సానుకూల దృక్పథంతోనే పరిష్కారం

ABK Prasad Guest Column On China And India LAC - Sakshi

రెండో మాట 

బ్రిటిష్‌ వలస సామ్రాజ్యవాద పాలకులు సామ్రాజ్య విస్తరణలో భాగంగా తలపెట్టిన ఊహాజనిత ’గీత’ మెక్‌మహన్‌ రేఖ. ఇది భూమి మీద గీసిన సరిహద్దు రేఖ కానందునే ఈ రోజు దాకా భారత్‌–చైనాల మధ్య స్వతంత్ర దేశాల హోదాలో కలతలు, కార్పణ్యాలు సమసిపోవడం లేదు. ఎవరికి తోచిన ఊహాజనిత రేఖ దానికదేగా వాస్తవ రేఖ కాదు కాబట్టి, భారత– చైనాల మధ్య ముఖాముఖిగా శాశ్వత ప్రాతిపదికన సంప్రదింపులు తక్షణం ప్రారంభం కావాలి. భారతదేశంలో ఏ పాలకుడైనా చారిత్రికంగా వేలాది సంవత్సరాల భారత్‌–చైనా సంబంధాలకూ, నాగరికతకూ తోడూనీడై నిలిచి నప్పుడే, అందుకు చైనా పాలకులూ దీటుగా స్పందించినప్పుడే ఉభయదేశాల ప్రజల మధ్య సంబంధాలు తిరిగి సముజ్వలంగా పెరుగుతాయి.

‘‘భారత్‌–చైనా సరిహద్దుల్లోని భారత భూభాగంలోకి ఎవరూ ప్రవేశించనూ లేదు. మన సరిహద్దు స్థావరాలను ఎవరూ స్వాధీనం చేసుకోనూ లేదు. మన సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చాం. శాంతి, స్నేహ సంబంధాలనే భారత్‌ కోరుకుంటోంది. అయితే భారత్‌ వైపు చూసే ధైర్యం చేసేవారికి మన జవాన్లు తగిన గుణపాఠం చెప్తారు’’.
– జూన్‌ 15న భారత్‌–చైనా సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ (లైన్‌ ఆఫ్‌ యాక్చువల్‌ కంట్రోల్‌)  వద్ద ఉభయ దేశాల సైనికుల మధ్య ఘర్షణలలో 20 మంది భారత సైనికులు చనిపోయిన ఘటనపై స్పందిస్తూ ప్రధాని మోదీ జూన్‌ 19న అఖిల పక్షాన్ని ఉద్దేశించి చేసిన ప్రకటన.

‘‘ప్రధానమంత్రి ప్రకటనే నిజమయితే ఉభయదేశాల మధ్య వాస్తవాధీన రేఖ ఉన్న ప్రాంత భూమి చైనాదే అయితే, మన సైనికులు ఎందుకు బలికావాల్సి వచ్చింది? వాస్తవానికి మన సైనికులు బలైన ప్రాంతం అసలు ఎక్కడ ఉంది? మోదీ ప్రయత్నం రాజకీయ పక్షాలను తప్పుదోవ పట్టింది దౌత్యపరమైన సంప్రదింపుల్లో భారత వైఖరిని బలహీనపరిచేదిగా ఉంది’’
– కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ, వామపక్షాలు, ప్రతిపక్షాలు

1962లో భారత్‌–చైనాల మధ్య తూర్పున ఈశాన్య సరిహద్దుల నుంచి పశ్చిమాన వాయవ్య భారత సరిహద్దు వరకు జరిగిన పరస్పర సైనిక ఘర్షణలకు, ఆక్రమణలకు ప్రధాన కారణం– ఈ చివర నుంచి ఆ కొస దాకా బ్రిటిష్‌ సామ్రాజ్యవాద పాలకులు, 18–19 శతాబ్దాల మధ్య బ్రిటిష్‌ అధికారి మెక్‌మహన్‌ గీసిన ఊహాజనిత సరిహద్దు రేఖలే. 3,800 కిలోమీటర్ల పైచిలుకు భూభాగంలో, ఆనాటి అస్వతంత్ర దేశాలైన భారత్‌–చైనా ప్రజల సార్వభౌమాధికారంతో నిమిత్తం లేకుండా కేవలం ఒక ఊహాజనిత రేఖతో గీసిన ‘గాలిపటం’ లాంటి పటం. దాని పేరే మెక్‌మహన్‌ రేఖ! బ్రిటిష్‌ వలస సామ్రాజ్యవాద పాలకులు సామ్రాజ్య విస్తరణలో భాగంగా తలపెట్టిన ఈ ఊహాజనిత ‘గీత’.. భూమి మీద గీసిన సరిహద్దు రేఖ కానందునే ఈ రోజు దాకా భారత్‌–చైనాల మధ్య స్వతంత్ర దేశాల హోదాలో కలతలు, కార్పణ్యాలు సమసిపోవడం లేదు. వాయవ్య దిక్కున అక్షయచీనా (అక్సయిచిన్‌), కారాకోరమ్‌ కనుమ నుంచి ఇటు ఈశాన్య భారతంలోని భారత చైనా సరిహద్దులలో ఉన్న అరుణాచల్‌ప్రదేశ్‌ దాకా చైనాలో అంతర్భాగమైన టిబెట్‌ దక్షిణ దిశవరకూ భారత్‌–చైనాల మధ్య ఉద్రిక్త సరిహద్దులుగా మారాయి. నేలమీద గుర్తించకుండా కేవలం బ్రిటిష్‌ వాడి మ్యాపులో సామ్రాజ్యవిస్తరణ విన్యాసాలలో భాగంగా ఉజ్జాయిం పుగా గీసుకున్న మెక్‌మహన్‌ రేఖపై మన రెండు స్వతంత్ర దేశాలు గత 58 ఏళ్లుగా తగాదాలతో, ఘర్షణలతో సతమతమవుతున్నాయి. 

సామ్రాజ్యవాదులు పటానికి పరిమితమై గీసిన ఉజ్జాయింపు సరిహద్దు కాస్తా ఒక వేళ స్థిరమైన సరిహద్దుగా మన రెండు దేశాల మధ్య ఖరారు కావాలన్నా, లేదా పరస్పర సర్దుబాట్లతో ఉభయతారకంగా పరిష్కారం కావాలన్నా ఏం జరగాలి? చర్చలకు కూర్చుని వెసులుబాట్లతో శాశ్వత సరిహద్దులను, 3,800 కిలోమీటర్ల పొడవునా కచ్చితమైన సరిహద్దు రేఖను నేలపై గుర్తించాలి. అప్పుడు అది వాస్తవమైన సరిహద్దు అవుతుంది. అందాకా ఎవరికి తోచిన ఊహాజనిత రేఖ దాని కదేగా వాస్తవ రేఖ కాదు కాబట్టి, భారత– చైనాల మధ్య ముఖాముఖిగా శాశ్వత ప్రాతిపదికన సంప్రదింపులు తక్షణం ప్రారంభం కావాలి. ఇది ఉభయ దేశాల పాలకుల ప్రయోజనాల సమస్యగాకంటే, నిత్యం ధన ప్రాణాలను, పరువు ప్రతిష్ఠలను కోల్పోతున్న 260 కోట్ల ప్రజల దీర్ఘకాల వాంఛ అన్న గుర్తింపు, స్పృహ పాలకులకు ఉండటం అవసరం. పైగా, ఇది పరస్పరం తప్పొప్పులను కెలుక్కునే సమయం కాదు. లద్దాక్‌ సమీపంలో సరిహద్దుల్లోని గాల్వాన్‌ లోయ వద్ద  జరిగిన సాయుధ దళాల మోహరింపులో పరస్పరం జవాన్లకు కల్గిన ప్రాణ నష్టం బాధాకరమే అయినప్పటికీ, ఉభయ దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించడం కోసం ఉభయత్రా శాంతికి అనుకూలంగా ఒక ప్రకటన చేయడం సంతోషించదగింది. 

పైగా 1962 భారత–చైనా సరిహద్దు ఘర్షణల సమయంలో మన సరిహద్దులు మన సైన్యానికి నిర్దిష్టంగా తెలియని స్థితిలో ముందుకు దూసుకెళ్ళమని సైన్యాధికారులకు ఆదేశమిచ్చి ఆనాటి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ సింహళ పర్యటనకు వెళ్ళారు. ఇరుసైన్యాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఆనాడు కూడా ఇరువైపులా ప్రాణనష్టం జరిగింది. తాజాగా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో మన సైనికులు 20 మంది నిండు ప్రాణాలు విడువవలసి వచ్చింది. అంతేగాదు, మనవాళ్లను చైనా సైన్యం మరెంతమందిని బందీలుగా తీసుకు వెళ్లింది కూడా మనకు తెలియదు. చివరికి 10 మంది అని చైనా ప్రకటించి మనవాళ్లకి తిరిగి అప్పగించే వరకూ (జూన్‌ 19) మనకు వారి ఆచూకీ తెలియక పోవడం 1962 నాటి స్థితినే తెల్పుతుంది. 

ఆనాడు ఈశాన్య సరిహద్దు ఘర్షణల సమయంలో బోమ్డిలా వరకూ దూసుకు వచ్చి మన సేనల్ని తరిమికొట్టి తిరిగి తోక ముడిచిన చైనా వ్యూహం వెనక రహస్యం కూడా.. దౌత్యరీత్యా జరపవలసిన ముఖాముఖి చర్చల ద్వారా సరిహద్దుల్ని నేలమీద గుర్తించేదాకా, పరస్పరం యిచ్చిపుచ్చుకునే దౌత్యనీతికి కట్టుబడి ఉండేదాకా ఘర్షణలు తప్పక పోవచ్చునేమోనని పరిణామాల బట్టి అనిపిస్తోంది. ఈ పరిస్థితిని సమీక్షించుకుంటే బహుశా ప్రసిద్ధ యుద్ధ చరిత్రకారుడు ఆల్ఫ్రెడ్‌ వాట్స్‌ చేసిన హెచ్చరిక జ్ఞాపకం వస్తోంది. ‘‘పౌర ప్రభుత్వాల పదవీ కాంక్షలు, భావావేశాలు, ఘోర తప్పిదాల ఫలితంగా సైన్యనాధులు యుద్ధాలలో తలమునకలు కావలసిన దుస్థితి తరుచుగా ఏర్పడుతోంది’’ (ది హిస్టరీ ఆఫ్‌ మిలటరిజం)! అంతే కాదు, చైనాలో భారత రాయబారిగా పనిచేసిన గీతం బొంబావాలే హితవు చెప్పినట్లుగా, వాస్తవాధీన రేఖ ఎక్కడుందన్న విషయంపై ఉభయత్రా అభిప్రాయభేదాలున్న వాస్తవాన్ని భారత–చైనాలు రెండూ అంగీకరిస్తున్నాయి. కాబట్టి ఉభయ దేశాల మధ్య శాంతి సామరస్యాలను కాపాడుకుని తీరాలి. (గీతం ప్రకటన: 22–06–2020)! 

నిజానికి ఈ పరస్పర ప్రయోజనాలను సాధించేందుకే 1962లో సరిహద్దు ఘర్షణలు, తీవ్ర నష్టాలు జరిగాయి. అప్పుడు కూడా మన సైనికులు 3,800 మంది చనిపోయారని తెలియజెప్పిందీ, బందీలైన వందలాదిమందిని భారత సైనికులను తిరిగి అప్పజెప్పిందీ చైనానే కావడం మరో విశేషం. ఇప్పుడూ అలాగే జరిగింది. మెక్‌మహన్‌ రేఖ పూర్వాపరాలను నెవెల్లీ మాక్స్‌వెల్‌ పూర్తిగా వివరిస్తూ ‘ఇండియాస్‌ చైనా వార్‌’ అనే గ్రంథాన్ని ఆనాడే రాశారు. అంతేగాదు, భారత చైనాల మధ్య సామరస్య వాతావరణాన్ని కల్పించడానికి 1962 దుర్ఘటనల మధ్య శతధా ప్రయత్నించిన వారిలో శ్రీలంక ప్రధాని సిరిమావో బండారునాయకే, ఘనా అధ్యక్షుడు, రాజనీతిజ్ఞుడయిన ఎన్‌క్రుమా ప్రముఖులు. కొలంబో ప్రతిపాదనల సారాంశమంతా– బ్రిటిష్‌వాడు ఆసియాలో తన సామ్రాజ్య విస్తరణలో భాగంగా.. టిబెట్‌ను చైనా నుంచి వేరు చేయడానికి చేసిన ప్రయత్నాన్ని ఖండించటంతోపాటు మెక్‌మహన్‌ రేఖకు భిన్నంగా భారత్‌–చైనాల మధ్య ముఖాముఖి చర్చల ద్వారా సరిహద్దులను పరిష్కరించుకోవాలనే. 

ఆ మాటకొస్తే, గాంధీజీ ప్రథమ శిష్యగణంలో అగ్రజులయిన పండిట్‌ సుందరలాల్, జేసీ కుమారప్ప భారత్‌–చైనాల మధ్య మూడో శక్తి ప్రమేయం లేకుండా సరిహద్దు సమస్యను పరిష్కరించుకోవడానికే మొగ్గుచూపి తమ చైనా పర్యటన అనుభవాలను పూసగుచ్చినట్టు వెల్ల డించారు. ‘చైనా టుడే’ అన్న గ్రంథంలో పండిట్‌ సుందరలాల్‌.. టిబెట్, చైనాలో అంతర్భాగమేనని చాటారు. కానీ 1959లో దలైలామా టిబెట్‌ నుంచి ఉడాయించి మన దేశ పాలకుల సహకారంతో ఇండియాలో ఉంటున్నప్పటినుంచీ భారత్‌–చైనా సంబంధాలు మరింత చెడిపోవడానికి, చైనా వ్యతిరేక ప్రకటనలతో వాతావరణాన్ని పూర్తిగా కలుషితం చేయడానికి భారత పాలకులకు చేదోడువాదోడయ్యాడు, దలైలామా తర్వాత టిబెట్‌ లామాలకు నాయకుడైన మరో నాయకుడు అమెరి కాలో స్థిరపడి చైనా వ్యతిరేక ప్రచారానికి సమిధలు అందిస్తూ వచ్చాడు. భారతదేశంలో ఏ పాలకుడైనా చారిత్రికంగా వేలాది సంవత్సరాల భారత్‌–చైనా సంబంధాలకూ, నాగరికతకూ తోడూనీడై నిలి చినప్పుడే, అందుకు చైనా పాలకులూ దీటుగా స్పందిం చినప్పుడే ఉభయదేశాల ప్రజల మధ్య సంబంధాలు తిరిగి సముజ్వలంగా పెరుగుతాయి. అసలు మనకు ఇరుగు పొరుగు దేశాలతో సంబంధాలు బాగున్నాయో, లేదో తెలిస్తే.. మిగతా ముచ్చట సంగతి తర్వాత!

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు

abkprasad2006@yahoo.co.in
 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top