
న్యూఢిల్లీ: భారత్‌లో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 88కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ప్రకటించింది. ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, ఢిల్లీలకు చెందిన ఏడుగురు చికిత్స తరువాత ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు ఆరోగ్యశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కర్ణాటక, ఢిల్లీలలో ఆరుగురు చొప్పున ఉత్తరప్రదేశ్‌లో 11 మంది కొత్తగా వ్యాధి బారిన పడ్డారని రాజస్తాన్, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పంజాబ్‌లలో ఒక్కొక్కరు కోవిడ్ బారిన పడ్డారని అధికారులు తెలిపారు.
మహారాష్ట్రలో శుక్ర, శనివారాల్లో నలుగురు కరోనా వైరస్ బాధితులను గుర్తించడంతో ఆ రాష్ట్రంలో ఈ వ్యాధి బారిన పడ్డ వారి సంఖ్య 26కు పెరిగింది. కేరళలో మొత్తం 19 మంది కోవిడ్ బారిన పడగా.. వీరిలో ముగ్గురు చికిత్స తరువాత డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని అన్ని పబ్‌లు, బహిరంగ ప్రదేశాలను మూసివేస్తున్నట్లు గోవా ప్రభుత్వం శనివారం ప్రకటించింది. విద్యాసంస్థలు, కేసినోలు, స్విమ్మింగ్‌పూల్స్ బంద్ చేయనున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజిత్ రాణే తెలిపారు. మొత్తమ్మీద దేశంలో 88 మంది కరోనా వైరస్‌తో బాధపడుతూంటే వీరితో సన్నిహితంగా మెలిగిన మరో నాలుగు వేల మందిని గుర్తించి, వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి తెలిపారు.
అన్ని రకాల ఏర్పాట్లూ చేశాం: ఆరోగ్యశాఖ
కరోనా వైరస్‌ను నిరోధించే లక్ష్యంతో ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లూ చేసిందని ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి సంజీవ కుమార్ తెలిపారు. సామాజిక నిఘాతోపాటు, క్వారంటైన్, ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులు, శిక్షణ పొందిన సిబ్బంది, ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను అందుబాటులో ఉంచామని, రానున్న కాలంలో అన్ని రకాల ఆరోగ్య వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తామని ఆయన వివరించారు.
ఇంటికి వెళ్లిపోయిన కోవిడ్ అనుమానితులు
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో నలుగురు కరోనా బాధితులు ఆసుపత్రి సిబ్బంది విజ్ఞప్తులన్నింటినీ తోసిపుచ్చుతూ తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. పరీక్షల ఫలితాలు అందాల్సి ఉందని చెబుతున్నా వారు పట్టించుకోకుండా శుక్రవారం ఇందిరాగాంధీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి నుంచి వెళ్లిపోయినట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు. అయితే వీరిలో ముగ్గురు శనివారం మధ్యాహ్నానికి ఆసుపత్రికి తిరిగి రాగా నాలుగో వ్యక్తి అధికారుల ఇదేశాల మేరకు మళ్లీ ఆసుపత్రిలో చేరనున్నట్లు సమాచారం. మహారాష్ట్రలో శనివారం మరో ఇద్దరికి కరోనా వ్యాధి సోకినట్లు తేలడంతో రాష్ట్రంలో ఈ వ్యాధి బారిన పడ్డ వారి సంఖ్య 26కి చేరుకుంది.
పార్లమెంటులో సందర్శకులకు నో
వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా పార్లమెంటు లోపలికి సందర్శకుల రాకను నిషేధించనున్నట్లు లోక్‌సభ సెక్రటేరియట్ శనివారం ప్రకటించింది. పార్లమెంటు ప్రాంగణంలోకి ప్రవేశానికి సంబంధించిన పాస్‌ల జారీ ప్రక్రియను నిలిపివేసింది.