నెల రోజుల్లో రిజిస్టర్‌ చేసుకోండి!

Register within a month! - Sakshi

     లేకుంటే క్రిమినల్‌ కేసులు పెడతాం

     వీసా మోసాలకు పాల్పడితే పీడీ యాక్ట్‌ 

     గల్ఫ్‌ ఏజెంట్లకు మంత్రులు కేటీఆర్, నాయిని హెచ్చరిక

సాక్షి, హైదరాబాద్‌: గల్ఫ్‌ దేశాలకు కార్మికులను పంపే ఏజెంట్లందరూ నెలలోగా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్‌ ‘ఈ– మెగ్రేట్‌’లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని, లేదంటే అక్రమ ఏజెంట్లుగా గుర్తించి క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు, హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ హెచ్చరికలను ఖాతరు చేయకుండా పదేపదే వీసా మోసాలకు పాల్పడుతున్న ఏజెంట్లపై పీడీ యాక్ట్‌ ప్రయో గించాలని వారు పోలీసు శాఖను ఆదేశించారు. ఎన్‌ఆర్‌ఐ శాఖ వ్యవహారాలపై మంత్రులిద్దరూ శనివారం సచివాలయంలో పోలీసు, హోం, ఎన్‌ఆర్‌ఐ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

గత వారం ఢిల్లీలో విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో జరిగిన భేటీలో చర్చించిన వివిధ అంశాల అమలుకు రాష్ట్ర స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై  సమాలోచ నలు జరిపారు. బతుకుదెరువుకోసం విదేశాలకు వెళ్లేవారిని మోసం చేస్తున్న నకిలీ గల్ఫ్‌ ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఏజెంట్లపై చర్యల కోసం ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలని మంత్రులిద్దరూ అధికారులను ఆదేశించారు. డీజీపీ మహేందర్‌ రెడ్డి మాట్లాడుతూ నకిలీ ఏజెంట్లపై చర్యలకు త్వరలో మార్గదర్శకాలు జారీ చేస్తామన్నారు. దీనికి ప్రజలు పోలీసులకు సహకరించాలని మంత్రులు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన టామ్‌కాం కంపెనీ ద్వారా చట్టపరంగా విదేశాలకు వెళ్లాలని నిరుద్యో గులకు సూచించారు.రిజిస్టర్డ్‌ ఏజెంట్ల ద్వారానే విదేశాలకు వెళ్లాలన్నారు. హైదరాబాద్‌లో విదేశీ భవన్‌ నిర్మాణానికి ఫిబ్రవరి రెండో వారంలో శంకుస్థాపన చేస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఎన్నారై శాఖాధికారులను ఆదేశించారు. 

అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలి..
గల్ఫ్‌ దేశాలకు మహిళల అక్రమ రవాణా, మోసపూరిత వివాహాలపై మరింత కఠినంగా వ్యవహరించాలని కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో రాష్ట్ర పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యలను మంత్రి అభినందించారు. మానవ అక్రమ రవాణాను అరికట్టడంలో మైనార్టీ సంక్షేమ శాఖ, కార్మిక, ఎన్నారై, పోలీస్‌ శాఖలు ఉమ్మడిగా బృందాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు పాస్‌పోర్టు కార్యా లయ అధికారుల సహకారం తీసుకోవాలన్నా రు. ఈ సమావేశంలో హోం శాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్‌ త్రివేది, ఎన్నారై, పోలీసు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top