మిస్టరీ : ఏడేళ్ల రాహుల్‌ ఎక్కడ?

Mystery About Seven years Old Boy Missing In Kerala - Sakshi

అలెప్పీ : దేశంలోని అత్యున్నత విచారణ సంస్థ సీబీఐకూ మింగుడుపడని కేసు ఇది. 2005లో కేరళలోని అలెప్పీలో చోటు చేసుకుంది. స్నేహితులతో కలిసి ఇంటి సమీపంలో ఆడుకుంటున్న ఏడేళ్ల రాహుల్‌ రాజు ఆటల మధ్యలో నీళ్ల కోసమని వీధి మలుపులో ఉన్న కొళాయి వద్దకు వెళ్లాడు. ఆ తర్వాత ఏమైందో.. రాహుల్‌  కనిపించకుండాపోయాడు. ఒక్కగానొక్క కుమారుడు కనిపించకపోవడంతో తండ్రి రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నీళ్లు తాగేందుకు వెళ్లినప్పుడు రాహుల్‌కు దగ్గరగా గడ్డంతో ఉన్న ఓ మధ్య వయస్కుడిని చూశామని స్నేహితులు చెప్పారు. దీంతో పోలీసులు చుట్టుపక్కల చాలామందిని ప్రశ్నించారు. ఇందులో ఓ మధ్యవయస్కుడు కూడా ఉన్నాడు. రాహుల్‌ను తానే చంపానని, శవాన్ని దగ్గరలోని చిత్తడి నేలలో పడేశానని కూడా చెప్పాడు.

అయితే, కేసు ఇక్కడే మలుపు తిరిగింది. పోలీసులు ఎంత వెతికినా ఆ చిత్తడి నేలలో శవం కనిపించలేదు. ఇదే సమయంలో ఆ మధ్యవయస్కుడు చెప్పిందంతా అబద్ధమని తెలిసింది. మిస్టరీ మళ్లీ మొదటికొచ్చింది. సాక్ష్యం లేకపోవడం, ఇరుగుపొరుగును ఎంతమందిని ప్రశ్నించినా ఫలితం లేకపోవడంతో 2006లో కేసు విచారణ సీబీఐకి అప్పగించారు. విచారణలో భాగంగా ఓ వ్యక్తికి నార్కో అనాలసిస్‌ చేయాలని సీబీఐ కోర్టును కోరింది. కోర్టు సరేనంది. అయినా ఫలితం దక్కలేదు. ఇక మావల్ల కాదని సీబీఐ 2013లో కేసు మూసేస్తామని కేరళ హైకోర్టుకు విన్నవించింది. ఇందుకు రాహుల్‌ తండ్రి అభ్యంతరం చెప్పడంతో ఇంకో ఏడాది సీబీఐ విచారణ కొన‘సా...గించింది. చివరకు 2014లో కేసు మూసేస్తున్నట్టు ప్రకటించింది. పిల్లాడి ఆచూకీ తెలిపిన వారికి రూ.50వేల బహుమతి ఇస్తామని సీబీఐ, కేరళ ప్రభుత్వాలు వేర్వేరుగా ప్రకటించాయి. ఇప్పటికీ ఈ కేసు మిస్టరీనే!.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top