కోర్కెలు తీర్చే గోలెం

Srimagangalam is a famous Sivakshitram in South Kashi - Sakshi

మహిమాన్వితం

దక్షిణ కాశిగా పేరుగాంచిన ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగం. ఎక్కడైనా శివుడు లింగాకారంలో ఉంటాడు. ఈ క్షేత్రంలో మాత్రం ముఖం దాల్చి ఆవిర్భవించాడు. అందుకే ఈ క్షేత్రాన్ని శ్రీముఖలింగమని, ఇక్కడ కొలువైన శివుని ముఖలింగేశ్వరుడని పిలుస్తారు.  కాశిలో లింగం, గంగలో స్నానం.. శ్రీశైలంలో శిఖరం, శ్రీముఖలింగంలో ముఖదర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ జరిగే మహాశివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులు రెండు తెలుగు రాష్ట్రాల  నలుమూలల నుంచి తండోపతండాలుగా వస్తారు. ఈ క్షేత్రంలో ఈ ఏడాది మహా శివరాత్రి ఉత్సవాలు నాలుగు రోజులపాటు  మార్చి 4 నుంచి 7 వరకూ జరుగుతాయి.

గోలేం కథ ఇది
స్వామివారి గర్భాలయంలో మూలవిరాట్టుకి వెనుక పెద్ద మట్టి గోలెం ఉంది. అది ఎంత పెద్ద గోలెమంటే గర్భాలయం ద్వారం పట్టనంత. శ్రీముఖలింగం గ్రామానికి చెందిన కుమ్మరి నాగన్న సంతానం కోసం స్వామివారిని పూజిస్తుంటాడు. తనకు కుమారుడు పుడితే ఓ పెద్ద మట్టి గోలెం చేసి దాని నిండా ఆవు పాలు పోసి అభిషేకం చేస్తానని మొక్కుకున్నాడు. కొన్నాళ్లకు ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో నాగన్నకు ఒక కొడుకు పుట్టాడు.

మొక్కు చెల్లించుకోవడానికి ఓ పెద్ద  మట్టి గోలెం చేసి దాని నిండా పాలుపోసి దానిని గర్భాలయంలోనికి తీసుకుపోవడానికి ప్రయత్నిస్తాడు. అది గర్భగుడి ముఖ ద్వారం పట్టనంత పెద్ద గోలెం అవడంతో గర్భాలయంలోనికి తీసుకెళ్లలేక అమితమైన దుఃఖంతో గోలెంతోపాటు తనకు ఆ పరమ శివుడు ప్రసాదించిన బిడ్డను కూడా ఆలయం ముఖమంటపంలోనే విడిచి పెట్టి ఇంటికి వెళ్లిపోతాడు. మర్నాడు స్వామి వారి నిత్యపూజలకై అర్చకులు గర్భగుడి తలుపులు తీసి చూడగా ఆ గోలెం మూలవిరాట్టు వెనకాల ఉన్నది. అలాగే నాగన్నకు పుట్టిన బిడ్డ కూడా గోలెం పక్కనే బోసినవ్వులతో ఆడుకుంటున్నాడు. ఇది చూసిన నాగన్నతో సహా గ్రామస్తులంతా ముఖలింగేశ్వరుని మహాత్యాన్ని వేనోళ్ల సుత్తించారు.

న్యాయమైన కోర్కెలు తీర్చే నాగభూషణుడు
ఈ గోలెంలో పాలతోపాటు బియ్యం, వడ్లు (ధాన్యం) మంచినీరు, అన్నం, పండ్లు ఇలా భక్తులు మొక్కులకు అనుగుణంగా ఆ గోలెం నిండుగా వేసి మొక్కులు తీర్చుకుంటారు. దీనిఫలితంగా సంతాన యోగం, గ్రహాదోషాల నివారణ, వివాహాలు, ఇతర న్యాయపరమైన కోర్కెలు తీరుతాయని స్థలపురాణంతోపాటు అర్చకులు చెబుతున్నారు. ఇలా తమ కోర్కెలను తలచుకొని ఆ గోలేన్ని ముట్టుకొని ఆ పరమేశ్వరుని నిండు మనస్సుతో ప్రార్థిస్తే కోరిన కోర్కెలు కొద్దికాలంలో తీరుతాయన్నది భక్తుల నమ్మకం. కోరిన కోర్కెలు  తీర్చే కొంగు బంగారంగా శ్రీముఖలింగం గోలెం వర్ధిల్లుతోంది.
సుంకరి శాంత భాస్కరరావు
సాక్షి, జలుమూరు. శ్రీకాకుళం

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top