కశ్మీర్‌ సమస్యకు పరిష్కారం ఇదిగో!

Bjp governmnet new step to solve kashmir issue

న్యూఢిల్లీ: కశ్మీర్‌ సమస్యకు చర్చల ద్వారా శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు ప్రభుత్వం దూతగా సీబీఐ మాజీ డైరెక్టర్‌ దినేశ్వర్‌ శర్మను కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నియమించడం పట్ల హర్హంతోపాటు ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు మూడేళ్లపాటు అణచివేత ద్వారా కశ్మీర్‌ సమస్యను పరిష్కరించాలని చూసిన బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం పట్లనే ఈ హర్షమూ, ఈ ఆశ్చర్యమూ. కశ్మీర్‌ సమస్య పరిష్కారానికి బీజేపీ ప్రభుత్వం చొరవ చూపడమూ కూడా ఇదే మొదటి సారి. కారణాలేవైనా సమస్య పరిష్కారానికి దూతను నియమించడం అన్ని విధాల హర్షనీయం.

సుదీర్ఘకాలంగా నలుగుతున్న కశ్మీర్‌ సమస్యను పరిష్కరించాలంటే అంత సులువేమీ కాదుకానీ అసాధ్యమైనదేమీ కాదు. చర్చల ప్రక్రియ సమస్య పరిష్కారం దిశగా సాగాలంటే సరైన చిత్తశుద్ధి ఉండడమే కాకుండా, ఎలాంటి ముందస్తు షరతులు ఉండకూడదు. జమ్మూ కశ్మీర్‌ ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవడానికి ముందుగా దినేశ్వర్‌ శర్మ ప్రభుత్వం తరఫున చర్చల ప్రక్రియకు శ్రీకారం చుడతారని రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు. అయితే ఆయన చర్చల స్వరూపం ఏమిటో బయటకు తెలియదు. కేంద్రంతో కలిసి ఉండేందుకు సుముఖంగా ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలతోనే ఆయన చర్చలు జరుపుతారా లేక కశ్మీర్‌ స్వాతంత్య్రాన్ని కోరుకుంటున్న వేర్పాటువాదులతో కూడా చర్చలు జరుపుతారా? అన్న అంశం ఇంకా స్పష్టం కావాలి.

నేషనల్‌ కాన్ఫరెన్స్, పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ, కాంగ్రెస్, స్థానిక బీజేపీ పార్టీల వరకే చర్చలు పరిమితమైతే మాత్రం ఈ ప్రయత్నం కూడా వృధానే. టెర్రరిస్టులకు సహకరిస్తున్నారనే ఆరోపణలపై ఈ ఏడాది పలువురి హురియత్‌ నేతలపై ఎన్‌ఐఏ చేత పలు కేసులు పెట్టించడం ద్వారా దాని మెడను బిగించి ఉండవచ్చుగాక, హురియత్‌ నాయకులతో చర్చలు జరుపకుండా కశ్మీర్‌ చర్చల ప్రక్రియ ముందుకు సాగదు. 2004లో హురియత్‌ కాన్ఫరెన్స్‌లోని ఓ వర్గం అప్పటి ప్రధాన మంత్రి అటల్‌ బిహారి వాజపేయి, ఎల్‌కే అద్వానీ, ఆ తర్వాత ప్రధాన మంత్రయిన మన్మోహన్‌ సింగ్‌తో చర్చలు జరిపారు. అప్పుడు ఎలాంటి ముందస్తు షరతులు పెట్టపోవడం వల్లనే ఆ చర్చలు జరిగాయి. కశ్మీర్‌ పార్టీల నుంచి కూడా ఎలాంటి ముందస్తు  షరతులు ఉండకూడదు. వేర్పాటువాదులపై ఎన్‌ఐఏ పెట్టిన కేసులను నిలిపి వేస్తారా? అని ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా డిమాండ్‌ చేశారు.

పాకిస్థానే కశ్మీర్‌ను పువ్వుల్లో పెట్టి ఇచ్చేది
ఎంతకాదనుకున్నా కశ్మీర్‌ సమస్యను ఒకటి అంతర్, రెండు బాహ్య కోణాల నుంచి చూడాల్సిందే. ఇక్కడ్ అంతర్‌ అంటే భారత్‌లో కలిసి ఉండాలనుకునే పార్టీలు, బాహర్‌ అంటే భారత్‌ నుంచి విడిపోవాలని కోరుకుంటున్న పార్టీలు, వాటికి మద్దతిస్తున్న పాకిస్థాన్‌ లాంటి దేశాలు. 70 ఏళ్లుగా నలుగుతున్న సమస్య పరిష్కారం కావాలంటే పాకిస్థాన్‌తో కూడా చర్చలు జరపాల్సిందే. సరిహద్దుల్లోని వివాదాస్పద భూములనే కాకుండా పొరుగు దేశాల్లోని దీవులను కూడా డబ్బులు పెట్టి ధనిక దేశాలు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్‌కు డబ్బులిచ్చైనా సరే కశ్మీర్‌ సమస్య నుంచి తప్పించాల్సిందే. భారత్‌లో కశ్మీర్‌ అంతర్భాగమైన నాటి నుంచి నేటి వరకు ఆ రాష్ట్రానికిచ్చిన సబ్సిడీల మొత్తంలో పదోవంతు చెల్లించినా, పాకిస్థానే కశ్మీర్‌ను పువ్వుల్లో పెట్టి ఇచ్చేది. ఏదేమైనా సమస్య పరిష్కారానికి అన్నింటికన్నా చిత్తశుద్ధి ముఖ్యం. అది నేటి ప్రభుత్వానికి ఎంతుందో మున్ముందు చూద్దాం!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top