తునిలో ఆదివారం ప్రారంభమైన కాపు ఐక్య గర్జన సభ.. ఉద్యమరూపం దాల్చిన నేపథ్యంలో అదనపు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుంటున్నాయని డీజీపీ రాముడు పేర్కొన్నారు.
తుని: కాపులను బలహీన వర్గాల జాబితాలో చేర్చి రిజర్వేషన్లు కల్పించాలని, ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా తునిలో ఆదివారం ప్రారంభమైన కాపు ఐక్య గర్జన సభ.. ఉద్యమరూపం దాల్చింది. ఈ రోజు మధ్యాహ్నం సభ ప్రారంభమైన కాసేపటికి కాపునాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.. రైల్ రోకో, రాస్తా రోకోలకు పిలుపునిచ్చారు. ఇళ్లలో ఉన్నవారంతా రోడ్లపైకి వచ్చి ఆందోళనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాపుగర్జనకు తరలివచ్చిన లక్షలాదిమంది ఒక్కసారిగా రైలు పట్టాలు, రోడ్లపైకి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఈ నేపథ్యంలో అదనపు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుంటున్నాయని డీజీపీ రాముడు పేర్కొన్నారు. కొంతమంది కావాలనే విధ్వంసానికి పాల్పడుతున్నారని చెప్పారు. ఆందోళనకారులు పోలీసులపై దాడులు చేస్తున్నా.. పోలీసులు సంయమనం పాటిస్తున్నారని ఆయన అన్నారు. తునిలో పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి యత్నిస్తున్నామని డీజీపీ రాముడు వెల్లడించారు.