దానం అంటే అది..! | Special story to Donations | Sakshi
Sakshi News home page

దానం అంటే అది..!

Jul 12 2018 12:10 AM | Updated on Jul 12 2018 12:10 AM

Special story to Donations - Sakshi

కురేశులు రామానుజాచార్యులకు ప్రధానమైన శిష్యుడు. కుర్‌ అనేగ్రామానికి అధినేత మహాసంపన్నుడు అయిన కురేశుడు  తెల్లవారినప్పడి నుంచి రాత్రి దాకా దానాలు చేస్తూనే ఉంటాడు. వచ్చిన వారందరికీ దానాలుచేసిన తరువాత ఒక రోజు రాత్రి కురేశుని భవనం ప్రధాన ద్వారాన్ని మూసినప్పుడు దఢేలని ధ్వని వచ్చింది. ఆ ధ్వని ఏమిటని వరదరాజ పెరుమాళ్‌ను లక్ష్మీదేవి అడిగింది. కురేశుడు రోజంతా వచ్చిన వారికి దానధర్మాలు చేసి ఇప్పుడే తలుపు మూసుకున్న చప్పుడు దేవీ అది అంటూ, ఎంత మంది వచ్చినా కాదనని కురేశుడి దానశీలాన్ని వరదుడు వివరిస్తే ఆయనను ఒకసారి చూడాలని లకీ‡్ష్మదేవి భర్తను అడిగింది. సరేనని కురేశుడిని సతీసమేతంగా తీసుకురమ్మని వరదుడు కాంచీపూర్ణులను ఆదేశించారు. కాంచీపూర్ణుల వారు కురేశుని ఇంటికి వచ్చి, విషయమంతా వివరించి, తనతో రమ్మని కురేశుని అడుగుతారు. తన ఇంటి తలుపు చప్పుడు గురించి కంచి వరదుడు, లక్ష్మీదేవి మాట్లాడుకున్నారని తెలిసి కురేశుడు, ఆండాళ్‌ ఆశ్చర్యపోతారు. అలా తలుపు చప్పుడయ్యేట్టుగా వేయడం అహంకారానికి నిదర్శనంగా మారిందని తెలుసుకుని, అందుకు ఎంతో బాధపడతారా దంపతులు. ఎవరెవరో తమ ఇంటికి వచ్చి తమను దానం చేయమని అడగడం కాదు, తామే వెళ్లి అందరికీ దానాలు చేయాలని ఆ క్షణంలోనే నిర్ణయించుకున్నాడు కురేశుడు. తనకు ఏమీ మిగుల్చుకోకుండా మొత్తం ఆస్తినంతా పేదలకు పంచి పెట్టారు. ఆ తరువాత కంచి వరదుడిని కురేశ దంపతులు దర్శనం చేసుకున్నారు.  కురేశుని భార్య ఆండాళ్, కంచి వరదుని క్షమాపణ వేడింది.  

స్వామి తీర్థ ప్రసాదాలు తీసుకుని ఆచార్యుడైన రామానుజుడి దగ్గరకు వెళ్లాలని వారిరువురూ శ్రీరంగం బయలుదేరారు. దారిలో అరణ్యమార్గంలో ప్రయాణించినపుడు ఆండాళ్‌ భయపడితే, ‘‘ఎందుకు భయపడుతున్నావు? చేపలు నీటిలో పురుగులను తినేస్తాయి. మరణం జీవితాన్ని తినేస్తుంది. దొంగలు ధనాన్ని తింటారు. మనదగ్గర ధనం ఏమీ లేదుకదా దొంగలేం చేస్తారు?’’ అని అడిగాడు కురేశుడు.‘‘మీరు నీళ్లు తాగడానికని ఒక బంగారు పాత్రను వెంట తెచ్చుకున్నాను స్వామీ’’ అంటుంది ఆండాళ్‌. ‘‘ఓస్, దీని కోసమే కదా, నీవు భయపడుతున్నది, ఇది మన వద్ద లేకపోతే, ఇక మనం ఏమీ పోతుందని భయపడాల్సిన అవసరం ఉండదు కదా అనుకుంటూ, దాన్ని తీసుకుని విసిరి పారేస్తారు కురేశులు. తర్వాత నిర్భయంగా ప్రయాణం చేసి, రామానుజుని వద్దకు చేరుకుంటారా దంపతులు. శిష్యుని సంతోషంతో కౌగిలించుకుంటాడు రామానుజులు.దానం చేసేటప్పుడు అవతలి వారికి తాను సహాయం చేస్తున్నాను అనే భావన దాతకు కలిగితే, అది దానం అనిపించుకోదు. సహాయ పడే అవకాశాన్ని కల్పించినందుకు  అవతలి వారికి ధన్యవాదాలు చెప్పుకోవడం వినయం అవుతుంది. అలాంటి దానాన్నే భగవంతుడు ఆమోదిస్తాడు. 
– డి.వి.ఆర్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement