తడబడింది.. నిలబడింది...

Rajannasircilla Yellareddypet Mandal Government Schools In English Medium - Sakshi

ఒకప్పుడు వందలాది మంది పిల్లలతో వెలిగిన బడులు మూతబడ్డాయి. పిల్లలు రాకుంటే బడి ఎలా నడుస్తుంది. అందుకే బడి మూతపడింది.. ఇందులో వింతేముంది.. ఎన్నో సర్కారు స్కూళ్లు మూతపడ్డాయి. కానీ ఇక్కడ మూతపడింది సర్కారు స్కూళ్లు కాదు.. ప్రైవేటు స్కూళ్లు.. ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 17 ప్రైవేటుబళ్లు మూతపడ్డాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టిగా చేయి చేయి కలిపి సర్కారు బడిని బతికించుకున్నారు. ఇది కొన ఊపిరితో ఉన్న ఎన్నో సర్కారు స్కూళ్లకు ఆదర్శమైంది.. ఒక్కరు చూపిన చొరవ వందలాది మంది తల్లిదండ్రులకు ప్రైవేటు భారాన్ని తప్పించిన విజయమిదీ..

బీజం పడింది ఇక్కడే...
ఎల్లారెడ్డిపేట మండలంలోని పదిరలో ఏడో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల ఉంది. ఒకప్పుడు ఎంతో మందికి విద్యాబద్ధులు నేర్పించిన ఆ బడి ఒక దశలో మూతపడే స్థాయికి చేరింది. కారణం అక్కడ ఓ ప్రైవేటు స్కూల్‌ ఏర్పాటు కావడం. అందులో కేరళకు చెందిన ఉపాధ్యాయులు ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేస్తున్నారు. పిల్లల తల్లిదండ్రులు ఇంగ్లీష్‌ మీడియం పై ఆసక్తితో తమ పిల్లలను ఆ బడికి పంపించడం ప్రారంభించారు. ఒకరిని చూసి ఒకరు ఇలా ప్రైవేటు బడిలో సంఖ్య పెరుగుతోంది. సర్కారు బడిలో తగ్గుతోంది. ఆ బడిలో చదువుకున్న స్థానికులను ఇది కలచి వేసింది. ఈ విషయాన్ని మండల విద్యాధికారిగా ఉన్న మంకు రాజయ్యకు చెప్పారు. సర్కారు బడిలో ఇంగ్లీష్‌ మీడియం బోధన చేయలేరా..? అని పదిర గ్రామస్తులు ప్రశ్నించారు. ఎందుకు చేయలేం.. తప్పకుండా చేద్దామని నిర్ణయించుకుని తొలి అడుగు వేశారు. అంతే! ప్రభుత్వ స్కూల్‌లో ఆంగ్ల బోధనకు శ్రీకారం చుట్టారు. దాంతో అక్కడి ప్రైవేటు స్కూల్‌ మూతపడింది. సర్కారు బడి బతికింది.. అదే స్ఫూర్తితో దుమాల గ్రామంలోనూ సర్కారు బడిలో ఇంగ్లీష్‌ మీడియం ప్రారంభించారు. అక్కడా ప్రైవేటు స్కూల్‌ మూతపడింది. ఇలా ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లోని 17 ప్రైవేటు స్కూళ్లు సర్కారు ఒక్కొక్కటిగా చేతులెత్తేశాయి.

‘మా బడికి రండి’ అంటూ...
‘మా బడికి రండి’ అంటూ ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు కరపత్రాలను ముద్రించారు. సర్కారు బడిలో ఆంగ్ల మాధ్యమంతో పాటు.. తాము అందించే విద్యాబోధన విధానాలను వివరిస్తూ.. కరపత్రాలను పంపిణీ చేశారు. పిల్లల తల్లిదండ్రుల ఇళ్లకు వెళ్లి.. వాళ్లకు అర్థమయ్యే రీతిలో చెప్పారు. ఒకటికి రెండుసార్లు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇంటికి రావడంతో తల్లిదండ్రుల్లోనూ మార్పు వచ్చింది. ప్రైవేటు బడికి పంపకుండా సర్కారు బడికి పంపించడం మొదలు పెట్టారు. ఒకరిని చూసి మరొకరు సర్కారు బడిపై నమ్మకాన్ని పెంచుకున్నారు. ఇలా ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లోని 32 స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేశారు. ఆ స్కూళ్లలో 979 మంది విద్యార్థులు ఉండగా.. ఆంగ్ల మాధ్యమానికి సర్కారు బడిలో శ్రీకారం చుట్టగానే 3905 మందికి చేరింది.

పదిరతో మొదలైన మార్పు అటవీ గ్రామాల్లోకి పల్లెలకు సోకింది. సర్కారు బడిలో నాణ్యమైన చదువు దరి చేరడంతో ప్రజాప్రతినిధులు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు బడికి సాయం చేసేందుకు ముందుకొచ్చారు. పిల్లలకు అవసరమైన బూట్లు, బ్యాడ్జీలు, టైలు, కొన్ని గ్రామాల్లో స్కూల్‌ బస్సులను సైతం సమకూర్చుకుని కార్పోరేట్‌ స్కూళ్లను మరిపించే విధంగా విద్యాబోధన చేస్తున్నారు. గత ఏడేళ్లలో దాతల సాయంతో రూ.కోటి వరకు విరాళాలు సమకూర్చుకుని సర్కారు స్కూళ్లకు జవసత్వాలు కల్పిస్తున్నారు. ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లోని సర్కారు విద్యాసంస్థల్లో 6753 మంది చదువుతున్నారు. ఇందులో ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లోని 12 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, మరో 32 మంది ప్రజాప్రతినిధులు తమ పిల్లలను స్థానికంగా ఉండే సర్కారు స్కూళ్లలోనే చదివించడం మరో విశేషం. ఇలా మార్పునకు టీచర్లు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు బాటలు వేశారు. సిరిసిల్ల ఎమ్మెల్యే కె. తారక రామారావు సైతం ప్రజాప్రతినిధుల, ఉపాధ్యాయుల ఉత్సాహాన్ని చూసి స్కూళ్లలో మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేయించారు. కార్పోరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌(సీఎస్‌ఆర్‌) కింద వివిధ కంపెనీల ద్వారా సర్కారు స్కూళ్లకు ఆధునిక హంగులు కల్పించారు.

బాధ్యతలను గుర్తించిన గురువులు...
బడి వేళ దాటితే చాలు.. ఇంటిదారి పట్టే ఉపాధ్యాయులు ఉన్న ఈ రోజుల్లో ఇక్కడి ప్రభుత్వ ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తున్నారు. వారి పట్టుదల, కృషి ఫలితంగానే సర్కారు బడి నిలబడింది. నూతన విధానానికి శ్రీకారం చుట్టక ముందు ఇక్కడి సర్కారు స్కూళ్లలో 158 మంది ఉపాధ్యాయులు ఉండగా.. పిల్లల సంఖ్య పెరిగి ఇప్పుడు 201కి చేరింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో విద్యార్థులు లేక స్కూళ్లు మూత పడి 750 ఉపాధ్యాయ స్థానాలు రద్దయ్యాయి. ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లో అందుకు భిన్నంగా పిల్లల సంఖ్యతో పాటు టీచర్ల సంఖ్య పెరగడం విశేషం. 

కోటికొక్కరు.. రాజయ్య సారు...
సర్కారు బడిని బతికించడంలో ఓ అధికారి కీలకపాత్రను పోషించారు. ఆయనే ఎల్లారెడ్డిపేట మండల విద్యాధికారి మంకు రాజయ్య. ఆయన పట్టుదల, అంకితభావం, నిబద్ధతతో చేసిన కృషి ఫలితంగా మార్పు సాధ్యమైంది. కోనరావుపేట మండలం ధర్మారం సర్కారు బడిలో చదువుకుని ఎంఈవోగా ఉద్యోగం సాధించిన ఆయన కళ్లముందే సర్కారు స్కూళ్లు మరణశయ్యపై ఉండడం చూసి తట్టుకోలేక పోయారు. సమస్య మూలాలను గుర్తించారు. ఈ పరిస్థితిని మార్చాలనుకున్నారు. గ్రామస్థులతో సమావేశాలు, ఉపాధ్యాయులతో సమీక్షలు, ఇంటింటా ప్రచారం ‘మన బడి.. మనందరి బాధ్యత’ అని కదిలించారు. అద్భుతమైన ఫలితాలను సాధించారు. ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లోని స్కూళ్లలో విశేషమైన మార్పునకు బాటలు వేశారు. ఇదే స్ఫూర్తితో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మరో 25 స్కూళ్లలోనూ ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు.

జాతీయ స్థాయిలో గుర్తింపు...
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ స్కూళ్లలో వచ్చిన మార్పు జాతీయ స్థాయిలో గుర్తింపునిచ్చింది. ఎల్లారెడ్డిపేట ఎంఈవో మంకు రాజయ్య ప్రతిష్ఠాత్మకమైన అవార్డును ఢిల్లీలో అందుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాష్ట్రమంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ప్రశంసాపత్రాన్ని, కేంద్ర మంత్రి స్మృతి ఇరాని చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. సర్కారు బడిలో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉంటారని, ప్రభుత్వం అందించే సౌకర్యాలను వివరిస్తూ.. ప్రైవేటు బడి కంటే సర్కారు స్కూల్‌ ఎంతో మేలు అనే సందేశాన్ని ఇచ్చే ‘ఇది మా సర్కారు బడి’ అనే షార్ట్‌ ఫిల్మ్‌ను నిర్మించి పల్లెల్లో ప్రదర్శిస్తున్నారు.
– వూరడి మల్లికార్జున్, ‘సాక్షి’ రాజన్న సిరిసిల్ల. 
– ఫొటోలు: నిమ్మ బాల్‌చందర్‌రెడ్డి, ఎల్లారెడ్డిపేట.

అందరి సహకారంతో సాధించాం...
అందరి సహకారంతో సర్కారు బడిని సగౌరవంగా నిలబెట్టాం. తెలుగుతో పాటు ఆంగ్ల మాధ్యమాన్ని బోధించాలని నిర్ణయించి సక్సెస్‌ అయ్యాం. ఇందుకోసం అనేక ఇబ్బందులు పడ్డాం. కానీ అంతిమంగా విజయం సాధించడం సంతోషంగా ఉంది. లోపాలు వెతికే కంటే లోపాలను సవరించడంపై దృష్టి సారిస్తే మంచి ఫలితాలు వస్తాయి. సామాజిక భాగస్వామ్యంతో బడులు బలోపేతం అయ్యాయి.
మంకు రాజయ్య, ఎంఈవో, ఎల్లారెడ్డిపేట.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top