అప్పుడు ఆత్మవిశ్వాసం కోల్పోయా! | aravinda swamy interview about nawab | Sakshi
Sakshi News home page

అప్పుడు ఆత్మవిశ్వాసం కోల్పోయా!

Published Sun, Sep 30 2018 3:35 AM | Last Updated on Sun, Sep 30 2018 11:55 AM

aravinda swamy interview about nawab - Sakshi

‘‘నటుడిగా ఫస్ట్‌ సినిమా ‘దళపతి’ కూడా మల్టీస్టారరే చేశాను. మల్టీస్టారర్స్‌ చేయడం పెద్ద కష్టం కాదు. అన్ని క్యారెక్టర్స్‌ బాగా కుదిరితే అందరికీ మంచి గుర్తింపు లభిస్తుంది.  స్క్రిప్ట్‌ స్టార్స్‌ని డిమాండ్‌ చేస్తే తప్పకుండా కలసి నటించాలి. అలాగే కమర్షియల్‌ యాంగిల్‌లో కూడా ఆలోచించాలి. దర్శకుడు హ్యాండిల్‌ చేస్తాడనే నమ్మకం ఒకటి చాలు. మల్టీస్టారర్స్‌ వస్తూనే ఉంటాయి’’ అని అరవింద స్వామి అన్నారు. మణిరత్నం దర్శకత్వంలో అరవింద స్వామి, శింబు, విజయ్‌ సేతుపతి, జ్యోతిక, అదితీరావ్‌ హైదరీ, ఐశ్వర్యా రాజేశ్‌ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘చెక్క చివంద వానమ్‌’. మద్రాస్‌ టాకీస్, లైకా ప్రొడక్షన్స్‌ నిర్మించాయి. ఈ చిత్రాన్ని తెలుగులో ‘నవాబ్‌’ పేరుతో అశోక్‌ వల్లభనేని రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా అరవింద స్వామి చెప్పిన విశేషాలు...

►నా పాత్రకు  మంచి ఆదరణ లభిస్తోంది. సంతోషంగా ఉంది. రోజా, బొంబాయి నుంచి ప్రేక్షకులు ప్రేమను పంచుతున్నారు. ధన్యవాదాలు. మణిరత్నంగారితో తొమ్మిదోసారి కలసి వర్క్‌ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన్ను నేనో గురువులా భావిస్తాను. కాళ్లకు మొక్కి నమస్కరించకపోయినా ఆయన మీద మాత్రం నాకు అపారమైన గౌరవం ఉంది. ఇప్పటికీ సినిమా ‘చెయ్‌’ అని అడగరు. ఐడియా ఉంది. సినిమా చేద్దామా? అని అడుగుతారు. అదే  ఆయనలోని స్పెషాలిటీ.

►‘తని ఒరువన్‌’ (తెలుగులో ‘ధృవ’)లో విలన్‌గా నటించినప్పటి నుంచే నా పాత్ర పట్ల క్రియేటీవ్‌గా ఇన్వాల్వ్‌ అవ్వాలని అనుకున్నాను. అలా చేస్తే పాత్రలో పూర్తిగా నిమగ్నమవ్వొచ్చన్నది నా అభిప్రాయం. ∙నేను నటుణ్ని అవ్వాలనుకోలేదు. ‘బొంబాయి, రోజా’ చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఆ స్టార్‌డమ్‌ చాలా కష్టంగా అనిపించింది. స్టార్‌డమ్‌ వచ్చినప్పుడు కూడా స్టార్‌లా ఫీల్‌ అవ్వలేదు. మధ్యలో బ్రేక్‌ వచ్చింది. మళ్ళీ మణిసారే పిలిచి ‘కడలి’ సినిమా చాన్స్‌ ఇచ్చారు.  ఇప్పుడు నెగటీవ్‌ పాత్రలు చేస్తున్నప్పుడే స్వేచ్ఛగా అనిపిస్తోంది. ఇంకా ఆసక్తిగా  అనిపిస్తోంది. ఏ తప్పూ చేయకుండా హీరో అన్నీ మంచి పనులే చేస్తుంటాడు. కానీ రియల్‌ లైఫ్‌లో మనుషులు అలా ఉండరే. అందుకేనేమో? (నవ్వుతూ). ∙‘గాడ్‌ ఫాదర్‌’ సినిమాలో హీరోకి నెగటీవ్‌ షేడ్‌ ఉంటుంది. కానీ కథ అంతా హీరో చుట్టే తిరుగుతుంది. అయినా విలన్‌ అని అనం. నేను చేసే పాత్రలు కూడా అలానే ఉండాలని భావిస్తాను.

►ఏదైనా స్క్రిప్ట్‌కి ‘యస్‌’ చెప్పే ముందు మొత్తం స్క్రిప్ట్‌ని క్షుణ్ణంగా చదవాల్సిందే. అప్పుడే యస్‌ ఆర్‌ నో చెబుతాను. ఒక్కసారి ‘యస్‌’ చెప్పాక ఆ పాత్ర గురించి దర్శకుడితో డిస్కస్‌ చేసుకుంటాను. అలాగే ‘నవాబ్‌’లో నేను చేసిన వరదన్‌ పాత్ర గురించి చర్చిస్తుండగా  ఫిజిక్‌ గురించి టాపిక్‌ వచ్చింది. ‘వరదన్‌’ పాత్ర బుల్‌లా ఉంటుంది. అతని శరీరాకృతి అయినా, ప్రవర్తించే విధానమైనా బుల్‌లానే ఉంటుంది. అలా అనుకుని అందుకు అనుగుణంగా నన్ను మార్చుకున్నాను. ఫస్ట్‌ సినిమా నుంచి మణిసార్‌తో ఏకీభవిస్తూ, గొడవపడుతూ వర్క్‌ చేస్తున్నాను. యాక్టర్స్‌కి ఆయన ఎప్పుడూ క్రియేటీవ్‌ ఫ్రీడమ్‌ ఇస్తుంటారు.

►ప్రస్తుతం తమిళ, తెలుగు సినిమాల్లో మెల్లిగా మార్పు కనిపిస్తోంది. కొత్త కాన్సెప్ట్స్‌ని ప్రేక్షకులు  చూస్తున్నారు. నా వరకు నేను ఫార్ములా సినిమాలు సరిగ్గా తీయకపోతే కూర్చుని చూడలేను. అలాంటిది అలాంటి సినిమాల్లో యాక్టింగ్‌ అంటే చాలా కష్టం. ‘నవాబ్‌’ సినిమాను తమిళంలో ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ నవలతో, కరుణానిధి ఫ్యామిలీకు దగ్గరగా ఉంది అని ట్వీటర్‌లో పోలుస్తున్నారు. కానీ ఇది ఒరిజినల్‌ స్క్రిప్ట్‌. అన్నీ కల్పిత పాత్రలే.       

► కమర్షియల్‌ సక్సెస్‌ మాత్రమే మణిరత్నంగారి టాలెంట్‌కి కొలమానం కాదు. కమర్షియల్‌ సక్సెస్‌ తీయాలనుకోవడం చాలా చిన్న పని ఆయనకు. కానీ తనను తాను చాలెంజ్‌ చేసుకునే దర్శకుడు. ఇప్పటికీ కంఫర్ట్‌ జోన్‌లో ఉండకుండా పని చేస్తున్నారు. అది గ్రేట్‌. మనం అభినందించాల్సిన విషయం. గమనిస్తే ఆయన తీసిన ఏ రెండు సినిమాలూ ఒకలా ఉండవు.

► తెలుగుతో ఇప్పటికీ ఇబ్బంది పడుతూనే ఉన్నాను. నాకు కొత్త భాష నేర్చుకోవడం రాదు. మా పిల్లలు కొత్త భాషను టక్కున నేర్చుకుంటారు. నేను మాత్రం నేర్చుకోలేకపోతున్నాను (నవ్వుతూ).    

► ‘డియర్‌ డాడ్‌’ సినిమాలో స్వలింగ సంపర్కం గురించి మాట్లాడాం. ఆ సినిమా చేయడానికి చాలా సంకోచించాను. ఆడియన్స్‌ ఒప్పుకుంటారా? ‘ఇంత అందగాడు హోమో సెక్కువల్‌గానా? అమ్మాయికి ఐ లవ్‌ యు చెప్పాల్సింది పోయి అబ్బాయికా?’ అని ప్రేక్షకులు ఆ సినిమాని తిప్పికొడతారా? అని అనుకోలేదు. అసలు ఆ పాత్రకు సూట్‌ అవ్వగలనా? అని మాత్రమే ఆలోచించాను. అందుకే మణిరత్నంగారికి కాల్‌ చేశాను. ఆయన సలహా మేరకు ఆ సినిమా చేశాను.

► మధ్యలో కాళ్లకు జరిగిన గాయం వల్ల కాళ్లు చచ్చుబడిపోయిన సంగతి తెలిసిందే. అప్పుడు నా కాన్ఫిడెన్స్‌ చాలా తగ్గిపోయింది.  ఇక్కడ మందులు వాడాం. మార్పు కనిపించకపోవడంతో ఆస్ట్రేలియా వెళ్దాం అనుకున్నాం. ఆయుర్వేదం ట్రై చేశాం. పని చేసింది. అలా మళ్లీ మాములుగా అయ్యాను. ఆ సమయంలోనే మణిరత్నంగారు ‘కడలి’ సినిమా చేయమన్నారు. ఆ సినిమా నాకు కాన్ఫిడెన్స్‌ ఇచ్చింది.

► ఇంతకు ముందు న్యూస్‌ చూస్తుంటే న్యూస్‌ తెలుసుకుంటున్న భావన కలిగేది. కానీ ఇప్పుడు వాదనలు చూస్తున్నాం. న్యూస్‌ వినడం లేదు. ఎవరో అభిప్రాయాలు తెలుసుకుంటున్నట్టు ఉంది. ఆల్రెడీ న్యూస్‌ అంటేనే ఏదో డ్రామా విషయాన్ని చెబుతున్నాం. దానికి  ఇంకా డ్రామా జోడిస్తున్నారు. దాంతో న్యూస్‌ చూడటం మానేశాను. చదువుతున్నాను అంతే.

► నా బిజినెస్‌ బాగానే సాగుతోంది. సుమారు 4000వేల మంది వరకూ మా కంపెనీలో వర్క్‌ చేస్తున్నారు. 

► ఈ సంవత్సరమే డైరెక్టర్‌గా సినిమా స్టార్ట్‌ చేద్దామనుకున్నాను. కుదర్లేదు. వచ్చే ఏడాది మెగాఫోన్‌ పట్టుకుంటాను. చాలా స్క్రిప్ట్స్‌ రాసుకున్నాను. అందులో ప్రస్తుత టైమ్‌కి సూట్‌ అయ్యే కథతో సినిమా చేస్తా. తమిళంలో కార్తీక్‌ నరేన్‌ అనే టాలెండ్‌ దర్శకుడితో చేసిన ‘నరగాసురన్‌’ రిలీజ్‌ కోసం ఎదురుచూసున్నా. అలాగే తెలుగు, తమిళంలో ఓ ద్విభాషా చిత్రం గురించి డిస్కషన్‌ జరుగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement