వంద కోట్ల జరిమానా

National Environment Tribunal Fine For Tamilnadu - Sakshi

పళని సర్కారుపై కన్నెర్ర

జాతీయ పర్యావరణ ట్రిబ్యునల్‌ ఉత్తర్వులు

బకింగ్‌హాం, కూవం, అడయార్‌ నదుల కలుషితంపై ఆగ్రహం

జరిమానా చెల్లించాల్సిందేనని హుకుం.. అప్పీలు ప్రయత్నాలు

సాక్షి, చెన్నై: రాజధాని నగరంలోని బకింగ్‌హాం కాలువ, కూవం, అడయార్‌ నదులు కలుషితం కావడాన్ని జాతీయ పర్యావరణ ట్రిబ్యునల్‌ తీవ్రంగా పరిగణించింది. ఈ నదుల్లో పూడికతీత కరువు, దుర్గంధం వంటి అంశాలతో పాటు నిధులు కేటాయించినా పునరుద్ధరణ చర్యలు చేపట్టకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తమిళనాడు ప్రభుత్వానికి రూ. వంద కోట్లు జరిమానా విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ట్రిబ్యునల్‌ ఉత్తర్వులపై అప్పీలుకు అధికార వర్గాలు సిద్ధం అవుతున్నాయి. చెన్నైలో బకింగ్‌ హాం కాలువ, కూవం, అడయార్‌ నదులు ఉన్నాయి.  ఒకప్పుడు ఈ నదుల్లో స్వచ్ఛమైన నీళ్లు ప్రవహించేవి. పడవ సవారీ కూడా సాగేదని చెప్పవచ్చు. కాలక్రమేనా నగరాభివృద్ధితోపాటు స్వచ్ఛత కరువై మురికి నీటి మార్గంగా ఈ నదులు మారాయి. కూవం, అడయార్‌ నదీ పరివాహక ప్రదేశాలన్నీ ఆక్రమణలకు గురయ్యాయి. ఆ నదుల తీరంలోని పరిశ్రమలు, నివాస గృహాల నుంచి వెలువడే వ్యర్థాలతో, చెత్తా చెదారాలతో మురికి కూపంగా, అటువైపు వెళ్తే చాలు ముక్కు మూసుకోవాల్సినంత పరిస్థితి తప్పడం లేదు.

కూవం ప్రక్షాళన, అడయార్‌కు మహర్దశ అంటూ పాలకులు ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. నిధుల్ని సైతం కేటాయిస్తున్నా, అందుకు తగ్గపనులు అడుగైనా ముందుకు సాగడం లేదు. అందుకే 2015లో చెన్నై భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పలేదు. కుండపోత వర్షం, పోటెత్తిన వరదలతో కూవం, అడయార్‌లు ఉప్పొంగి జనావాసాల మీదుగా దూసుకొచ్చాయి. అష్టకష్టాల్ని చెన్నై వాసులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా, పాలకులు గుణపాఠం నేర్వలేదు. వర్షాలు వస్తున్నాయంటే, హడావుడి సృష్టిం చడం, ఆతదుపరి యథారాజా తథా ప్రజా అన్నట్టుగా వ్యవహరించడం పరిపాటిగా మారింది.

ట్రిబ్యునల్‌లో పిటిషన్‌..
కూవం, అడయార్, బకింగ్‌హాంల కలుషితంపై పర్యావరణ ట్రిబ్యునల్‌లో అనేక పిటిషన్లు విచారణలో ఉన్నాయి. వీటికి తోడు గత ఏడాది తిరువాన్మియూరుకు చెందిన జవహర్‌లాల్‌ షణ్ముగం దాఖలు చేసిన పిటిషన్‌ను ట్రిబ్యులన్‌ తీవ్రంగా పరిగణించింది. బకింగ్‌ హాం కాల్వలో అత్యధికంగా నిర్మాణ శకలాలు ఉన్నాయని, మట్టి, చెత్తాచెదారాలు పేరుకు పోయాయని, వర్షా కాలంలో నివాసాల వైపు వరదలు దూసుకొచ్చేంతగా పరిస్థితి ఉందని ఆ పిటిషన్‌లో జవహర్‌లాల్‌ వివరించారు. దీంతో ఇది వరకు దాఖలైన అన్ని పిటిషన్లను కలిపి జాతీయ పర్యావరణ ట్రిబ్యునల్‌ విచారించడం మొదలెట్టింది. ప్రభుత్వాన్ని వివరణ కూడా కోరింది. గతంలో బకింగ్‌ హాం కాలువ,  కూవం, అడయార్‌ల ప్రక్షాళన పేరిట 1,646 కోట్లతో ప్రత్యేక పథకం, తొలి విడతగా రూ.604 కోట్ల కేటాయింపు వంటి అంశాల ప్రస్తావన ట్రిబ్యునల్‌ ముందుకు చేరింది. 2016లో చేపట్టిన చర్యలు, అలాగే, 13 పరిశ్రమలు, ఆ తీరం వెంబడి ఉన్న విద్యా సంస్థల నుంచి వెలుపలకు వస్తున్న మురికి అంతా కలిపి ఆ నదుల్ని పూర్తి స్థాయిలో కలుషితంకు కారణంగా తేల్చే రీతిలో నివేదికలు చేరాయి. వీటన్నింటిని పర్యావరణ ట్రిబ్యునల్‌ సమగ్రంగానే పరిశీలించినట్టుంది.

శనివారం ఢిల్లీలో సాగిన విచారణ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వివరణతో కూడిన నివేదికను ట్రిబ్యునల్‌ పరిశీలించింది. అధికారుల నిర్లక్ష్యం అన్నది కొట్టచ్చినట్టు కనిపిస్తున్నదని, పాలకులు చర్యలు అసంతృప్తికరంగా ఉందని ట్రిబ్యునల్‌ వ్యాఖ్యానించింది. పర్యావరణ పరిరక్షణలో పూర్తిగా విఫలం అయ్యారని, కలుషితం కాబడ్డ నదుల్లో పూడిక తీత, వ్యర్థాల తొలగింపు అన్నది సక్రమంగా సాగలేదని, ప్రక్షాళన అన్నది ప్రకటకే పరిమితం కావడంతో తమిళనాడు ప్రభుత్వానికి రూ.వంద కోట్లు జరిమానా విధిస్తున్నట్టు ప్రకటించి మధ్యంతర ఉత్తర్వుల్ని ట్రిబ్యునల్‌ జారీ చేయడం గమనార్హం. కేంద్ర పర్యావరణ శాఖకు ఈ వంద కోట్ల జరిమానా చెల్లించాలని, ఈ మొత్తాన్ని పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధి  ఉపయోగించాలని ట్రిబ్యునల్‌ పేర్కొనడంతో పళని సర్కారుకు షాక్‌ తగిలినట్టు అయింది. దీంతో సోమవారం పర్యావరణశాఖ, ప్రజా పను లశాఖ వర్గాలతో సీఎం పళనిస్వామి సమాలోచనకు నిర్ణయించినట్టు సమాచారం. ఇందులో తీసుకునే నిర్ణయం మేరకు అప్పీలు ప్రయత్నాలు చేపట్టబోతున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top