సునామీ విలయ విధ్వంసం

hundreds killed in indonesia earthquake - Sakshi

832కు చేరుకున్న ఇండోనేసియా మృతుల సంఖ్య

ఇంకా శిథిలాల కింద చిక్కుకున్న వేలాది మంది

ఆహారం కోసం షాపుల్ని లూటీ చేస్తున్న ప్రజలు

ఘోరకలికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటున్న నిపుణులు

పలూ: ఇండోనేసియాలోని సులవేసి ద్వీపంలో భూకంపం, సునామీ కారణంగా భారీగా ప్రాణనష్టం సంభవించింది. తొలుత భూకంపంతో భవనాలు నేలకొరగడం, అంతలోనే 6 మీటర్ల ఎత్తులో రాకాసి అలలు విరుచుకుపడటంతో సులవేసి ద్వీపంలో ఆదివారం సాయంత్రం నాటికి 832 మంది చనిపోయారు. ద్వీపంలోని ఇళ్లన్నీ ధ్వంసం కావడంతో ప్రజలు ఆకలి తీర్చుకునేందుకు దుకాణాలతో పాటు తాగునీటి ట్యాంకర్లను సైతం లూటీ చేస్తున్నారు. ప్రజలు భారీగా మృత్యువాత పడిన నేపథ్యంలో అంటువ్యాధులు వ్యాపించకుండా అధికారులు శవాలను సామూహికంగా ఖననం చేస్తున్నారు.

ఇండోనేసియా ఉపాధ్యక్షుడు జుసుఫ్‌ కల్లా మాట్లాడుతూ..భూకంపం సంభవించిన ఉత్తర సులవేసి ప్రాంతంలో మృతుల సంఖ్య వేలలో ఉండొచ్చని తెలిపారు. చాలామంది ప్రజలు ఇంకా శిథిలాల కింద చిక్కుకుని ఉన్నారని వెల్లడించారు. భూకంపం–సునామీతో తీవ్రంగా దెబ్బతిన్న చాలా ప్రాంతాలకు సహాయక బృందాలు ఇంకా చేరుకోలేదన్నారు. కాగా, ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో ఆదివారం సాయంత్రం సులవేసిలోని పలూ పట్టణాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు.

భూకంపం కారణంగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. భూకంపం–సునామీ నేపథ్యంలో ఇండోనేసియాలో చిక్కుకున్న 71 మంది విదేశీ పర్యాటకులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఫ్రాన్స్‌కు చెందిన ముగ్గురు, దక్షిణ కొరియాకు చెందిన ఓ పర్యాటకుడి జాడ తెలియరాలేదని వెల్లడించారు. వాయుసేనకు చెందిన సీ–130 హెర్క్యులస్‌ విమానం ద్వారా ఆహార పదార్థాలను చేరవేస్తున్నట్లు పేర్కొన్నారు. పసిఫిక్‌ మహాసముద్రంలోని ‘రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌’ ప్రాంతంలో ఉన్న ఇండోనేసియాలో తరచూ భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి.

ఆపద్బాంధవుడిగా ఫేస్‌బుక్‌
భూకంపం–సునామీ తాకిడికి అతలాకుతలమైన సులవేసి ద్వీపంలో ప్రజలకు ఫేస్‌బుక్‌ సహాయకారిగా మారింది. చాలామంది తప్పిపోయిన తమ కుటుంబ సభ్యుల వివరాలను ఫేస్‌బుక్‌లో పంచుకుంటున్నారు. సంబంధిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని కోరుతున్నారు. మరికొందరేమో ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి ఫొటోలు తీసి ఫేస్‌బుక్‌ గ్రూపుల్లో అందుబాటులో ఉంచుతున్నారు. తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు శిథిలాల్లో చిక్కుకున్నారనీ, సాయం చేయాలని కోరుతూ పలువురు పోస్టులు పెడుతున్నారు. ఇంకొందరైతే తమ కుటుంబ సభ్యుల మృతదేహాలు దొరికితే సామూహిక ఖననం చేయవద్దనీ, వాటిని తాము తీసుకువెళతామంటున్నారు.

సంతాపం తెలిపిన ప్రధాని మోదీ
ఇండోనేసియాలో భూకంపం–సునామీతో 832 మంది ప్రాణాలు కోల్పోవడంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కష్టకాలంలో మిత్రుడైన ఇండోనేసియాకు తోడుగా ఉంటామని ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ఆదివారం ట్వీట్‌ చేసింది.

పని చేయని హెచ్చరిక వ్యవస్థ
ప్రభుత్వ, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే సులవేసి ద్వీపంలో మృతుల సంఖ్య 832కు చేరుకుందని నిపుణులు ఆరోపిస్తున్నారు. 2004 సునామీ సృష్టించిన భయానక విధ్వంసం తర్వాత పసిఫిక్‌ ప్రాంతంలో సునామీలను గుర్తించేందుకు సెన్సార్లు, ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుల్స్, బోయెలతో ఓ ప్రోటోటైప్‌ వ్యవస్థను అమెరికా–జర్మనీ– మలేసియా–ఇండోనేసియా శాస్త్రవేత్తల బృందం అభివృద్ధి చేసింది.

ఇందుకోసం అమెరికా జాతీయ సైన్స్‌ ఫౌండేషన్‌ రూ.21.75 కోట్లను కేటాయించింది. ఈ హెచ్చరిక వ్యవస్థను పూర్తిస్థాయిలో అమలుచేసేందుకు కేవలం రూ.50 లక్షలు కావాల్సి ఉండగా,  ఆర్థికస్థితి బాగోలేదంటూ ప్రభుత్వం మొండిచెయ్యి చూపింది. సరైన నిర్వహణ లేకపోవడంతో సముద్ర గర్భంలోని ప్రకంపనలను పసిగట్టే చాలా బోయెలు చెడిపోగా, మరికొన్ని చోరీకి గురయ్యాయి. అలాగే సునామీని ముందుగా హెచ్చరించే ‘టైడ్‌ గేజ్‌’లు కూడా ప్రజలను అప్రమత్తం చేయడంలో విఫలమయ్యాయి.

ఈ ఏడాది జూన్‌లో ఫైబర్‌ కేబుల్స్‌ కొనుగోలుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పటికీ నిర్మాణ, నిర్వహణ బాధ్యతలు చేపట్టేందుకు ఏ విభాగం కూడా ముందుకు రాలేదు. రిక్టర్‌ స్కేల్‌పై 7.5 తీవ్రతతో వచ్చిన భూకంపానికి ప్రజలు కకావికలమయ్యారనీ, ఈ సందర్భంగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో సునామీ హెచ్చరిక సైరన్లను అధికారులు మోగించలేకపోయారని నిపుణులు గుర్తించారు. భూకంపాలు సంభవించినప్పుడు ఎత్తైన కొండ ప్రాంతానికి వెళ్లిపోవాలన్న అవగాహన ప్రజల్లో లేకపోవడంతో సునామీలో చిక్కుకుని చాలా మంది దుర్మరణం చెందారన్నారు.

రియల్‌ హీరో ఏటీసీ ఉద్యోగి
భూకంపం సందర్భంగా తన ప్రాణాలను కోల్పోయినా వందలాది మందిని కాపాడిన ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌(ఏటీసీ) ఆంథోనియస్‌ గునవన్‌ అగుంగ్‌(21)ను స్థానిక మీడియా హీరోగా కీర్తిస్తోంది. పలూలోని మురియారా ఎస్‌ఐఎస్‌ అల్‌ జుఫ్రీ విమానాశ్రయంలో ఆంథోనియస్‌ శుక్రవారం విధులు నిర్వహిస్తుండగా శక్తిమంతమైన భూకంపం కుదిపేసింది. దీంతో మిగతా ఎయిర్‌ ట్రాఫిక్‌ సిబ్బందిని బయటకు పంపిన ఆంథోనియస్‌ తాను మాత్రం అక్కడే ఉండిపోయాడు. వరుస ప్రకంపనలు భవనాన్ని కుదిపేస్తున్నా అక్కడే ఉండి ఎయిర్‌పోర్టులోని విమానాలకు క్లియరెన్స్‌ ఇవ్వసాగాడు.

ఎయిర్‌పోర్ట్‌లోని చిట్టచివరి విమానం టేకాఫ్‌ అయిన తర్వాత బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా వీలుకాలేదు. దీంతో నాలుగంతస్తుల భవనం నుంచి ఒక్కసారిగా దూకేశాడు. అంతర్గత రక్తస్రావంతో పాటు కాలు విరిగిన ఆంథోనియస్‌ను సహోద్యోగులు స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా.. మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించాలని సూచించారు. అయితే ఎయిర్‌ అంబులెన్స్‌(హెలికాప్టర్‌) అక్కడకు చేరుకునేలోపే ఆంథోనియస్‌ ప్రాణాలు కోల్పోయాడు. కాగా, ఆంథోనియస్‌ ప్రదర్శించిన ధైర్యసాహసాలకు గుర్తుగా ఆయన ర్యాంకును రెండు లెవల్స్‌కు పెంచినట్లు ఎయిర్‌ నావ్‌ కంపెనీ తెలిపింది.


సునామీలో ధ్వంసమైన దుకాణం నుంచి సరుకులను ఎత్తుకెళ్తు్తన్న స్థానికులు 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top