మీటూ ఎఫెక్ట్‌: ఐటమ్‌ అవుట్‌

Metoo effect on item songs - Sakshi

‘పటాకా’ సినిమాలో మలైకా అరోరా మీద తీసిన ‘హెలో హెలో’ ఐటమ్‌ సాంగ్‌. ఈ సాంగ్‌ని సినిమాలోంచి తొలగించారు దర్శకుడు విశాల్‌ భరద్వాజ్‌

స్త్రీల వైపు నుంచి ఆలోచించడానికి కాస్త సున్నితత్వం కావాలి. బాలీవుడ్‌ డైరెక్టర్లు ఇప్పుడు ‘ఐటమ్‌ సాంగ్స్‌’ విషయంలో సున్నితంగా ఆలోచించడం మొదలుపెట్టారనే అనిపిస్తోంది. ఒక డైరెక్టర్‌ ‘నేనిక నా సినిమాల్లో ఐటమ్‌ సాంగ్‌ పెట్టనేపెట్టనని’  గత ఏడాది ప్రకటిస్తే, ఇంకో డైరెక్టర్‌ ఈ ఏడాది.. పెట్టిన ఐటమ్‌ సాంగ్‌ని కూడా సినిమాలోంచి తీసేశాడు. సంస్కారవంతమైన ఈ ధోరణి కొనసాగితే, అన్ని భాషల చిత్ర పరిశ్రమలూ ఈ మార్గాన్ని అనుసరిస్తే.. అవాంఛనీయ ప్రభావాలు లేకుండా.. ఆరోగ్యకరమైన వినోదం మాత్రమే ప్రేక్షకులకు అందుతుంది. సమాజంలో మహిళల్ని ఆటబొమ్మలుగా చూసే దృష్టీ మారుతుంది.

ఐటమ్‌ సాంగ్‌ కూడా మీ టూ అంటోంది. జోక్‌ కాదు సీరియస్‌! ఇండియన్‌ సగటు సినిమా ఫార్మూలాలో పాటలతోపాటు ఐటమ్‌ సాంగ్స్‌ కూడా అనివార్యం. కథతో, దాని నేపథ్యంతో సంబంధం లేకుండా.. అసందర్భంగా.. కేవలం.. ప్రేక్షకులకు (మేల్‌) కిక్‌ ఇవ్వడానికి మాత్రమే ఉంటాయీ సాంగ్స్‌. జనాల్లో ఆ పాటలు ఎంత పాపులరో.. ఐటమ్‌ గర్ల్స్‌కీ అంత క్రేజ్‌. శరీర వర్ణన.. శృంగార రస ప్రాధాన్యంగానే ఈ పాటలు సాగుతాయి.

చుట్టూ పదిమంది మగవాళ్లను కవ్విస్తూ.. పాట పాడుతుంది.. డాన్స్‌ చేస్తుంది ఐటమ్‌ గర్ల్‌. వాళ్లంతా ఆమె కేసి మోహంగా చూస్తుంటారు.. ఆమెను తాకడానికి ప్రయత్నిస్తుంటారు. పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇంకొన్ని పాటల్లోనైతే ఈ సోలో సాంగ్‌ నాయిక తనను తాను తినే వస్తువుగా .. మిరపకాయ బజ్జీగా.. తందూరీ చికెన్‌గా.. ఆల్కహాల్‌గా అభివర్ణించుకుంటూ.. కొరుక్కుతినమని.. జుర్రుకోమనే హింట్స్‌ ఇస్తూ స్టెప్స్‌ వేస్తుంటుంది. మరికొన్ని పాటల్లో ఒక హీరో ముగ్గురు ఐటమ్‌ గర్ల్స్‌తో గంతులేస్తుంటాడు.. సేమ్‌ అలాంటి లిరిక్స్‌తోనే.

స్వరంలో జీర.. ముఖంలో మోహం
టాకీ శకం నుంచే స్పెషల్‌ సాంగ్స్‌ సీక్వెన్స్‌ ఉన్నాయేమో కాని.. 1970ల నుంచి ఈ ధోరణి తప్పనిసరి అయిపోయిందని మాత్రం చెప్పొచ్చు. ఈ మధ్యే విడుదలైన ‘స్త్రీ’ అనే హిందీ సినిమాలోనూ నోరా ఫతేహీ డాన్స్‌ చేసిన ‘కమరియా’ అనే ఐటమ్‌ సాంగ్‌ను పెట్టారు.

మహిళలను కించపర్చడం, అణచివేయడం వల్ల కలిగే దుష్పరిణామాల గురించే చెప్పే ఈ సినిమా ఈ పాటలో మాత్రం నోరా ఫతేహీని ఓ సెక్స్‌వల్‌ ఆబ్జెక్ట్‌గానే చూపిస్తుంది.. కెమెరాతో ఆ అమ్మాయి శరీర సౌష్ఠవాన్ని జూమ్‌ చేసి చూపిస్తూ! మహిళలకు సంబంధించి నాటి తీరు.. నేటి ధోరణి ఒకటే అని చెప్పడానికి ఇదో ఎగ్జాంపుల్‌ అంతే. ప్రతి పాట.. ఓ హస్కీ వాయిస్‌.. లస్ట్‌ ఎక్స్‌ప్రెషన్‌తో సినిమాలో పండాల్సిందే. కాసులు కురిపించాల్సిందే. అంటే ఆమె బాడీ ఓ కమాడిటీ. మూడు నిమిషాల పాటతో చూపించి మిగతా సినిమాలో లేని దమ్మును బ్యాలెన్స్‌ చేసుకోగలమని మూవీ మేకర్స్‌ ధీమా.

తట్టుకోలేకే.. ‘తను’ వచ్చేసింది!
ఇలాంటి పాటలు ఆహ్లాదాన్ని కలిగిస్తాయా? అలజడిని సృష్టిస్తాయా? ఆడవాళ్ల గౌరవాన్ని పెంచుతాయా, వాళ్లను ఓ విలాస వస్తువుగా చూపిస్తాయా? విలాస వస్తువుగానే చూపిస్తాయి. అమ్మాయిలను తమతో సమానంగా కాదు.. తమ కోర్కెలు తీర్చే బొమ్మగా చూడాలనే సంకేతాలను పంపిస్తాయి. ఈ పాటలు ఐటమ్‌ గర్ల్‌ అభినయ కౌశలానికి ప్రతీకలు కావు. ఆడవాళ్లను ఆబ్జెక్టిఫై చేసే సన్నివేశాలు. ఈ పాటల చిత్రీకరణ ఎలా ఉంటుందో.. సెట్స్‌లో ఐటమ్‌సాంగ్‌ చేస్తున్న నటి పట్ల మగ నటులు, మగ సిబ్బంది ప్రవర్తన కూడా అలాగే ఉంటుందని తనుశ్రీ దత్తా ద్వారా బయట ప్రపంచానికి తెలిసింది.

‘‘హార్న్‌ ఓకే ప్లీజ్‌’’ సినిమాలో తనుశ్రీ దత్తాతో ఒక ఐటమ్‌ సాంగ్‌లో ఆమెతో ఇంటిమేట్‌ స్టెప్స్‌ కావాలని సీనియర్‌ నటుడు నానాపటేకర్‌ ఆ సినిమా కొరియోగ్రాఫర్‌ను కోరడం.. ఆమెను వేధించడంతో తనుశ్రీ దత్తా ‘మీటూ’ అంటూ గొంతెత్తిన విషయం తెలిసిందే కదా! ఇలాంటి పాటల వల్ల వాటిని అభినయిస్తున్న నటీమణులకెంత హాని జరుగుతుందో.. ఎన్ని సమస్యలు ఎదురవుతున్నాయో.. బయటి మహిళలకూ అంతే హానీ, అన్ని సమస్యలూ ఎదురవుతున్నాయి. సినిమా కంటే కూడా ఇలాంటి పాటల వల్ల ఎక్కువ ప్రభావం ఉంటోందనేది స్త్రీవాదుల అభిప్రాయం.

‘ఐటమ్స్‌’కి కరణ్, విశాల్‌ ‘నో’
కొంచెం సున్నితంగా ఆలోచించే సినీ నిర్మాత, దర్శకులు ఇలాంటి ఐటమ్‌ నంబర్స్‌ పట్ల కాస్త అపరాధభావాన్ని ప్రదర్శించిన రుజువులూ ఉన్నాయి. ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత, దర్శకుడు కరణ్‌ జోహార్‌.. 2017లో ఐటమ్‌ సాంగ్స్‌ను తన సినిమాల్లో చూపించినందుకు చింత వ్యక్తం చేస్తూ ‘‘ఒక అమ్మాయిని పది మంది మగవాళ్ల మధ్యలో తిప్పుతూ.. వాళ్లంతా ఆమెను ఆబగా చూస్తూ పాటను చిత్రీకరించామంటే.. నిజంగా సమాజానికి మనం తప్పుడు సంకేతం ఇస్తున్నట్లే లెక్క అని చాలా ఆలస్యంగా గ్రహించాను. అందుకే ఇక మీదట నా సినిమాల్లో ఐటమ్‌ సాంగ్స్‌ ఉండవు’’ అని ప్రకటించాడు.

విశాల్‌ భరద్వాజ్‌ కూడా అలాంటి నిర్ణయమే తీసుకున్నాడు. ఈ మధ్యే విడుదలైన ‘పటాకా’ సినిమాలో మలైకా అరోరా మీద ‘‘హెలో హెలో’’ అనే ఓ స్పెషల్‌ సాంగ్‌ను పిక్చరైజ్‌ చేశాడు. కానీ సినిమాలో పెట్టలేదు. కారణం ఇదీ అని చెప్పలేదు కాని.. ఐటమ్‌ సాంగ్‌ స్థానాన్ని మాత్రం తప్పించేశాడు విశాల్‌. ఇది మంచి పరిణామం. మహిళను ఇంకా సెకండ్‌ సిటిజన్‌గానే చూస్తున్న ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులున్న సమాజాల్లో జెండర్‌ సెన్సిటివిటీ సినిమా మాధ్యమం నుంచే మొదలవ్వాలి. అదే ప్రచారం చేయాలి. మీ టూ ఉద్యమం ఆ స్పృహను కలిగిస్తుందని ఆశపడదాం. కరణ్‌ జోహార్, విశాల్‌ భరద్వాజ్‌ లాంటి వాళ్లు ఇంకెంత మందికి స్పూర్తినిస్తారో చూద్దాం!

అది పాట.. అంతవరకే
‘‘ఐటమ్‌ సాంగ్స్‌లో నటించినందుకు నాకు ఎలాంటి రిగ్రెట్స్‌ లేవు. నేను అబ్జెక్టిఫై అయినట్టు కూడా ఫీలవలేదెప్పుడు.. అఫ్‌కోర్స్‌ ఇలాంటి పాటల్లో నటించినందుకు నా మీద మగవాళ్ల చూపులు, వాళ్ల అటెన్షన్‌ ఎలా ఉంటుందో తెలుసు.. కాని నో రిగ్రెట్స్‌’’ – మలైకా అరోరా, (‘దిల్‌ సే’లో ‘ఛయ్యా.. ఛయ్యా’, ‘దబాంగ్‌’లో ‘మున్నీ బద్నామ్‌ హుయీ’ వంటి ఐటమ్‌ సాంగ్స్‌ ఫేమ్‌)

కొంచెం జాగ్రత్త అవసరం
‘‘ఐటమ్‌ సాంగ్స్‌లో నటించే నటీమణులు.. ‘ఓకే ఆల్‌రైట్‌.. నా సెన్సువాలిటీని నేను సెలబ్రేట్‌ చేసుకుంటాను..’ అనే ఎరుకతో ఉంటే మంచిదే. వండర్‌ఫుల్‌. సమస్యే లేదు. కాని సెన్సువాలిటీని సెలబ్రేట్‌ చేసుకునే క్రమంలో ఆ నటీమణులు ఆబ్జెక్టిఫై అయి.. సినిమా వ్యాపారానికి సాధనాలుగా మారితేనే సమస్య.  – షబానా ఆజ్మీ, ప్రసిద్ధ బాలీవుడ్‌ నటి


(‘స్త్రీ’ సినిమాలో ‘కమరియా’ పాటకు నోరా ఫతేహీ స్టెప్పులు)

– సరస్వతి రమ

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top