ఎన్పీఆర్‌పై అనుమానాలొద్దు: అమిత్‌ షా

No document will be asked for NPR exercise says Amit Shah - Sakshi

ఈ ప్రక్రియకు ధ్రువపత్రాలు అవసరం లేదు

ఢిల్లీ అల్లర్ల వెనుక పెద్ద కుట్ర ఉంది

రాజ్యసభలో హోంమంత్రి అమిత్‌ షా

న్యూఢిల్లీ: జాతీయ జనాభా పట్టిక(నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌–ఎన్పీఆర్‌)పై ఆందోళన అవసరం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. ఎన్పీఆర్‌ను అప్‌డేట్‌ చేసే కార్యక్రమంలో ఏ పౌరుడి వివరాలను ‘అనుమానాస్పద(డౌట్‌ఫుల్‌– డీ)’ కేటగిరీలో చేర్చబోమని తెలిపారు. అలాగే, తమ పౌరసత్వాన్ని నిరూపించుకునే ఏ ధ్రువ పత్రాలను కూడా పౌరులు ఇవ్వాల్సిన అవసరం లేదని వివరణ ఇచ్చారు. ఎన్పీఆర్‌ ప్రశ్నావళిలో తల్లిదండ్రుల నివాసానికి సంబంధించిన ప్రశ్నలపై తలెత్తిన అనుమానాలను నివృత్తి చేస్తూ.. పౌరులు తమ వద్ద లేని సమాచారాన్ని కచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.

సీఏఏపై గానీ, ఎన్పీఆర్‌పై కానీ మైనారిటీలు ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దన్నారు. ఎన్పీఆర్‌కు సంబంధించిన అనుమానాల నివృత్తికి విపక్ష నేతల బృందం తనను కలవొచ్చని సూచించారు. పౌరసత్వాన్ని రద్దు చేసే ఏ సెక్షన్‌ కూడా పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)లో లేదని మరోసారి స్పష్టం చేశారు. ఢిల్లీ అల్లర్లపై గురువారం రాజ్యసభలో జరిగిన చర్చకు హోంమంత్రి సమాధానమిచ్చారు. కులం, మతం, రాజకీయ పార్టీలతో అనుబంధం.. వీటికి సంబంధం లేకుండా ఢిల్లీ అల్లర్ల దోషులను చట్టం ముందు నిలుపుతామని పునరుద్ఘాటించారు.

పౌరసత్వ సవరణ చట్టం పార్లమెంటు ఆమోదం పొందిన తరువాత కొందరు ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ చేసిన విద్వేష ప్రసంగాల కారణంగానే ఢిల్లీ హింసాకాండ చోటు చేసుకుందని షా పేర్కొన్నారు. ప్రభుత్వమే హింసాకాండకు పురిగొల్పిందన్న ఆరోపణలపై స్పందిస్తూ.. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన అమెరికా అధ్యక్షుడు దేశంలో పర్యటిస్తున్న వేళ ఏ ప్రభుత్వమైనా అలా చేస్తుందా? అని ప్రశ్నించారు. ఢిల్లీ హింసాకాండ వెనుక పెద్ద కుట్ర ఉందని, విదేశీ నిధులను దీనికి ఉపయోగించారని  ఆరోపించారు. 

అల్లర్లను అదుపు చేయడంలో  పోలీసుల తీరును తప్పుబట్టిన ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్‌ మురళీధర్‌ను బదిలీ చేయడంలో ఎలాంటి కుట్ర లేదని, ఆ బదిలీ అంతకుముందు, సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసుల ఆధారంగానే జరిగిందని వివరణ ఇచ్చారు. ‘ఆ ఒక్క న్యాయమూర్తే న్యాయం చేస్తారని ఎందుకు అనుకుంటున్నారు? వేరే జడ్జి న్యాయం చేయరా?’ అని ప్రశ్నించారు. కాగా, అంతకుముందు విపక్ష సభ్యులు.. ఢిల్లీ అల్లర్లపై నిష్పక్షపాత దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేశారు. కోవిడ్‌ కన్నా ప్రమాదకరమైన మత వైరస్‌(కమ్యూనల్‌ వైరస్‌)ను బీజేపీ వ్యాప్తి చేస్తోందని, దీని వల్ల ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమని చర్చను ప్రారంభిస్తూ కాంగ్రెస్‌ సభ్యుడు కపిల్‌ సిబల్‌ వ్యాఖ్యానించారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top