‘పోరుగు’ ప్రాజెక్టుతో కౌలాస్‌కు ముప్పు | koulas project | Sakshi
Sakshi News home page

‘పోరుగు’ ప్రాజెక్టుతో కౌలాస్‌కు ముప్పు

Jul 27 2016 10:16 PM | Updated on Oct 1 2018 2:11 PM

‘పోరుగు’ ప్రాజెక్టుతో కౌలాస్‌కు ముప్పు - Sakshi

‘పోరుగు’ ప్రాజెక్టుతో కౌలాస్‌కు ముప్పు

పొరుగు రాష్ట్రాల్లో నిర్మిస్తున్న ప్రాజెక్టులతో జుక్కల్, బిచ్కుంద మండలాల వరప్రదాయని అయిన కౌలాస్‌ నాలాకు ముప్పు ఏర్పడింది. ఎగువ ప్రాంతాల్లోనే నీటిని ఆపేస్తే దిగువన ఉన్న కౌలాస్‌ ప్రాజెక్టు జలకళ సంతరించుకోవడం కష్టం. దీంతో ఆయకట్టు బీడుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది.

జుక్కల్‌ : పొరుగు రాష్ట్రాల్లో నిర్మిస్తున్న ప్రాజెక్టులతో జుక్కల్, బిచ్కుంద మండలాల వరప్రదాయని అయిన కౌలాస్‌ నాలాకు ముప్పు ఏర్పడింది. ఎగువ ప్రాంతాల్లోనే నీటిని ఆపేస్తే దిగువన ఉన్న కౌలాస్‌ ప్రాజెక్టు జలకళ సంతరించుకోవడం కష్టం. దీంతో ఆయకట్టు బీడుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. 
తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లో జుక్కల్‌ మండలంలో కౌలాస్‌నాలా ప్రాజెక్ట్‌ ఉంది. ప్రాజెక్ట్‌ నీటి మట్టం 458 మీటర్లు.. జుక్కల్‌ మండలంలోని ఐదు గ్రామాలు, బిచ్కుంద మండలంలోని మూడు గ్రామాలలో గల 9 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలన్న లక్ష్యంతో దీనిని నిర్మించారు. ప్రారంభంలో పూర్తిస్థాయిలో నీరందించిన ప్రాజెక్టు.. క్రమంగా కళను కోల్పోతూ వస్తోంది. పొరుగు రాష్ట్రాల్లో నిర్మిస్తున్న ప్రాజెక్టులు ఈ ప్రాజెక్టు పాలిట శాపంగా మారాయి. 
నాడు ఏడూర్‌లో.. నేడు సోపూర్‌లో..
మహారాష్ట్రలోని ఏడూర్‌ వాగు, కర్ణాటకలోని కరంజి వాగుల నుంచి వచ్చే వరద నీరే కౌలాస్‌నాలా ప్రాజెక్టుకు ప్రధాన ఆధారం. 2009 సంవత్సరంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఏడూర్‌ వాగు ప్రాంతంలో టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. కౌలాస్‌నాలాపై అక్రమ కట్టడం నిర్మించడాన్ని వ్యతిరేకిస్తూ అప్పట్లో ఈ ప్రాంతవాసులు ఆందోళనలు చేశారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఏడూర్‌ ప్రాజెక్టు దెబ్బతో కౌలాస్‌ నాలాలోకి వరద నీటి రాక తగ్గిపోయింది. ఖరీఫ్‌లో నీరందించినా.. రబీలో పంటలను గట్టెక్కించలేకపోతోంది. 
జుక్కల్‌ మండలంలోని సోపూర్‌ గ్రామ శివారులో కర్ణాటక ప్రభుత్వం నీటి నిల్వ వంతెన(బ్రిడ్జి కం బ్యారేజీ) నిర్మాణం చేపడుతోంది. పనులు సగం పూర్తయ్యాయి. ఈ నిర్మాణం పూర్తయితే కౌలాస్‌నాలా ప్రాజెక్టు వట్టిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. 
తగ్గిన సాగు..
కౌలాస్‌నాలా ప్రాజెక్ట్‌ నిర్మించిన తొలినాళ్లలో పూర్తిస్థాయిలో 9 వేల ఎకరాలకు సాగునీరందేది. తర్వాతి కాలంలో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోవడంతో సాగు విస్తీర్ణం తగ్గుతూ వచ్చింది. ఏడూరు ప్రాజెక్టు నిర్మాణంతో ఆయకట్టు సాగు విస్తీర్ణం సగానికి పడిపోయింది. జుక్కల్‌ మండలంలో ఐదు, బిచ్కుందలో మూడు గ్రామాలకు సాగునీరందించాల్సిన ప్రాజెక్టు.. కేవలం జుక్కల్‌ మండలంలోని 4 వేల ఎకరాలకే సాగునీరు అందిస్తోంది. పొరుగు రాష్ట్రాలు నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాలని రైతులు కోరుతున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement