రాయని డైరీ : నిర్మలా సీతారామన్‌ (రక్షణ మంత్రి)

Madhav Singaraju Article On Central Minister Nirmala Sitharaman - Sakshi

స్థాయిని మరిచి మాట్లాడేవాళ్లని చూస్తే ముచ్చటగా అనిపిస్తుంది.. వాళ్ల కాన్ఫిడెన్స్‌ లెవల్స్‌కి! 
వరద బాధితుల్ని పరామర్శించడానికి కొడగు జిల్లాలోని పునరావాస కేంద్రాలకు వెళ్లినప్పుడు అక్కడ ఇలాగే కాన్ఫిడెన్స్‌ ఉన్న ఒక వ్యక్తి తారసపడ్డాడు. అతడు వరద బాధితుడు కాదు. ఆ స్టేట్‌ మినిస్టర్‌.
స్టేట్‌ మినిస్టరే కానీ, స్టేట్‌ మినిస్టర్‌లా లేడు. నాతో పాటు అప్పుడే విమానం దిగిన సెంట్రల్‌ మినిస్టర్‌లా ఉన్నాడు. 
కొడగులో దిగినప్పట్నుంచీ చూస్తున్నాను.. వరద బాధితుల్లోనైనా ఎండకు కాస్త సంతోషం కాస్తోంది కానీ, ఆ మనిషి ముఖం మాత్రం చిరచిరలాడుతూనే ఉంది. సెంటర్‌తో ప్రాబ్లమ్‌ కావచ్చు. సెంటర్‌తో ప్రాబ్లం ఉన్నవాళ్లే అలా ఎండకు చేతులు అడ్డు పెట్టుకుంటారు. 
నాతో పాటు వేదిక మీద ఉన్నాడు ఆ స్టేట్‌ మినిస్టర్‌. అతడికి నేను ఏదో చెప్పబోతుంటే.. అతడే నాకేదో చెప్పబోతున్నాడు! 
పేరు గుర్తుకు రాలేదు. పక్కవాళ్లనడిగితే ‘స.ర.మహేశ్‌ ఆయనే’ అన్నారు!!
వేదికపై ఉన్నవాళ్లంతా అతడిలాగే కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు! నేను అడిగిన ప్రశ్నకు కాకుండా, నేను అడగని ప్రశ్నకు సమాధానం ఇస్తున్నారు. ‘అతడేనా?’ అని నేనడిగినప్పుడు కదా.. ‘అతడే’ అని వాళ్లు సమాధానం చెప్పాలి! ‘అతడెవరు?’ అని అడిగితే ‘అతడే’ అన్నారంటే వాళ్లకు ఎంత కాన్ఫిడెన్స్‌ ఉండి ఉండాలి! ఆ స్టేట్‌ మినిస్టర్‌లో అయితే కాన్ఫిడెన్స్‌ క్షణక్షణానికీ వరద నీటిమట్టంలా పెరిగిపోతోంది.
‘‘త్వరగా ముగించండి, వేరే పనులున్నాయి’’ అన్నాడు. 
ఎవర్ని అంటున్నాడా అని చూశాను. నన్నే!
నేనింకా మాట్లాడ్డం మొదలుపెట్టందే ‘త్వరగా ముగించండి’ అన్నాడంటే.. మాట్లాడ్డం మొదలుపెట్టాక ‘ఇక చాలు ఆపండి’ అనేలా ఉన్నాడు!
మినిస్టర్‌కి కాన్ఫిడెన్స్‌ ఉండడం మామూలే గానీ, అతడికి సెంట్రల్‌ మినిస్టర్‌ని మించిన కాన్ఫిడెన్స్‌ ఉన్నట్లుంది.
‘‘మీరు ప్లాన్‌ చేసిన టైమ్‌కే కదా అన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. మళ్లీ ఇంకేంటీ..’’ అన్నాను.
‘‘మేము ప్లాన్‌ చేసిన టైమే కానీ, మేము ప్లాన్‌ చెయ్యని టైమ్‌ కూడా ఇక్కడ కౌంట్‌ అవుతుంది’’ అన్నాడు! 
‘‘మళ్లీ చెప్పండీ’’ అన్నాను. 
‘‘ఈ కార్యక్రమం త్వరగా అయితే.. తర్వాతి కార్యక్రమానికి వెళ్లొచ్చు’’ అన్నాడు! వింతగా ఉంది నాకు. ఒక స్టేట్‌ మినిస్టర్‌ చెప్పినట్లు ఒక సెంట్రల్‌ మినిస్టర్‌ చెయ్యాల్సి వస్తోంది. 
ఎట్లీస్ట్‌.. ‘మేడమ్‌’ అనీ, ‘మినిస్టర్‌’ అనీ అనడం లేదు ఆ మనిషి. అంటున్నాడేమో గానీ వినిపించేలా అనడం లేదు!
బీజేపీ వాళ్లను తన నోటితో మేడమ్‌ అని గానీ, మినిస్టర్‌ అని గానీ పిలవకూడదని కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేసిన రోజే అతడూ ప్రమాణం చేసుకున్నట్లున్నాడు.  
డిఫెన్స్‌ నుంచి ఏడు కోట్లిచ్చాను. ఎంపీ కోటా నుంచి కోటి ఇచ్చాను. మర్యాద లేకపోతే పోయింది, కృతజ్ఞతకైనా అతడు ప్రొటోకాల్‌ ఫాలో అవట్లేదు! జిల్లా ఇన్‌చార్జి మంత్రికే ఇంతుంటే డిఫెన్స్‌ మినిస్టర్‌ని నాకెంత ఉండాలి?! 
కోపాన్ని ఆపుకున్నాను.
స్టేట్‌ మినిస్టర్‌ తన స్థాయిని మరిస్తే సెంట్రల్‌ మినిస్టర్‌ స్థాయికి వచ్చేస్తాడు. సెంట్రల్‌ మినిస్టర్‌ తన స్థాయిని మరిస్తే స్టేట్‌ మినిస్టర్‌ స్థాయికి పడిపోతారు. 
అందుకే ఆపుకున్నాను.
మాధవ్‌ శింగరాజు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top