సరి‘హద్దు’ దాటకండి

Satellite pics show Chinese activity at LAC - Sakshi

ఎల్‌ఏసీకి అటువైపే కార్యకలాపాలు కొనసాగించుకోండి

గాల్వన్‌ లోయపై అహేతుక వ్యాఖ్యలొద్దు

చైనాకు స్పష్టం చేసిన భారత్‌

న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దుల వెంట ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో.. వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ)కు అటు(చైనా) వైపే కార్యకలాపాలు కొనసాగించుకోవాలని  చైనాకు భారత్‌ స్పష్టం చేసింది. క్షేత్రస్థాయిలో మార్పులు చేసే దిశగా ఏకపక్ష చర్యలకు తెగబడవద్దని తేల్చిచెప్పింది. అలాగే, గాల్వన్‌ లోయ ప్రాంతం తమదేనంటూ చైనా చేస్తున్న వ్యాఖ్యలను తిప్పికొట్టింది. అలాంటి అహేతుక, సమర్థనీయం కాని వ్యాఖ్యలు చేయవద్దని హితవు పలికింది. తమదికాని భూభాగాన్ని తమదే అని.. ఎక్కువ చేసి చెప్పుకునే తీరును మార్చుకోవాలని పేర్కొంద

జూన్‌ 6న ఇరుదేశాల ఉన్నతస్థాయి మిలటరీ అధికారుల మధ్య కుదిరిన ఒప్పందానికి ఈ వ్యాఖ్య విరుద్ధంగా ఉందని పేర్కొంది. దేశ భౌగోళిక సమగ్రతను కాపాడుకునేందుకు భారత్‌ కట్టుబడి ఉందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ గురువారం పేర్కొన్నారు. సోమవారం రాత్రి భారత్, చైనా సైనికుల మధ్య గాల్వన్‌ లోయ ప్రాంతంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘర్షణల సందర్భంగా భారతీయ సైనికులెవరూ గల్లంతు కాలేదని స్పష్టం చేశారు. ‘సరిహద్దుల నిర్వహణ విషయంలో భారత్‌ స్పష్టంగా ఉంది.

తమ కార్యకలాపాలన్నీ ఎల్‌ఏసీకి ఇటు(భారత్‌) వైపే, భారత భూభాగంలోనే కొనసాగిస్తోంది. చైనా కూడా అదే తీరున వారి భూభాగంలోనే తమ కార్యకలాపాలు జరుపుకోవాలి’ అని పేర్కొన్నారు. సరిహద్దు వివాదాల పరిష్కారానికి చర్చలే మార్గమని భారత్‌ విశ్వసిస్తుంది.అదే సమయంలో, దేశ సమగ్రత, సార్వభౌమత్వం విషయంలో రాజీ లేదు’ అన్నారు. జూన్‌ 23న జరిగే రిక్‌(రష్యా–ఇండియా–చైనా) దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జై శంకర్‌ పాల్గొంటారన్నారు.

కొనసాగుతున్న మేజర్‌ జనరల్‌ స్థాయి చర్చలు
సరిహద్దు ఉద్రిక్తతలను తొలగించుకునే దిశగా భారత్, చైనాల మధ్య జరుగుతున్న మేజర్‌ జనరల్‌ స్థాయి చర్చలు గురువారం కొనసాగాయి. అయితే, మంగళ, బుధ వారాల్లో ఎలాంటి ఏకాభిప్రాయానికి రాకుండానే చర్చలు నిలిచిపోయాయి. కాగా, గాల్వన్‌ లోయ ప్రాంతంలో చైనా సైనికులతో తీవ్రస్థాయి హింసాత్మక ఘర్షణల అనంతరం కొందరు భారత సైనికులు గల్లంతయ్యారని, సైనికులను చైనా బందీలుగా తీసుకువెళ్లిందని వచ్చిన వార్తలను ఇండియన్‌ ఆర్మీ తోసిపుచ్చింది.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top