మెకానిక్‌ కొడుకు.. అమెరికన్‌ స్కూల్‌ టాపర్‌

Aligarh Mechanic Son Tops at US High School - Sakshi

లక్నో: కృషి, పట్టుదల, సాధించాలనే తపన ఉండాలేగాని పేదరికం మనల్ని ఏం చేయలేదు అనేది పెద్దల మాట. ఈ మాటల్ని రుజువు చేసే ఘటనలు మన ముందు కొకొల్లలు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి ఉత్తరప్రదేశ్ అలీగఢ్‌లో చోటు చేసుకుంది. అమెరికన్‌ స్కాలర్‌షిప్‌ పొంది హై స్కూల్‌ విద్య కోసం ఆ దేశం వెల్లడమే కాక తన ప్రతిభతో అక్కడ కూడా టాపర్‌గా నిలిచాడు ఓ మెకానిక్‌ కొడుకు. ఆ వివరాలు.. అలీఘర్‌కు చెందిన ఓ మోటార్‌ మెకానిక్‌ కొడుకు మహ్మద్‌ షాదాబ్‌ చిన్నప్పటి నుంచి చదువులో బాగా చురుకుగా ఉండేవాడు. ఈ క్రమంలో గత ఏడాది అమెరికా ప్రభుత్వం ఇచ్చే ‘కెన్నడి లూగర్‌ యూత్‌ ఎక్స్‌చేంజ్‌ స్కాలర్‌షిప్‌’కు ఎంపికయ్యాడు. దీని ద్వారా షాదాబ్‌కు రూ. 20లక్షలు వచ్చాయి. దాంతో హై స్కూల్‌ చదువుల నిమిత్తం షాదాబ్‌ అమెరికా వెళ్లాడు.

ఈ క్రమంలో ఈ ఏడాది అక్కడి హై స్కూల్‌లో టాపర్‌గా నిలిచాడు. అంతేకాక దాదాపు 800 వందల మంది చదువుతున్న ఈ అమెరికన్‌ హై స్కూల్‌లో గత నెల షాదాబ్‌ ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది మంత్‌’గా నిలిచాడు. ఈ క్రమంలో షాదాబ్‌ మాట్లాడుతూ.. ‘ఇది నాకు చాలా గొప్ప విజయం. అమెరికన్‌ స్కాలర్‌షిప్‌తో ఇక్కడ చదువుకోడానికి వచ్చిన నేను టాపర్‌గా నిలిచాను. అయితే దీని కోసం ఎంతో శ్రమించాను. ఇంటి దగ్గర పరిస్థితి ఏం బాగుండేది కాదు. నేను నా కుటుంబానికి మద్దతుగా నిలవాలనుకుంటున్నాను. వారిని గర్వపడేలా చేస్తాను’ అని తెలిపాడు. అంతేకాక విదేశాల్లో భారత జెండా ఎగరవేసే అవకాశం తనకు ఇచ్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపాడు.(చాలా సార్లు విన్నా: మేరీ ట్రంప్‌)

షాదాబ్‌ తండ్రి గత 25 సంవత్సరాలుగా మోటార్‌ మెకానిక్‌గా పని చేస్తున్నారు. కొడుకు గురించి అతడు ఎంతో గర్వపడుతున్నాడు. తన కొడుకు కలెక్టర్‌ అయ్యి దేశానికి సేవ చేయాలని ఆశిస్తున్నాడు. కానీ షాదాబ్‌ మాత్రం ఐక్యరాజ్యసమితిలో మానవహక్కుల అధికారిగా పని చేయాలని ఉందని తెలిపాడు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top