మోసపూరిత వీడియో విడుదల చేసిన పాక్‌!

Kulbhushan Jadhav Thanks Pakistan - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్థాన్‌ మరో నాటకానికి తెరతీసింది. ప్రపంచ దేశాల నుంచి సానుభూతిని పోగేసుకొనే చర్యకు దిగింది. తమ దేశానికి ధన్యవాదాలు చెబుతున్నట్లుగా ఉన్న కులభూషణ్‌ జాదవ్‌కు సంబంధించిన వీడియోను తాజాగా అధికారికంగా విడుదల చేసింది. ఆ వీడియోలో జాదవ్‌ పాక్‌కు ధన్యవాదాలు చెబుతూ తనను కలవడంతో తల్లి, భార్య చాలా ఆనందంగా కనిపించారని, తనకు కూడా సంతోషంగా ఉందని చెప్పారు. తన ఆరోగ్యంపట్ల తల్లి కూడా చాలా సంతృప్తి చెందారని, తాను ఇక్కడ(పాక్‌ జైలులో) బాగానే ఉన్నానని, వారు (పాక్‌ జైలు అధికారులు) తనకు ఎలాంటి హానీ తలపెట్టడం లేదంటూ వివరించారు. అయితే, దీనిపై జాదవ్‌ కుటుంబం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

పైగా ఆ వీడియో అసలు వీడియోనో నకిలీ వీడియోనో అనే స్పష్టత కూడా లేదు. ఈ అనుమానమే నిజమనేలా నేవీ అధికారి అయిన ఓ జాదవ్‌ స్నేహితుడిని ప్రశ్నించగా కచ్చితంగా ఆ వీడియో జాదవ్‌పై ఒత్తిడితోనే సృష్టించిందని అన్నారు. జాదవ్‌ను చూసేందుకు తల్లి, భార్య వెళ్లినప్పుడు ఆయన తలపై గాయాలు ఉన్నాయని, తాజా వీడియోలో అవి కనిపించడం లేదని చెప్పారు. అసలు ఈ వీడియో వారు ఎప్పుడు ఎక్కడ తీశారో కూడా చెప్పలేమని, అది వాస్తవమైనదో కాదోనని, ఒక వేళ నిజమైనదే అయినా అది జాదవ్‌ను బెదిరించడం ద్వారా రూపొందించిన వీడియో తప్ప స్వతహాగా జాదవ్‌ చెప్పింది కాదన్నారు. గూఢచర్యం నిర్వహించాడనే ఆరోపణలతో భారత్‌కు చెందిన కులభూషణ్‌ జాదవ్‌ను పాక్‌ అధికారులు అరెస్టు చేసి ఉరి శిక్ష వేసి జైలులో పెట్టిన విషయం తెలిసిందే. ఇటీవలె జాదవ్‌ను కుటుంబ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా పాక్‌ పలు పొరపాట్లు చేసింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top