శవాలను వెలికి తీసి.. మేకప్‌ వేసి..




సాక్షి, ప్రత్యేకం : సొంత వారిని కోల్పోతే కలిగే బాధ అనిర్వచనీయం. వారిపై ఉన్న ప్రేమకు గుర్తుగా దాన ధర్మాలు చేయడం సహజంగా మనం చూస్తుంటాం. కానీ, ఇండోనేసియాలోని దక్షిణ సులావేసి నివసించే ఓ తెగ మాత్రం ఓ చిత్రమైన ఆచారాన్ని పాటిస్తోంది. ఆత్మీయులు మరణిస్తే వారికి కర్మకాండలు నిర్వహించకుండా ఏళ్ల తరబడి ఇంట్లోనే ఉంచుకుంటారు టొరాజా తెగ ప్రజలు. అలా కొన్నేళ్ల పాటు ఇంట్లో ఉంచుకున్న అనంతరం మృత దేహాలను పూడ్చి పెడతారు. మరణించిన వారి శరీరాల నుంచి దుర్వాసన వెలువడకుండా ఫార్మాల్డిహైడ్‌ ద్రావణంతో స్నానం చేయిస్తారు.



పూడ్చిన మృతదేహాలను ప్రతి ఏడాది పంట చేతికి వచ్చిన సమయంలో వెలికితీస్తారు. వారికి ఇష్టమైన వస్తువులను అలంకరిస్తారు. చనిపోయిన వ్యక్తి బాలిక/మహిళ అయితే ఆమె తలను దువ్వి, మంచి దుస్తులు వేసి అందంగా అలంకరిస్తారు. బాలుడు/పురుషుడు అయితే అతనికి ఇష్టమైన కళ్లజోడు, సిగరెట్‌, దుస్తులు లాంటి వస్తువులతో అందంగా తయారు చేస్తారు. ఆ తర్వాత ఊరేగింపుగా ఊరంతా తిప్పుతారు.



ఊరేగింపు అనంతరం గేదెలు, పందులను బలి ఇస్తారు. ఇలా చేయడం వల్ల మరణించిన వారికి స్వర్గ ప్రాప్తి కలుగుతుందని టొరొజా ప్రజల నమ్మకం. మాట్లాడే భాషను రాతలో కూడా చూపిన తొలి తెగ టొరొజానే. అయితే, టొరొజా తెగలో మరణించిన వారి మృత దేహాలను వెలికి తీసి ఊరేగింపు చేసే ఆచారం ఎప్పుడు ప్రారంభమైందో ఎవ్వరికీ తెలియదు.



'మా ఆత్మీయులను ఇలా పలకరిచడం అంతులేని ఆనందాన్ని ఇస్తుంది. చనిపోయిన వారి గురించి మేం ఎన్నడూ బాధపడం. మరణం తర్వాత కూడా వారు మాతో మమైకమే ఉంటున్నప్పుడు బాధ దేనికి. పంట చేతికి రావడం, మరణించిన వారిని గుర్తుకు చేసుకోవడం రెండూ సంతోష సందర్భాలే' నని టొరొజా తెగకు చెందిన ఓ వ్యక్తి చెప్పారు.





Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top