వీళ్ళే సివిల్‌ సర్వెంట్స్‌! | Sakshi
Sakshi News home page

వీళ్ళే సివిల్‌ సర్వెంట్స్‌!

Published Sat, Aug 18 2018 10:21 PM

Kerala Floods 2018 Rescue Operations In Kerala - Sakshi

దేవలోకంగా భావించే కేరళని  వరదలు ముంచెత్తడంతో ఆపన్న హస్తం కోసం అన్నార్తులు ఎదురుచూస్తున్నారు. గూడు చెదిరి కొందరు, గుండె పగిలి మరికొందరు. చెట్టుకొకరు పుట్టకొకరుగా చెదిరిపోయారు. పచ్చటి పైర్లతో విలసిల్లే కేరళలో గుప్పెడు బియ్యం కోసం ప్రజలు అల్లాడుతున్నారు. సహాయకచర్యలకోసం విలవిల్లాడుతున్నారు. ఇదే సందర్భంలో కేరళలోని ఇద్దరు ఐఏఎస్‌ అధికారులు తమ ఉద్యోగధర్మానికి సరైన నిర్వచనంలా నిలిచారు. వరదలు ముంచెత్తిన రాత్రి సహాయక చర్యల్లో భాగంగా ఎంతో ప్రయాసపడి బియ్యం బస్తాలను మోసుకుంటూ వచ్చింది ఓ వ్యాన్‌. అసలే రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. రోడ్లు కొట్టుకుపోయాయి.

విద్యుత్‌ లేనేలేదు. తక్షణమే వచ్చిన లోడ్‌ని ఖాళీ చేసి, వ్యాన్‌ తిరిగి పంపించాలి. అయితే, బస్తాలు దించేందుకు  అందుబాటులో ఉన్న వాళ్ళు సరిపోరు. అది చూసిన ఇద్దరు ఐఏఎస్‌ అధికారులు వెంటనే కార్యక్షేత్రంలోకి దిగి ట్రక్కులో ఉన్న బియ్యం బస్తాలను భుజాలకెత్తుకొని ఒకదాని తర్వాత ఒకటి దించేసారు. సివిల్‌ సర్వెంట్స్‌కి సరైన నిర్వచనం ఇచ్చిన జి.రాజమాణిక్యం, ఎన్‌ఎస్‌కె. ఉమేష్‌లు అందరికీ ఆదర్శంగా నిలిచారు.  వయ్‌నాడ్‌ జిల్లా సబ్‌కలెక్టర్‌గా ఉన్న ఎన్‌ఎస్‌కె ఉమేష్,  ప్రత్యేక అధికారి హోదాలో కేరళ ఫుడ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ జి.రాజమాణిక్యం అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. కేరళ ఐఏఎస్‌ ఆఫీసర్స్‌ ఆర్గనైజేషన్‌ ఈ విషయాన్ని సోషల్‌మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది.

జంతువులను రక్షిస్తున్న హెచ్‌ఎస్‌ఐ 
ఎడతెరిపి లేకుండా కేరళలో కురుస్తున్న వర్షాలకు జనజీవనం అతలాకుతలం అయింది.వరదల కారణంగా నిరాశ్రయులైన మనుష్యులను సైన్యం, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, పలు సంఘాల వలంటీర్లు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరదనీటిలో చిక్కుకున్న  జంతువులను రక్షించేందుకు ఓ బృందం అవిశ్రాంతంగా పని చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటోంది.  కుక్కలు, పిల్లులు ఇతర పెంపుడు జంతువులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ వాటికి అవసరమైన ఆహారం,  వైద్యసహాయాన్ని అందిస్తోంది. వరద నీటిలో చిక్కుకున్న జంతువులను రక్షించేందుకు హ్యూమన్‌ సొసైటీ ఇంటర్నేషనల్‌ సంస్థకు చెందిన ఆరుగురు సభ్యుల బృందం నిలంబూర్, తిరుర్‌ రీజియన్స్‌లో పనిచేస్తోంది.

త్రిసూర్‌లో ఉంటున్న ఓ మహిళ తనతో పాటు ఇంట్లో ఉన్న  25 కుక్కలను కూడా తరలిస్తేనే ఇంటిని ఖాళీ చేస్తానని భీష్మించింది. దీంతో హ్యూమన్‌ సొసైటీ సభ్యులు అక్కడికి వెళ్లి కుక్కలతో పాటు ఆమెను కూడా సురక్షిత ప్రాంతానికి తరలించారు.  జిల్లా కలెక్టర్, పశువైద్యశాఖ అధికారుల సహాయంతో జంతువులను సంరక్షిస్తున్నామని కొన్నింటిని వాటి యజమానులకు అందజేశామని మిగిలిన వాటిని కూడా అప్పగిస్తామని సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. 

మానవత్వం చాటుకుంటున్న మత్స్యకారులు
 జలప్రళయంలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు అన్ని వర్గాల వారు తమ వంతు సాయాన్ని అందిస్తున్నారు. నిత్యం సముద్రపు నీటితో సహవాసం చేసే మత్స్యకారులు కూడా  బాధితులను రక్షించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. కేరళకు చెందిన 100 మత్స్యకారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. చేపలు పట్టేందుకు ఉపయోగించే నాటు పడవలను కొల్లాం, ఎర్నాకుళం, తిరువనంతపురంలోని వరద ప్రభావిత ప్రాంతాలకు తరలించారు. వరద నీటిలో చిక్కుకున్న స్థానికులను తమ పడవలలో పునరావాస కేంద్రాలకు తీసుకెళ్లారు. ఒక్కో పడవలో పది మందిని సులభంగా తరలించగలిగారు. కేవలం ప్రజల్ని తరలించడమే కాదు పోలీసులతో కలిసి తాగునీరు, లైఫ్‌ జాకెట్లు, సెర్చ్‌ లైట్స్‌ వంటి వాటిని తరలించడానికి ఈ పడవలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. 
 

Advertisement
 
Advertisement