపోకలు సాగించడానికి కూడా అవకాశం లేకుండా కట్టడం నిర్మించడం జరుగుతోందని మెళేకోట గ్రామపంచాయతీ అధ్యక్షుడు నరసింహమూర్తి ఆరోపిస్తున్నాడు. ఈ క్రమంలో గ్రామంలో కొందరు తేజస్వినికి మద్దతుగా మరికొందరు నరసింహమూర్తికి మద్దతుగా నిలవడంతో గ్రామం రణరంగంగా మారింది.

నరసింహమూర్తి ఇంటి ముందు అడ్డంగా తవ్వేసిన దృశ్యం 
గురువారం సాయంత్రం ఇరు వర్గాల మధ్య గొడవలు జరగగా తేజస్విని కొందరిని దుర్భాషలాడుతూ, చేతులతో తోస్తూ, సవాళ్లు విసురుతున్న వీడియోలు స్థానికంగా వైరల్‌గా మారాయి. ఈ గొడవలకు కొనసాగింపుగా శుక్రవారం పంచాయతీ అధ్యక్షుడు నరసింహమూర్తికి మద్దతుగా జేడీఎస్‌ నాయకులు గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తేజస్వినికి, జేడీఎస్‌ నాయకులకు మాటల యుద్ధమే జరిగింది. తేజస్విని తమపై దాడి చేసిందని ఆరోపిస్తూ కొందరు దళితులు గ్రామీణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ తేజస్విని మాత్రం తాను ఎవరిపై దాడి చేయలేదని, కొందరు తనపై కక్షతో పాఠశాల నిర్మాణానికి అడ్డుపడుతున్నారన్నారు. నిజానికి తనమీదే కొందరు దౌర్జన్యం చేసారన్నారు. తాను నిబంధనలకు లోబడే పాఠశాల నిర్మిస్తున్నానన్నారు. ప్రస్తుతం దొడ్డరాయప్పనహళ్లిలో పరిస్థితి నివురుగ్పిన నిప్పులా ఉంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top