భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్‌ఎన్‌ఎల్)కు ఓ ఉద్యోగి నిర్వాకంతో దాదాపు రూ.20 లక్షల వరకు ఆస్తినష్టం సంభవించింది.
♦ ఫైబర్ కేబుల్ కట్ చేశాడు
♦ బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగి నిర్వాకం
సంగారెడ్డి క్రైం: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్‌ఎన్‌ఎల్)కు ఓ ఉద్యోగి నిర్వాకంతో దాదాపు రూ.20 లక్షల వరకు ఆస్తినష్టం సంభవించింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పటాన్‌చెరు ఎస్‌డీవోటీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి.. తనకు శాఖ తరపున వాహనం కావాలని ఉన్నతాధికారులకు అర్జీ పెట్టుకున్నాడు. అయితే, అధికారులు విన్నపాన్ని తిరస్కరించడంతో అతడు సంస్థపై ఉక్రోశం పెంచుకున్నాడు. ఉద్దేశపూర్వకంగా సంస్థకు సంబంధించిన 96ఎఫ్/24ఎఫ్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్‌ను అక్రమం గా తొలగించాడు.
దీంతో పటాన్‌చెరు పరిధిలోని ఆల్విన్, బీడీఎల్, ఓడీఎఫ్, ఇక్రిశాట్, ఇస్నాపూర్, పాశమైలారం, ముత్తంగి, లక్డారం, తెల్లాపూర్ గ్రామాలకు బీఎస్‌ఎన్‌ఎల్ సేవలు నిలిచిపోయాయి. ఫైబర్ కేబుల్ కట్ కావడం వల్ల ఆయాగ్రామాలకు సంస్థ సేవలతోపాటు బ్రాడ్‌బ్రాండ్ సర్వీస్ కూడా నిలిచిపోయింది. దీంతో అధికారులు ఆ ఉద్యోగిపై నెలరోజుల క్రితం పటాన్‌చెరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలో అధికారులకు, సదరువ్యక్తికి మధ్య ఏం జరిగిందో? ఏమో గానీ, తామే అతనిపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంటూ కేసు వాపసు తీసుకుంటామని పటాన్‌చెరు పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. ఆ సంస్థ సైతం ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ తీసుకున్న దాఖలాలు లేవు.