మెదడు గురించి మరింత తెలిసింది.. | More is known about the brain | Sakshi
Sakshi News home page

మెదడు గురించి మరింత తెలిసింది..

Jul 24 2016 4:51 AM | Updated on Sep 4 2017 5:54 AM

మెదడు గురించి మరింత తెలిసింది..

మెదడు గురించి మరింత తెలిసింది..

మన శరీరంలోని అవయవాల వివరాల ఎంత ఎక్కువ తెలిస్తే వైద్యం అంత పురోగమిస్తుంది. గుండె మొదలుకొని ఇతర అవయవాలన్నింటి విషయంలో జరిగింది అదే.

97 కొత్త ప్రాంతాలను గుర్తించిన వాషింగ్టన్ వర్సిటీ శాస్త్రవేత్తలు
 
 మన శరీరంలోని అవయవాల వివరాల ఎంత ఎక్కువ తెలిస్తే వైద్యం అంత పురోగమిస్తుంది. గుండె మొదలుకొని ఇతర అవయవాలన్నింటి విషయంలో జరిగింది అదే. అయితే వందేళ్ల పరిశోధనల తరువాత కూడా మన మెదడు గురించి తెలిసింది చాలా తక్కువంటే ఆశ్చర్యం అనిపించకమానదు. హ్యూమన్ కనెక్టోమ్ ప్రాజెక్టు పుణ్యమా అని ఇప్పుడీ పరిస్థితిలో కొంచెం మార్పు రానుంది. అమెరికాలోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చేపట్టిన ఈ ప్రాజెక్టు మన మెదడులో మనకు తెలియని 97 కొత్త ప్రాంతాల వివరాలు అందించింది.

 వందల కోట్ల న్యూరాన్లు... అంతకుమించిన సైనాప్స్ (న్యూరాన్ల మధ్య సంబంధాలు) ఆక్సాన్లతో కూడిన మన మెదడు అతి సంక్లిష్టమైన అవయవమనడంలో సందేహం లేదు. దీన్ని అర్థం చేసుకునేందుకు వందేళ్లకుపైగా ప్రయత్నాలూ జరుగుతున్నాయి. 1909లో కొర్బినియన్ బ్రాడ్‌మాన్ అనే న్యూరోసైంటిస్ట్ తొలిసారి మెదడులో ఉండే వేర్వేరు కణాల ఆధారంగా సెర్రిబ్రల్ కార్టెక్స్ ప్రాంతంలో దాదాపు 43  వేర్వేరు ప్రాంతాలున్నట్లు ఒక మ్యాప్‌ను సిద్ధం చేశారు. తరువాతి కాలంలో జరిగిన పరిశోధనల్లో ఈ ప్రాంతాల సంఖ్య 83కు చేరింది. తాజా పరిశోధనల ఫలితంగా ప్రస్తుతమిది 180కు చేరింది.

 ఎలా గుర్తించారు...?
 మెదడులోని కొత్త ప్రాంతాలను గుర్తించేందుకు 210 మంది ఆరోగ్యవంతులైన మానవుల ఎంఆర్‌ఐలను శాస్త్రవేత్తలు ఉపయోగించారు. కార్యకలాపాలు, నిర్మాణం వంటి వేర్వేరు అంశాల ద్వారా మెదడులో ఉండే ప్రత్యేక ప్రాంతాలను నిర్వచించారు. దాంతోపాటు కార్టెక్స్ మందాన్ని కూడా ఉపయోగించారు. ఒక్కో మనిషి మెదడు సైజు, నిర్మాణం వేర్వేరుగా ఉంటుంది కాబట్టి తాము గుర్తించిన ప్రాంతాలు కరెక్టేనా కాదా? అన్నది తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ ద్వారా మరో 210 మంది మెదడు ఎంఆర్‌ఐలతో పోల్చి చూశారు. తాము గుర్తించిన 97 ప్రాంతాలు ఇతరుల్లోనూ ఉన్నట్లు దీని ద్వారా స్పష్టమైంది. అంతేకాకుండా ఈ సాఫ్ట్‌వేర్ ఎంత కచ్చితంగా పనిచేసిందంటే... కొంతమందిలో  భాషకు సంబంధించిన ప్రాంతం రెండుగా విడిపోయిందని కూడా స్పష్టం చేసింది. ఇప్పటివరకూ  ఒక ప్రాంతం అనుకుంటున్నది కాస్తా 12 చిన్న భాగాలుగా విడిపోయి ఉందని తెలిసింది. తాము సృష్టించిన మ్యాప్‌ను మరింత విస్తృతంగా అధ్యయనం చేస్తే మరిన్ని విషయాలు తెలిసే అవకాశముందని అంటున్నారు. పరిశోధన వివరాలు సుప్రసిద్ధ సైన్స్ జర్నల్ నేచర్‌లో ప్రచురితమయ్యాయి.    - సాక్షి, హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement