హలో... ఆల్‌ క్లాస్‌ మూవీ – చిరంజీవి | Hello Movie Pre Release Function | Sakshi
Sakshi News home page

హలో... ఆల్‌ క్లాస్‌ మూవీ – చిరంజీవి

Dec 21 2017 1:48 AM | Updated on Jul 15 2019 9:21 PM

Hello Movie Pre Release Function - Sakshi

అఖిల్, రామ్‌చరణ్, చిరంజీవి, నాగార్జున, నాగచైతన్య, సమంత

‘‘హలో’ ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌ మా సొంత కుటుంబ సభ్యుల ఫంక్షన్‌లా ఫీల్‌ అయ్యి సోదరుడు నాగార్జునగారు పిలవగానే ఇది నా బాధ్యత అని వచ్చా. తల్లిదండ్రులు, అన్నావదిన, కుటుంబ సభ్యులు అఖిల్‌ గురించి ఎంత ఆనందపడుతున్నారో అంతకంత ఆనందం నాకూ ఉంది’’ అని చిరంజీవి అన్నారు. అఖిల్, కల్యాణీ ప్రియదర్శన్‌ జంటగా విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మించిన ‘హలో’ రేపు విడుదలవుతోంది. హైదరాబాద్‌లో జరిగిన ప్రీ–రిలీజ్‌ వేడుకలో ముఖ్య అతిథి చిరంజీవి మాట్లాడుతూ– ‘‘హలో’ సినిమా చూశా. రిలీజ్‌కి ముందు సినిమా చూడటం ఓ చిన్న పరీక్షలాంటిది. బాగుందా? బాగోలేదా? అనే మీమాంసలో ఏం చెప్పాలో తెలియని అయోమయం ఉంటుంది.

అబద్ధం ఆడలేం. లేనివి కల్పించి చెప్పలేం. హృదయం ఏం చెబితే అదే మాట్లాడే తత్వం ఉన్న మనకి చాలా కఠిన పరీక్షలా ఉంటుంది. కానీ, సినిమా చూసిన తర్వాత చెబుతున్నా.. ఇదొక ఫెంటాస్టిక్‌ లవ్‌స్టోరీ. స్టార్టింగ్‌ నుంచి లాస్ట్‌ వరకూ క్లీన్‌గా ఉంటుంది. అందుకు దర్శకుడు విక్రమ్‌కి నా అభినందనలు.  ఇది ఆల్‌ క్లాస్‌ సినిమా అవుతుందనడంలో సందేహం లేదు. ‘హలో’తో అఖిల్‌ నటుడిగా మరో మెట్టు ఎదిగిపోయాడనడంలో సందేహం లేదు. నటన, డ్యాన్సుతో పాటు పాట పాడిన అఖిల్‌ తన తాత, నాన్న, అన్నకంటే ఓ మెట్టు పైకి ఎదిగాడు’’ అన్నారు. నాగార్జున మాట్లాడుతూ– ‘‘మనం’ వంటి హిట్‌తో పాటు ‘హలో’ వంటి చక్కటి, బ్యూటిఫుల్‌ మూవీ ఇచ్చినందుకు విక్రమ్‌కి థ్యాంక్స్‌.

చిరంజీవిగారి ఇంటికెళ్లి ఫంక్షన్‌కి వచ్చి అఖిల్‌ని బ్లెస్‌ చేయాలంటే ఎక్కడికి రావాలో చెప్పండి అన్నారు. ‘హలో’ సినిమా చూసి ఇక్కడికొచ్చి మాట్లాడమన్నాను. రామ్‌చరణ్‌ వయసులో అఖిల్‌కంటే పెద్ద. నాకంటే చిరు వయసులో పెద్ద. కానీ మాకు మంచి స్నేహం కుదిరింది. కొత్త కోడలు (సమంత) వచ్చింది ఇంటికి. ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా ఉంటుంది. చైకి (నాగచైతన్య) ఉన్నంత మంచి మనసు నాకూ లేదూ ఎవరికీ లేదు. అఖిల్‌ నటన, డ్యాన్సులు, పాట పాడటం చూస్తుంటే కడుపు నిండిపోయింది’’ అన్నారు. ‘‘మీలాగా నేనూ 22వ తేదీ కోసం వెయిట్‌ చేస్తున్నా’’ అన్నారు అమల. ‘‘ఈ చాన్స్‌ ఇచ్చిన నాగ్‌సార్‌కి, అమల మేడమ్‌కి థ్యాంక్స్‌.  ‘హలో’ మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు విక్రమ్‌ కె.కుమార్‌.

‘‘అఖిల్‌ మంచి టెక్నీషియన్స్‌తో పని చేశారు. ‘హలో’తో అఖిల్‌ మరో లెవల్‌కి వెళతారు. ఈ సినిమా చూసిన నాన్నగారు లంచ్‌ టైమ్‌లోనూ సినిమా గురించే మాట్లాడారు. నేను చూసేందుకు వెయిట్‌ చేస్తున్నా’’ అన్నారు రామ్‌చరణ్‌. ‘‘అఖిల్‌ని ఓ బ్యూటిఫుల్‌ ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీలో చూడాలని ఉండేది. ‘హలో’ చూశాక సంతోషంగా ఇంటికెళ్లా. అఖిల్‌ని ఇంత బాగా చూపించిన నాన్నగారికి, విక్రమ్‌గారికి థ్యాంక్స్‌’’ అన్నారు నాగచైతన్య. ‘‘అఖిల్‌ చాలా లక్కీ. మీ నాన్న అందం, స్టైల్, అమ్మ గ్రేస్‌ నీలో ఉన్నాయి. ఓ ఫ్యాన్‌గా ‘హలో’ సినిమా చూడాలని వెయిట్‌ చేస్తున్నా’’ అన్నారు సమంత. హీరో సుమంత్, సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్, కెమెరామెన్‌ íపీఎస్‌ వినోద్, నిర్మాత కేకే రాధామోహన్‌ తదితరులు పాల్గొన్నారు.  

రెండో కొడుకు లేని లోటు అఖిల్‌ తీర్చాడు
‘‘చరణ్‌ని కలిసేందుకు అఖిల్‌  మా ఇంటికి వస్తుంటాడు. కింద ఫ్లోర్‌లో ఉన్న నన్ను, సురేఖ (చిరు సతీమణి)ను కలిసి, యోగక్షేమాలు తెలుసుకుని గానీ పై ఫ్లోర్‌లోని చరణ్‌ వద్దకు వెళ్లడు. తను  పలకరించే విధానం చూస్తుంటే ఒక్కోసారి సురేఖ చిన్న ఎమోషన్‌కి లోనై.. ‘చరణ్, అఖిల్‌ అన్నదమ్ముల్లా కలిసి మాట్లాడుకుంటుంటే.. చరణ్‌కి మనం ఓ తమ్ముణ్ని కనుంటే ఎంత బాగుండేది.. వాళ్లూ ఇలాగే ఉండేవారు కదా’ అని అంటుంది. ‘నాగార్జునగారు, అమలగారు ఒప్పేసుకుంటే అఖిల్‌నే పెంచుకుందాం. వాళ్లు ఒప్పుకుంటారా (నవ్వుతూ). అఖిల్‌ ఉన్నాడు కదా.. మనకి మరో బిడ్డ లేడనే లోటుండదు. అఖిల్‌ ఆ లోటు తీరుస్తాడు’ అని నేను అంటుంటా. తన సంస్కారం, పెద్దలంటే గౌరవం చూస్తుంటే ఆ మంచి క్వాలిటీస్‌ తల్లిదండ్రుల పెంపకం నుంచి వచ్చాయి. బంగారంలాంటి అఖిల్‌ని కన్నందుకు మిమ్మల్ని (నాగ్‌–అమల) అభినందిస్తున్నా. మా బిడ్డలాంటి అఖిల్‌కి ఈ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ కావాలని, విజయోత్సవం జరగాలని, గెస్ట్‌గా నన్ను పిలవాలని కండిషన్‌ పెడుతున్నా’’ అన్నారు చిరంజీవి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement