చుక్క ఇంధనం లేకుండానే ప్రపంచాన్నే చుట్టేస్తోంది..

చుక్క ఇంధనం లేకుండానే ప్రపంచాన్నే చుట్టేస్తోంది.. - Sakshi


న్యూయార్క్(అమెరికా): న్యూయార్క్కి రెండు వారాల్లో ఓ విమానం రానుంది. వేలాది విమానాలు నగరానికి వస్తుంటాయి,  పోతుంటాయి.. అలాంటప్పుడు ఈ విమానం గొప్పతనం ఏంటా అనుకుంటున్నారా. అయితే అక్కడికి రానుంది 'సొలార్ ఇంపల్స్2'. దీని ప్రత్యేకత ఏమిటంటే... ఇది ఒక్కచుక్క ఇంధనాన్ని కూడా వినియోగించకుండానే కేవలం సౌరశక్తితో మాత్రమే సగం ప్రపంచాన్ని చుట్టేసింది.ఈ విమానం బరువు 2,300 కిలోలు మాత్రమే. అయితే దీని రెక్కలు బోయింగ్ విమానం కన్నా వెడల్పు. వీటిపై అమర్చిన 17,000 పైచిలుకు ఫలకాల ద్వారా ఇది సౌరశక్తిని గ్రహించి 4 లిథియం పాలిమర్ బ్యాటరీల్లో నిల్వచేస్తుంది. పగలు సౌరశక్తిని బాగా గ్రహిం చేందుకు 9,000 మీటర్ల ఎత్తుకు విమానాన్ని తీసుకెళ్లిన పెలైట్ రాత్రిపూట ఇంధనాన్ని ఆదా చేసేందుకు 1,000 మీటర్ల ఎత్తులో ఎగిరేవారు. దీని కాక్‌పిట్‌లో ఒక్కరే పడతారు. పెలైట్ సీటునే టాయిలెట్‌గానూ వాడుకొనేలా డిజైన్ చేశారు. అండ్రూ బోర్ష్‌బెర్గ్(స్విట్జర్లాండ్), బెర్ట్రాండ్ పికార్డ్లు ఒకరి తర్వాత మరొకరు దీనికి పైలెట్లుగా వ్యవహరిస్తున్నారు.తిండి, నిద్ర అన్నీ ఆ కుర్చీలోనే. నిద్రపోవాలనుకుంటే సీటు కాస్త వెనక్కి వంచుకొని కునుకుతీయాలి. విమానాన్ని ఆటోపెలైట్ మోడ్‌లో పెట్టి... పైలెట్ 20 నిమిషాల చొప్పున నిద్రపోయేవాడు. విమానం లో సాంకేతికలోపమొస్తే ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అవకాశం లేదు. పెలైట్ ప్యారాచూట్ సాయంతో సముద్రంలో దిగితే ప్రాణాలు నిలబెట్టుకోవడానికి చెక్కబల్ల (లైఫ్‌బోట్‌లాగా పనిచేస్తుంది) కాక్‌పిట్‌లో ఉంది.'సోలార్ ఇంపల్స్2' ఒకే పైలెట్తో ఎక్కువ దూరం ప్రయాణించిన రికార్డును కూడా బద్దలుకొట్టింది. జపాన్‌లోని నగోయా నుంచి బయలుదేరిన ఈ సౌర విమానం ఏకబిగిన 120 గంటలు... 7,900 కిలోమీటర్లు ప్రయాణించి అమెరికాలోని హవాయి దీవుల వరకు వెళ్లింది. నిరంతరాయంగా సుదీర్ఘసమయం ప్రయాణించిన రికార్డు ఇంతకుమునుపు స్టీవ్ ఫోసెట్ పేరిట ఉంది.న్యూయార్క్ చేరుకున్న తర్వాత మరో పెద్ద లక్ష్యం సొలార్ ఇంపల్స్2 ముందు ఉంది. అక్కడి నుంచి బయలుదేరి అట్లాంటిక్ సముద్రాన్ని దాటనుంది. సౌర ఇంధనంపై అవగాహన కల్పించేందుకే ఈ జైత్రయాత్ర చేపట్టామని దీని పైలట్‌లు చెబుతున్నారు. 'పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అదే ఇంధనం లేకుండా ప్రపంచాన్ని చుట్టామంటే 'వావ్' అంటారు' అంటూ విమాన రూపకర్తల్లో ఒకరు, పైలెటైన బెర్ట్రాండ్ పికార్డ్ అంటున్నారు.

 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top