రాజంపేట టీడీపీలో రభస!

Conflicts  in Rajampeta TDP YSR Kadapa - Sakshi

రాజంపేటలో రెండువర్గాలుగా పార్టీ శ్రేణులు

తనకు సమావేశ సమాచారం లేదని మేడా దూరం

ఆర్‌అండ్‌బీ బంగ్లా వేదికగా రచ్చరచ్చ

పోలీసుల కనుసన్నల్లో మంత్రి, జిల్లా అధ్యక్షుని సమావేశం

వైఎస్‌ఆర్‌ జిల్లా, రాజంపేట : రాజంపేట టీడీపీలో రాజకీయ ప్రకంపనలు పుట్టుకొచ్చాయి. టీడీపీ శ్రేణులు రెండువర్గాలుగా విడిపోయాయి. ఆర్‌అండ్‌బీ బంగ్లా వేదికగా సమావేశం రచ్చరచ్చగా మారింది. ఆదివారం రాజంపేటలో ప్రెస్‌మీట్‌ పెట్టేందుకు మంత్రి ఆదినారాయణరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి వచ్చారు. మాజీ ఎమ్మెల్యే పసుపులేటి బ్రహ్మయ్య, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చంగల్రాయుడు, సీనియర్‌ నేత జీఎన్‌నాయుడు, రెడ్యంతోపాటు పలువురు నాయకులు హాజరయ్యారు. ఆది, వాసు ఆర్‌అండ్‌బీ అతిథిగృహం వద్దకు చేరుకోగానే ఎమ్మెల్యే వర్గీయులు వారిని అడ్డుకున్నారు. వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యేకు తెలియకుండానే ఎలా వచ్చారని అంటూ పెదవి విరిచారు. పోలీసు బందోబస్తు మధ్య వారు ప్రెస్‌మీట్‌ నిర్వహించేందుకు సన్నద్ధమైన తరుణంలో ఎమ్మెల్యే వర్గీయులు వేదిక వద్ద కు దూసుకొచ్చారు. డీఎస్పీ రాఘవేంద్ర, సీఐలు నరసింహులు, సూర్యనారాయణ సిబ్బందితోఎమ్మెల్యే వర్గీయులను అదుపుచేశారు. తెలుగుమహిళ జిల్లా అధ్యక్షురాలు మల్లెల వాణి, ఎమ్మెల్యే వర్గానికి చెందిన నాయకులు ఆదినారాయణరెడ్డి, శ్రీనివాసులరెడ్డి ఎదుట వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యేకు తెలియకుండా సమావేశం పెట్టడంలో ఆంతర్యం ఏమిటని ఆగ్రహించారు. ఇది ఇలావుండగా ప్రెస్‌మీట్‌లో రాజంపేట టీడీపీకి ఇన్‌చార్జిని ప్రకటిస్తారని, ఎమ్మెల్యేను సస్పెండ్‌ చేస్తారని ఊహాగానాలు ఎమ్మెల్యే వర్గీయులను ఆందోళనకు గురిచేయడమే ఈ రచ్చకు కారణమని తెలుస్తోంది.

మేడా కంటే బలమైన అభ్యర్ధిని పోటీకి దించుతాం..
ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డికి పార్టీలో సుమచితస్ధానం కల్పించామని జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. విలేకర్లతో వారు మాట్లాడుతూ నియోజకవర్గానికి అత్యధికంగా నిధులు విడుదలచేస్తామన్నారు. అభివృద్ధి పనులు వేగవంతం చేశామన్నారు. పార్టీ మారితే హుందాగా బయటకి వెళ్లిపోవాలి తప్ప ఇలా నైతిక లేకుండా చేసి వెళ్లడం తగదన్నారు. ఒకరిద్దరు వెళ్లిపోయినంత మాత్రన పార్టీకి వచ్చిన నష్టం ఏమీలేదన్నారు. రాజంపేట నియోజకవర్గంలో మేడా కంటే బలమైన అభ్యర్ధిని రానున్న ఎన్నికల్లో పోటీకి దింపుతామన్నారు. ఎమ్మెల్యే బెదిరింపులకు, బ్లాక్‌మెయిలింగ్‌ టీడీపీ లొంగదన్నారు. ఈనెల 22న కార్యకర్తలతో సీఎం సమావేశం ఉంటుందన్నారు. అక్కడ పార్టీ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నట్లు చెప్పారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేని కూడా ఆహ్వానం ఉందన్నారు.

తనపై అబద్ధాలు చెప్పిన జిల్లా టీడీపీ నేతలు
సీఎంతో మాట్లాడిన తర్వాతే భవిష్యత్తు కార్యచరణ ఉంటుందని, మంత్రి ఆది, జిల్లా అధ్యక్షుడు వాసు ప్రెస్‌మీట్‌ పెట్టి తనపై పచ్చి అబద్ధాలు చెప్పారని ఎమ్మెలే, ప్రభుత్వవిప్‌ మేడా మల్లికార్జునరెడ్డి పేర్గొన్నారు. మేడా భవన్‌లో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ మీడియా సమావేశంపై తనకు ఎటువంటి సమాచారం లేదన్నారు. టీడీపీకి వ్యతిరేకంగా పని చేసిన వారితో కలిసి సమావేశం నిర్వహించారన్నారు. తనపై పార్టీలో కొందరు కుట్ర చేస్తున్నారన్నారు. ఎన్‌టీఆర్‌ స్ఫూర్తితో ప్రజాసేవకు కట్టుబడి పనిచేశానన్నారు. ఈనెల 17న సీఎంను కలిసేందుకు విమానం టికెట్‌బుక్‌ చేసుకున్నానని, అయి తే తమ దగ్గరవారికి అనారోగ్యం కారణంగా వెళ్లలేకపోయానన్నారు. పార్టీ సభ్యత్వాలు చేయడానికి  కార్యకర్తలు ఆర్ధికంగా బాగాలేకపోవడమే కారణమన్నారు. జమ్మలమడుగులో మంత్రి ఆదికంటే తానే అత్యధికంగా పార్టీ సభ్యత్వాలు చేయించానన్నారు. రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి సీఎంతో భేటి అయిన తర్వాత నిర్ణయం తీసుకుంటానన్నారు. జిల్లా నేతల ఉడత బెదిరింపులకు బెదిరేదిలేదని ఎమ్మెల్యే తేల్చిచెప్పారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top