రైతులకు వరం ఆపరేషన్‌ గ్రీన్‌

Operation Green is boon  farmers telangana - Sakshi

టమాట, ఉల్లి పంటలకు ప్రాధాన్యం 

మద్దతు ధర వచ్చినప్పుడే విక్రయానికి అనుకూలం

మండలంలో పెరగనున్న సాగు విస్తీర్ణం 

హన్వాడ : ప్రధాన ఆహార పంటలకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తుంది. మార్కెట్‌లో ధర తగ్గిన సమయంలో అన్నదాతలు పండించిన పంటలను కనీస మద్దతు ధరతో ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి. కాని రైతులు ప్రధానంగా సాగుచేసే కూరగాయ పంటలైన ఉల్లి, టమాటలకు మాత్రం ఒక్కోసారి ధరలేకపోవడంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ఎక్కువగా ధరల్లో హెచ్చు తగ్గులుండే ఈ పంటలకు మద్దతు ధర కల్పించాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం వీటిని మద్దతు ధరలో చేర్చింది.

మద్దతు ధరకు, మార్కెట్‌లో లభించే ధరకు మధ్య వ్యత్యాసం ఉండి రైతులు నష్టపోతున్న సందర్భంలో ఈ పథకం కింద ప్రభుత్వం ఆదుకుంటుంది. మద్దతు ధర కన్నా దిగువ స్థాయికి మార్కెట్‌లో ధరపడిపోయినప్పుడు ఆ రెండింటికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రభుత్వం రైతులకు చెల్లించే విధంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ పంటల ధరల్లో హెచ్చుతగ్గుల సమస్యల పరిష్కారానికి ఇటీవలే తమ బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో టమాట, ఉల్లి సాగు చేసిన రైతులకు ఇక ఢోకా ఉండదు.
 
కూరగాయ తోటలే.. 
హన్వాడ మండల కేంద్రంతోపాటు పెద్దర్పల్లి, కొత్తపేట, టంకర, దాచక్‌పల్లి, సల్లోనిపల్లి, గుడిమల్కాపూర్, కొనగట్టుపల్లి, నాయినోనిపల్లి తదితర గ్రామాల్లో అత్యధికంగా కూరగాయల పంటలే సాగు చేస్తారు. అయితే ఆయా గ్రామాల్లో ఎక్కువగా ఉల్లి, టమాట పంటలు సాగుచేసి గతంలో చాలామంది రైతులు నష్టపోయిన దాఖలాలు కోకొల్లలు. దీంతో సాగుచేసిన ప్రతిసారి ఏదో ఓసారి నష్టాలబారిన పడాల్సి వచ్చేది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘ఆపరేషన్‌ గ్రీన్‌’ పథకం ఆయా పంటల రైతులకు ఇక వరంగా మారనుంది. ఇక మండలంలో మరిన్ని గ్రామాల్లో సైతం వీటి సాగుపై దృష్టి సారిస్తున్నారు. రైతులకు మేలుచేసే ఈ పథకంతో చాలామంది అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

తీవ్రంగా నష్టపోయా..  
ఇటీవల టమాట సాగుచేసి మార్కెట్‌లో ధరలు రాక తీవ్రంగా నష్టపోయాను. ఉల్లి, టమాట పంటలకు సరైన ధర రాక వృథాగా   పారబోశాను. పెళ్లిళ్లు, పండగల సీజన్‌లకు ముందుగా అందరూ ఇదే పంటల సాగుపై దృష్టిసారించడంతో ఈ సమస్య తలెత్తేది. కేంద్ర ప్రభుత్వం ఉల్లి, టమాటపై మద్దతు ధర ప్రకటించడం సంతోషంగా ఉంది. 
– నర్సింహులు, రైతు, హన్వాడ

Read latest Mahabubnagar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top