కమలానికి కలిసిరాని ‘ఉప’పోరు

Bjp Has Won Just Four Out of 23 in Lok Sabha By Elections Since 2014 - Sakshi

ప్రతిష్టాత్మక గోరఖ్‌పూర్‌ స్థానాన్ని కోల్పోవడంతో కలవరం..

న్యూఢిల్లీ: సాధారణ ఎన్నికల్లో అసాధారణ ఫలితాలతో 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఆపై జరిగిన ఉప ఎన్నికల్లో మాత్రం అధికంగా ఓటములను చవిచూస్తోంది. 2014 నుంచి ఇప్పటివరకూ దేశ వ్యాప్తంగా 23 లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా కేవలం నాలుగింటినే బీజేపీ కైవసం చేసుకుంది. కాగా, కాంగెస్‌ పార్టీ 5 స్థానాల్ని గెలుచుకొని ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ కంటే మెరుగ్గా ఉంది. తృణముల్‌ కాంగ్రెస్‌ నాలుగు స్థానాలు గెలిచి తన సత్తా చాటింది.

మోదీ హవాలో.. మరో రెండు విజయాలు
ఈ 23 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ సిట్టింగ్‌ స్థానాలు 10. ప్రధాని నరేంద్ర మోదీ హవా కొనసాగిన 2014లో రెండు స్థానాల్లో, 2016లో మరో రెండు సీట్లను మాత్రమే గెలుచుకున్న బీజేపీ.. మిగతా ఆరింటిని కోల్పోయింది. అయితే 2014లో ఉప ఎన్నికలు జరిగిన 5 లోక్‌సభ స్థానాలను ఆయా పార్టీలు తిరిగి చేజిక్కించుకోవడం గమనార్హం. 2016లో ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ పరవాలేదనిపించింది. లక్ష్మీపూర్‌ (అసోం), శాదోల్‌ (మధ్యప్రదేశ్‌) లోక్‌సభ స్థానాలను తిరిగి నిలబెట్టుకుంది. 

కంచుకోటలో కలవరం..
గత ఏడాది బీజేపీకి ఏమాత్రం కలిసిరాలేదు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌, గుడాస్‌పూర్‌ లోక్‌సభ స్థానాల ఉప ఎన్నికల్లో ఆ పార్టీ పరాజయం పాలైంది. కాంగ్రెస్‌ అమృత్‌సర్‌ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకుంది. అయితే వరసగా 4 సార్లు గుడాస్‌పూర్‌లో గెలుపు బావుటా ఎగరేసిన బీజేపీ ఆ స్థానాన్ని కోల్పోవడం గమనార్హం. కేరళలోని మలప్పురం, జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌ స్థానాల్లోనూ బీజేపీకి పరాభవం తప్పలేదు.

ముఖ్యమంత్రి స్థానంలోనూ అపజయమే..
2018లో బీజేపీ పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. రాజస్థాన్‌లోని అజ్మీర్‌, అల్వార్‌ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో రెండింటీనీ కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. అంతకు ముందు ఆ రెండు స్థానాలు బీజేపీవే. పశ్చిమ బెంగాల్‌లోని ఉలుబెరియా స్థానంలో ఓటమి పాలైన బీజేపీ.. బిహార్‌లోనూ అదే పంథా కొనసాగించింది. బీజేపీకి అఖండ విజయాన్ని అందించి కేంద్రంలో అధికారంలో నిలిపిన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌, ఫూల్‌పూర్‌ స్థానాలను సైతం బీజేపీ కాపాడుకోలేక పోయింది.

విశేషమేమంటే.. ఆ రెండూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్యలు రాజీనామా చేసిన స్థానాలు కావడం. గతేడాది సీఎం, డిప్యూటీ సీఎంలుగా వీరు యూపీ రాష్ట్ర ప్రభుత్వంలో భాగం కావడంతో ఆ స్థానాలు ఖాళీ అయ్యాయి. తాజాగా గోరఖ్‌పూర్‌, ఫూల్‌పూర్‌ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులు గెలుపొందిన విషయం తెలిసిందే. యోగి ఆదిత్యనాథ్ వరసగా 5 సార్లు విజయభేరి మోగించిన తన కంచుకోట గోర్‌ఖ్‌పూర్‌లో బీజేపీ ఓటమి పాలవడం ఈ పార్టీకి మింగుడు పడడం లేదు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top