ఆ మృతదేహాల్ని తీసుకెళ్లండి

Indian Army Asks Pakistan To Take Back Bodies Of BAT Personnel - Sakshi

న్యూఢిల్లీ : భారత్‌లో చొరబాటుకు యత్నించిన పాక్‌ సైన్యం ప్రయతాల్ని భారత ఆర్మీ సమర్దవంతంగా తిప్పికొట్టిన సంగతి తెలిసిందే. నియంత్రణ రేఖ వెంబడి జరిగిన కాల్పుల్లో పాక్‌ బోర్డర్‌ యాక్షన్‌ టీమ్‌(బీఏటీ) సభ్యులతో పాటు ఉగ్రవాదులు కూడా మృతిచెందారు. ఈ ఘటన జరిగి నాలుగు రోజులు గడుస్తున్న వారి మృతదేహాలు అక్కడే పడివున్నాయి. పాక్‌ నుంచి చొరబాటు యత్నాలు ఎక్కువ కావడంతో భారత సైన్యం నియంత్రణ రేఖ వెంబడి గస్తీని భారీగా పెంచింది. పాక్‌ సైన్యం నియంత్రణ రేఖ వైపు నిత్యం షెల్స్‌ ప్రయోగించడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో భారత ఆర్మీ కీలక ప్రకటన చేసింది. నియంత్రణ రేఖ వద్ద చనిపోయినవారి మృతదేహాలను తీసుకెళ్లాల్సిందిగా పాక్‌ను కోరింది. ఇందుకోసం ఎటువంటి హింసకు పాల్పడకుండా తెల్లజెండాలు చూపించి భారత భూభాగం వైపు రావాలని సూచించింది. అయితే భారత సూచనపై ఇప్పటివరకు పాక్‌ నుంచి ఎటువంటి స్పందన రాలేదు.

కాగా, జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లా కేరన్‌ సెక్టార్‌లో జూలై 31వ తేదీ అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుందని ఆర్మీ అధికార ప్రతినిధి కల్నల్‌ రాజేశ్‌ కాలియా తెలిపారు. వీరిలో నలుగురు పాక్‌ సైనికులతో పాటు, ఉగ్రవాదులు కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. మరోవైపు కశ్మీర్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అమర్‌నాథ యాత్రికులను, సందర్శకులను తమ స్వస్థలాలకు పంపించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 

చదవండి : పాక్‌ ‘బ్యాట్‌’ సైనికుల హతం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top