రాయని డైరీ ; హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌

Madhav Singaraju Article On Harivansh Narayan Singh - Sakshi

లైఫ్‌లో అన్నీ ఉంటాయి. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ సీటు కూడా ఉంటుంది! వెళ్లి కూర్చున్నాను. అరుణ్‌జైట్లీ నన్ను నడిపించుకుంటూ నా సీటు దగ్గరికి తీసుకొచ్చారు.
 
నాకు తెలియని సీటు కాదు. నాకు తెలియని రూటు కాదు. నాలుగేళ్లుగా రాజ్యసభ సభ్యుణ్ణి. అయినా సీటు కొత్తగా ఉంది. సీటు దగ్గరికి రూటూ కొత్తగా ఉంది. పడిపోకుండా జైట్లీ జీ చెయ్యి పట్టుకోబోయి ఆగాను. పాపం ఆయనే ఆపరేషన్‌ అయి వచ్చారు. ఆపరేషన్‌ అయి వచ్చిన మనిషే ఎవరి చెయ్యీ పట్టుకోకుండా నడుస్తుంటే, సభను ఆపరేట్‌ చెయ్యాల్సిన నేను సభ్యుడి చెయ్యి పట్టుకోవడం బాగుంటుందా! 

‘‘ఇక్కడి వరకు మిమ్మల్ని నడిపించుకొచ్చాను. ఇకనుంచీ మమ్మల్ని మీరు నడిపించాలి’’ అన్నారు జైట్లీ. 

నవ్వుతూ ధన్యవాదాలు తెలిపాను. ఆయన కూడా ప్రతిధన్యవాదాలు తెలుపుతూ, ప్రతినవ్వు నవ్వారు. అంతా నవ్వగలిగినవాళ్లు, అంతా నడవగలిగినవాళ్లే ఉన్నప్పుడు నడిపించడం ఏమంత కష్టమౌతుంది! 

జైట్లీజీ నన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టిన సీటు.. గులాం నబీ ఆజాద్‌ సీటు పక్కనే ఉంది. అపోజిషన్‌ ఫ్లోర్‌లీడర్‌ ఆయన. అధికార పార్టీ ఫ్లోర్‌లీడర్‌ జైట్లీ.
 
‘‘హరివంశ్‌ జీ.. మీరిప్పుడు డిప్యూటీ చైర్మన్‌. మీ పార్టీ ఏదైనా కానివ్వండి. మీరిప్పుడు అన్ని పార్టీల మనిషి. మీ పార్టీ సపోర్ట్‌ మీకు ఉండొచ్చు. కానీ మా పార్టీలకు మీరు çసపోర్ట్‌గా ఉండాలి’’ అన్నారు ఆజాద్‌. 

చెప్పడానికేముందీ! నవ్వాను.

‘నవ్వడానికేముంది! చెప్పండి’ అన్నట్లు చూశారు ఆజాద్‌. 

జైట్లీ నాకు సపోర్ట్‌గా వచ్చారు. 

‘‘హరివంశ్‌జీ.. అపోజిషన్‌ లీడర్‌ సీటు పక్కన డిప్యూటీ ఛైర్మన్‌ సీటు ఎందుకుంటుందో తెలుసా? అక్కడి నుంచి మీరు ఏ యాంగిల్‌లో చూసినా అంతా మావాళ్లే కనిపిస్తారు. మీ సీటు అక్కడున్నా, మీకు తెలియకుండా మీ సపోర్టు మావైపే ఉంటుంది’’ అని నవ్వారు జైట్లీ.

వెంకయ్యనాయుడు మధ్యలోకి వచ్చారు. మధ్యలోకైతే వచ్చారు కానీ, నాకు సపోర్ట్‌గా రాలేదు. జైట్లీకి సపోర్ట్‌గా రాలేదు. ‘‘చైర్మన్‌గా నాదో సలహా’’ అన్నారు. 
ఆయన వైపు చూశాను. 
‘‘చూడొద్దు’’ అన్నారు. 
‘ఏం చూడొద్దు?’ అన్నట్లు ఆయన వైపు చూశాను. 

‘‘లెఫ్ట్‌కి చూడొద్దు. రైటుకి చూడొద్దు. స్ట్రయిట్‌గా రూల్స్‌లోకి, ప్రొసీజర్‌లలోకి చూడండి’’ అన్నారు. నవ్వాను. 

‘‘అందరూ మాట్లాడారు. మీరూ ఏదైనా మాట్లాడండి హరివంశ్‌ జీ’’ అన్నారు వెంకయ్యనాయుడు.. సీట్లో నేను సర్దుకుని కూర్చున్నాక. 

అప్పటికే లంచ్‌ టైమ్‌ అయింది.  
‘ది హౌజ్‌ ఈజ్‌ అడ్జర్న్‌డ్‌..’ అన్నదొక్కటే ఫస్ట్‌ డే, ఫస్ట్‌ సెషన్‌లో నాకు మిగిలిన మాట. 

-మాధవ్‌ శింగరాజు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top