పెద్ద రైతులకు రేషన్‌ కట్‌..!

Rythu Bandhu Scheme Banned For Big Farmers - Sakshi

 పదెకరాల పైన ఉంటే.. ‘ఆహారభద్రత’ తొలగింపు

 గతంలో తక్కువభూమి చూపించి కార్డులు పొందిన బడారైతులు

రైతుబంధుతో వ్యవహారం బట్టబయలు

భూ వివరాలు రేషన్‌ సర్వర్‌కు అనుసంధానం

జిల్లాలో 80వేల పైచిలుకు కుటుంబాలకు సరుకుల నిలివేత 

బడా రైతులకు రేషన్‌ బంద్‌ అయ్యింది. తప్పుడు వివరాలతో రేషన్‌ పొందుతున్న పెద్ద రైతులకు.. రైతు బంధు పథకంతో చెక్‌ పడింది. రైతుబంధు వివరాలను రేషన్‌ సర్వర్‌తో అనుసంధానం చేయడంతో పదెకరాల పైన ఉన్న రైతులకు రేషన్‌ నిలియిపోయింది.  

సాక్షి, నల్లగొండ : పదెకరాలు, ఆపైన భూమి ఉన్న రైతులు రేషన్‌కు అనర్హులు అయ్యారు. ఇప్పటివరకు తక్కువ భూమి చూపించి.. పలువురు బడా రైతులు తెల్లరేషన్‌ కార్డులు పొందారు. మరికొందరు భూమి ఉన్నా సేద్యంలో లేదంటూ తప్పుడు ధ్రువీకరణ పత్రాలు చూపించి రేషన్‌ పొందుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకానికి.. సాగులోలేని భూములు కూడా సేద్యం చేస్తున్నామంటూ 10 ఎకరాల పైన భూమి ఉన్నవారు ఇప్పటికే రెండు పర్యాయాలు లబ్ధిపొందారు. దీంతో బడారైతులు రేషన్‌ పొందకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో పౌర సరఫరాల శాఖ రైతుబంధుకు సంబంధించిన వివరాలను తెప్పించి రేషన్‌ సర్వర్‌కు అనుసంధానం చేసింది. దీంతో పది ఎకరాలు ఉన్నవారి బండారం బయటపడింది. ఫుడ్‌ సెక్యూరిటీ యాక్ట్‌–2013 ప్రకారం 10 ఎకరాలు, ఆపైన ఉన్న రైతులు ఆహార భద్రత కార్డు పొందేందుకు అనర్హులు. దీనిపై వెంటనే కమిషనర్‌ అకున్‌ సబర్వాల్‌ అధికారులతో సమావేశం నిర్వహించి 10 ఎకరాలపైన ఉన్న రైతులకు రేషన్‌ను నిలిపివేయాలని నిర్ణయించారు. ఇలా జిల్లాలో 80 నుంచి 90 వేల కుటుంబాలకు రేషన్‌ నిలిచిపోయింది.
‘రైతుబంధు’తో గుట్టు రట్టు..
పౌర సరఫరాల శాఖలో నిబంధనలకు విరుద్ధంగా రేషన్‌ పొందుతున్న వారి గుట్టు రైతుబంధు పథకంతో రట్టయింది. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం రైతుబంధు పెట్టి ఎకరాకు రూ.4వేల చొప్పున రెండు పంటలకు ఇచ్చింది. దీంతో ఎవరెవరికి ఎన్ని ఎకరాల భూమి ఉందో లెక్క తేలిపోయింది. పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ అకున్‌ సబర్వాల్‌ రైతుల ఆధార్‌ నంబర్లను 
పీడీఎస్‌ రైస్‌ ఈపాస్‌ సర్వర్‌కు అనుసంధానం చేయించారు. దీంతో అనర్హులు దొరికిపోయారు. దీంతో వారికి రేషన్‌ నిలివేశారు. ఆన్‌లైన్‌లో పదెకరాలు ఉన్న రైతులు వేలిముద్రలు వేసిన సందర్భంలో ఇన్‌వ్యాలిడ్‌ అని వచ్చేస్తుంది. దీంతో డీలర్లు పదెకరాల భూమి ఉన్నవారికి రేషన్‌ నిలిపివేశారంటూ చెప్తున్నారు.
విచారించాలని డీఎస్‌ఓలకు ఆదేశం
జిల్లాలో 10 ఎకరాలపైన ఉన్న రైతులు ఎవరెవరు ఉన్నారో విచారించాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్ల ద్వారా జిల్లా పౌర సరఫరాల అధికారులకు లిఖితపూర్వక ఆదేశాలు అందాయి. పదెకరాల రైతుల వివరాలను సేకరించి వారికి నిజంగా 10 ఎకరాలు, ఆపైన ఉందా, లేదా విచారించి నివేదికలు పంపాలని వెంటనే అన్ని మండలాల తహసీల్దార్లను ఆదేశించారు. ఇప్పటికే డీఎస్‌ఓలకు లిఖిత పూర్వక లేఖలు అందాయి.
80వేల పైచిలుకు కుటుంబాలకు రేషన్‌ బంద్‌
జిల్లా వ్యాప్తంగా 80 వేల పైచిలుకు కుటుంబాలకు రేషన్‌ సరుకులు ఆగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 4,54,019 మంది ఆహారభద్రత పొందుతున్న కుటుంబాలు ఉండగా అందులో 3,46,000 మంది వరకు 5 ఎకరాలలోపు భూమిఉన్న రైతులు ఉన్నారు. అయితే 10 ఎకరాలపైన భూమి ఉన్నవారు 80వేల పైచిలుకే ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. 
జిల్లాలో కార్డుదారులు ఇలా..
జిల్లాలో మొత్తం 4,54,019 మంది ఆహారభద్రత కార్డులు కలిగి ఉన్నారు. వారికి సంబంధించి 13,85,787 మంది లబ్ధి పొందుతున్నారు. అయితే ఆ కార్డులకు సంబంధించి ప్రతి నెలా 7513.752 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తుండగా, 420 కిలో లీటర్ల కిరోసిన్‌ను అందజేస్తున్నారు. జిల్లాలో 991 రేషన్‌ షాపుల ద్వారా సరుకులను పంపిణీ చేస్తున్నారు.  

అర్హులకు ఇబ్బంది లేదు 
అర్హులకు ఎలాంటి ఇబ్బంది లేదు. పదెకరాల కంటే తక్కువ భూమి ఉన్నవారు ఎక్కడైనా రేషన్‌ ఆగిపోతే సంబంధిత తహసీల్దార్ల ద్వారా లెటర్‌ తీసుకురావాలి. అర్హులకు రేషన్‌ బియ్యం అందే విధంగా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పదెకరాల పైన భూమి ఉన్నవారికి రేషన్‌ సరుకుల పంపిణీ ఆగిపోయింది. 
– ఉదయ్‌కుమార్, డీఎస్‌ఓ, నల్లగొండ 

Read latest Nalgonda News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top