ప్రతాప్‌ యాదవ్‌ (లాలూ పెద్ద కొడుకు) రాయని డైరీ

Madhav Singaraju Article On Teg Pratap Yadav - Sakshi

హరిద్వార్‌లో ఉన్నాను. మనసుకు ప్రశాంతంగా ఉంది. దీపావళికి వింధ్యాచల్‌లో, ముందురోజు వారణాసిలో ఉన్నాను. శుక్రవారం తమ్ముడు తేజస్వి బర్త్‌డే. వాడి కోసం ఢిల్లీ వెళ్లి, తిరిగి హరిద్వార్‌ వచ్చేశాను. మూడేళ్లుగా తేజస్వి ఢిల్లీలోనే ఉంటున్నాడు.
‘‘చాలా సంతోషంగా ఉన్నావురా’’ అన్నాను.
‘‘నువ్వూ సంతోషంగా ఉన్నావు అన్నయ్యా. పక్కన వదిన కూడా ఉంటే బాగుండేది’’ అన్నాడు. ‘వదిన, సంతోషం.. పక్కపక్కనే ఉండలేవురా తేజూ..’ అని వాడితో చెప్పలేకపోయాను.
‘‘నాన్న ఆరోగ్యం బాగోలేదు. రాంచీ హాస్పిటల్‌లో నిన్నే కలవరిస్తున్నాడు. అమ్మ బెంగ పెట్టుకుంది. ‘మా అబ్బాయిని ఎక్కడైనా చూశారా?’ అని పట్నాలో బంధువులందరికీ ఫోన్‌ చేసి అడుగుతోంది. అక్క కోపంగా ఉంది. ‘ఎవరికి చెప్పి ఈ పని చేశాడు?’ అంటోంది. పాపం.. వదిన. తను షాక్‌లో ఉంది. వెళ్లన్నయ్యా. కనీసం అమ్మనీ, నాన్ననైనా చూసిరా’’ అన్నాడు.
నాన్నను చూడ్డానికి వెళితే నాన్న ఏమంటాడో నాకు తెలుసు. చేతిలోకి చెయ్యి తీసుకుని ‘విడాకులు వెనక్కు తీసుకుంటానని మాట ఇవ్వురా ప్రతాప్‌’ అంటాడు. అమ్మను చూడ్డానికి వెళితే అమ్మ ఏమంటుందో నాకు తెలుసు. ‘బంగారంలాంటి పిల్లరా.. అన్యాయం అవకు’ అంటుంది. భర్త విడాకులిస్తే ఎక్కడైనా భార్య అన్యాయం అవుతుంది. మా ఇంట్లో మాత్రం భర్త అన్యాయం అవుతాడు!
‘‘లేదురా.. నేను మళ్లీ పట్నా వెళ్లడం.. విడాకులు తీసుకోడానికే’’ అని గట్టిగా చెప్పాను. బాధగా ముఖం పెట్టాడు వాడు.
‘‘ఏంట్రా!’’ అన్నాను. ‘‘పాపం వదిన అన్నయ్యా’’ అన్నాడు!!
ఐశ్వర్య అడుగు పెట్టినప్పటి నుంచి ఐదు నెలలుగా ఇల్లంతా ఐశ్వర్య చుట్టూనే తిరుగుతోంది. కుర్చీ వేస్తారు. ‘కూర్చోమ్మా’ అంటారు. ‘తిన్నావామ్మా? తినకుంటే ఆకలేస్తుంది’ అంటారు! టీవీ పెడతారు. ఐశ్వర్య ముఖం చూస్తూ కూర్చుంటారు. ఐశ్వర్య ఆవలిస్తుంటే ‘నిద్ర వస్తోందా తల్లీ’ అంటారు. ఐశ్వర్య ఆలోచిస్తుంటే ‘అమ్మా నాన్న గుర్తొస్తున్నారామ్మా’ అని అడుగుతారు. ‘అదేం లేదత్తయ్యా’ అంటున్నా వినకుండా ఐశ్వర్య అమ్మనీ నాన్ననీ ఇంట్లోకి తెచ్చిపెట్టుకున్నారు! ఐశ్వర్యకు ఒక భర్త ఉన్నాడూ.. ఆ భర్తకు తన భార్యను ఆదేశించాలని, అదుపులో ఉంచుకోవాలని, బయటి నుంచి తను ఇంట్లోకి రాగానే తన భార్య ఎంత మందిలో ఉన్నా భయంతో లేచి నిలబడి, తలచుట్టూ కొంగు కప్పుకునే అపురూపమైన దృశ్యం చూడాలని ఆశగా ఉంటుందని ఎందుకనుకోరు?
మొదటే అన్నాను ‘నాకీ పెళ్లి వద్దమ్మా’ అని. అమ్మ వినలేదు. ‘పెళ్లి వద్దని అంటే అన్నావు కానీ, ఈ పెళ్లి వద్దని మాత్రం అనకురా..’ అంది.
‘అంత చదువుకున్న పిల్ల నాకొద్దమ్మా’ అన్నాను. ‘అందంగా ఉందిరా’ అంది.
‘అంత అందమైన పిల్ల నాకొద్దమ్మా’ అన్నాను. ‘గుణంగల పిల్లరా..’ అంది.
‘ఎవరికి లేని గుణం అమ్మా..’ అన్నాను.
అమ్మ వినలేదు. నాన్న వినలేదు. అక్క వినలేదు. ఇప్పుడూ వినిపించుకోవడం లేదు!
హరిద్వార్‌ వచ్చి పది రోజులైంది. ఈ ప్రశాంతత ఇక్కడి వాతావరణం వల్ల వచ్చిందా, లేక.. పక్కనే రూపవతి, గుణవతి, విద్యావతి అయిన భార్య లేకపోవడం వల్ల వచ్చిందా అర్థం కావడం లేదు. ఇటువైపు పుణ్యక్షేత్రాలన్నీ అయిపోయాక, అటువైపు దక్షిణ భారతదేశ యాత్రలకు వెళ్లాలి.
భాష తెలియకపోవడం సమస్య కాకపోవచ్చు. అంత తెలిసిన భాషలో ఐశ్వర్య నన్నెంత అర్థం చేసుకుందని?!

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top