సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై ఎన్‌ఆర్‌ఐల ఆసక్తి | Sakshi
Sakshi News home page

సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై ఎన్‌ఆర్‌ఐల ఆసక్తి

Published Sat, Jul 19 2014 7:01 PM

సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై ఎన్‌ఆర్‌ఐల ఆసక్తి

( షికాగో నుంచి ‘సాక్షి’ ప్రతినిధి జి.గంగాధర్)
 తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు అమెరికాలోని ఎన్‌ఆర్‌ఐలు సోలార్ విద్యుగ్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇటీవల డెట్రాయిట్‌లో జరిగిన తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జయశంకర్ రీసెర్స్ సెంటర్ అధ్యక్షుడు వి.ప్రకాష్ హాజరైన ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకోవలసిన పలు చర్యల గురించి చర్చించారు. తెలంగాణ అభివృద్ధికి ఎన్‌ఆర్‌ఐలు సహకరించాలని ప్రకాష్ చేసిన విజ్ఞప్తికి పలువురు స్పందించారు.

 సోలార్ యూనిట్ల స్థాపనకు తెలంగాణ ప్రభుత్వం తమకు తగిన సౌకర్యాలు కల్పిస్తే తాము వెంటనే వాటిని నెలకొల్పేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 2000 సంవత్సరంలో ప్రొఫెసర్ జయశంకర్ సమక్షంలో తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (టీడీఎఫ్)ను స్థాపించారు.

 కేసీఆర్‌కు ఆహ్వానం
 ఉస్మానియా, కాకతీయ, గాంధీ వైద్య కళాశాలలకు చెందిన పూర్వ విద్యార్థులు డల్లాస్ పర్యటనకు రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానించారు. మూడు వైద్య కళాశాలల పూర్వ విద్యార్థుల సంఘం తరపున ఆ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ హనుమంతరావు ఈ విజ్ఞప్తి చేశారు. అమెరికాలో పని చేస్తున్న తెలంగాణ వైద్యులందరినీ ఈ సమావేశానికి సమీకరిస్తామని ఆయన చెప్పారు. ప్రతి వైద్యుడు సుమారు పదివేల డాలర్లను తెలంగాణ అభివృద్ధికి వ్యయం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, పరిశ్రమల స్థాపనకు అవకాశం కల్పించాలని కోరారు. సిలికాన్ వ్యాలీకి చెందిన  పలువురు ఐటీ కంపెనీ ఉన్నత ఉద్యోగులు తెలంగాణ ఐటీ మంత్రి కె.తారకరామారావును తమ ప్రాంతంలో పర్యటించవలసిందిగా ఆహ్వానించారు. ప్రతి జిల్లా కేంద్రంలో మైక్రోసాప్ట్ కార్యాలయం ఏర్పాటుకు  ఆ సంస్థ అధినేత బిల్‌గేట్స్‌తో కేటీఆర్ సమావేశానికి ఏర్పాట్లు చేస్తామన్నారు. మరికొంత మంది ఎన్‌ఆర్‌ఐలు తెలంగాణలోని చెరువుల పునరుద్ధరణకు ఆసక్తి వ్యక్త పరిచారు.

 ప్రకాష్‌కు ‘తెలంగాణ ప్రజ్ఞ’  అవార్డు

 వాషింగ్టన్ తెలుగు అసోసియేషన్ తరపున వి.ప్రకాష్‌కు తెలంగాణ ప్రజ్ఞ అవార్డును బహుకరించారు. దీని కింద లక్ష రూపాయల నగదును కూడా అందించారు. తెలంగాణ  అభివృద్ధి  కోసం కృషి చేస్తున్న వ్యక్తులకు ఇక నుంచి ప్రతి సంవత్సరం ఈ అవార్డును అందిస్తామని నిర్వహకులు ప్రకటించారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement